ఫ్లోరిడాలో 23వ రోజు కూడా 9 వేలకు పైగా కేసులు

ABN , First Publish Date - 2020-07-27T07:07:37+05:30 IST

ఫ్లోరిడాలో కొత్తగా 9,259 కరోనా కేసులు నమోదైనట్టు ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్

ఫ్లోరిడాలో 23వ రోజు కూడా 9 వేలకు పైగా కేసులు

ఆర్లాండో: ఫ్లోరిడాలో కొత్తగా 9,259 కరోనా కేసులు నమోదైనట్టు ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో ఫ్లోరిడాలో మొత్తం కేసుల సంఖ్య 4,18,844కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. ఇక అమెరికాలో అత్యధిక కరోనా కేసుల విషయానికి వస్తే.. ఫ్లోరిడా రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారింది. ఫ్లోరిడాలో నిత్యం 9 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఏకంగా ఒకే రోజు 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఒకే రోజు ఒకే రాష్ట్రం నుంచి ఇన్ని కేసులు నమోదుకావడం అదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో 77 మంది కరోనా కారణంగా మరణించినట్టు పేర్కొంది. దీంతో మొత్తం మరణాలు 5,857గా ఉన్నాయి. ఫ్లోరిడాలో 9 వేలకు తగ్గకుండా కేసులు నమోదుకావడం ఇది 23వ రోజని అధికారులు చెబుతున్నారు. కాగా.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు  41,74,437 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి మొత్తంగా  1,46,391 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-27T07:07:37+05:30 IST