గంటల వ్యవధిలోనే కరోనాకు ఇద్దరు కొడుకులు బలి.. వ్యాక్సినేషన్‌పై తల్లి కీలక వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2021-08-23T07:05:04+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా 12 గంటల వ్యవధిలోనే ఓ తల్లి తన ఇద్దరు కుమారులను కోల్పోయి శోకసంద్రంలో

గంటల వ్యవధిలోనే కరోనాకు ఇద్దరు కొడుకులు బలి.. వ్యాక్సినేషన్‌పై తల్లి కీలక వ్యాఖ్యలు..

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా 12 గంటల వ్యవధిలోనే ఓ తల్లి తన ఇద్దరు కుమారులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయిన ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆరోన్ జగ్గీ (35), ఫ్రీ జగ్గీ (41) అనే సోదరులు ఇద్దరూ తన తల్లి లీసా బ్రాండన్‌తో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. అగ్రరాజ్యంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో తల్లితో సహా ఇద్దరు సోదరులూ.. జూలై చివరి వారంలో మహమ్మారి బారినపడ్డారు. ఈ క్రమంలో ముగ్గురూ స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేరారు. దీంతో లీసా బ్రాండన్.. ఆరోగ్యం కాస్త కుదుటపడింది. అయితే ఆమె కుమారుల పరిస్థితి మాత్రం రోజురోజుకీ క్షీణించి.. పరిస్థితి వెంటిలేటర్ సపోర్ట్ వరకు వెళ్లింది. 



ఈ నేపథ్యంలోనే వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఫ్రీ జెగ్గీ ఆగస్టు 12న కన్నుమూశాడు. మహమ్మారికి సోదరుడు బలైన గంటల వ్యవధిలోనే ఆగస్టు 13న ఆరోన్ జగ్గీ తుదిశ్వాస విడిచాడు. గంటల వ్యవధిలోనే ఇద్దరు కుమారులూ మరణించడంతో ఆ తల్లిపేగు తల్లడిల్లింది. కాగా.. లీసా బ్రాండన్ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని.. తన పరిస్థితి మరెవరీకి రావొద్దని కోరుకుంటూ వ్యాక్సినేషన్‌పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారులు ఇద్దరూ వ్యాక్సిన్ తీసుకోలేదని.. తాను మాత్రం టీకాను తీసుకున్నట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే తాను మహమ్మారి నుంచి బయటపడ్డట్టు చెప్పారు. ఒకవేళ తన కుమారులు కూడా టీకా తీసుకుని ఉండి ఉంటే.. వారు బతికేవారని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తన జీవితంలో చోటు చేసుకున్న విషద ఘటనను చూసైనా.. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలంటూ ఆమె ప్రజలను కోరుతున్నారు. 


Updated Date - 2021-08-23T07:05:04+05:30 IST