ఫ్లోరిడాలో కేసుల తగ్గుముఖం.. రెండు నెలల తర్వాత..

ABN , First Publish Date - 2020-08-17T06:20:54+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనపడుతోంది.

ఫ్లోరిడాలో కేసుల తగ్గుముఖం.. రెండు నెలల తర్వాత..

ఆర్లాండో: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనపడుతోంది. అమెరికాలో ఒకేరోజు అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా ఫ్లోరిడా గతంలో రికార్డు కొట్టింది. ఆ సమయంలో ఫ్లోరిడాలో ఒకేరోజు 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకాలేదు. అయితే అక్కడి నుంచి ఫ్లోరిడాలో కొంచెం కొంచెంగా కేసులు తగ్గుతూ వచ్చాయి. ఇక శనివారం ఫ్లోరిడా వ్యాప్తంగా 3,779 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడాలో జూన్ 18 తర్వాత నాలుగు వేల కంటే తక్కువగా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. అంటే.. గడిచిన 2 నెలల్లో ఫ్లోరిడాలో ఒక్కరోజు కూడా నాలుగు వేల కంటే తక్కువగా కేసులు నమోదుకాలేదు. ఇక ఇప్పుడు కేసుల్లో తగ్గుముఖం కనపడటంతో అధికారులు కొంచెం ఉపశమనం పొందుతున్నారు. అయితే ఇందులో ఆనందించాల్సిన విషయం ఏమీ లేదని.. నిత్యం నాలుగు వేల కేసులు నమోదుకావడం ఆందోళన చెందాల్సిన విషయమేనని నిపుణులు చెబుతున్నారు. ఇక కొత్తగా నమోదైన కేసులతో ఫ్లోరిడా వ్యాప్తంగా ఇప్పటివరకు 5,73,416 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క శనివారం ఒక్కరోజే కరోనా కారణంగా 107 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,452కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 55,46,622 కేసులు నమోదు కాగా.. కరోనా బారిన పడి 1,72,870 మంది మృత్యువాతపడ్డారు.  

Updated Date - 2020-08-17T06:20:54+05:30 IST