పూల పండుగ

ABN , First Publish Date - 2022-09-25T05:20:09+05:30 IST

మహాలయ అమావాస్య రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగకు పల్లెలు, పట్టణాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు సంబురాలు మార్మోగనున్నాయి. తొలిరోజు ఎంగిలి పూలతో ఆరంభమై తొమ్మిదో రోజు సద్దుల వేడుకలతో ముగుస్తాయి.

పూల పండుగ

తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మతో సంబురాలు ప్రారంభం

హోరెత్తనున్న ఉయ్యాల పాటలు

వేడుకలకు ముస్తాబైన పల్లెలు, పట్టణాలు

నేటి నుంచి బతుకమ్మ పండుగ


నేటి నుంచి పూల జాతర మొదలవనుంది. ఆదివారం నుంచి ఊరూవాడా బతుకమ్మ సంబురాలతో మురిసిపోనుంది. ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలతో పరవశించనున్నారు. పెత్రమాసతో మొదలయ్యే సంబురాలు సద్దుల బతుకమ్మ వేడుకలతో ముగియనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పల్లె, పట్టణం పూల సింగిడిగా మారనున్నాయి.


చిన్నకోడూరు/జగదేవ్‌పూర్‌/మెదక్‌ కల్చరల్‌, సెప్టెంబరు 24  : మహాలయ అమావాస్య రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగకు పల్లెలు, పట్టణాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు  సంబురాలు మార్మోగనున్నాయి. తొలిరోజు ఎంగిలి పూలతో ఆరంభమై తొమ్మిదో రోజు సద్దుల వేడుకలతో ముగుస్తాయి. 


పూలను పూజించే పండుగ

పూలతో దేవుడిని పూజించడం సర్వసాధారణం. కానీ ఆ పూలనే పరమ పవిత్రంగా పూజించడం ఒక్క తెలంగాణలోనే ప్రత్యేకం. ప్రకృతిని అమ్మగా భావించి పూజించే గొప్ప పండుగ ఇది. బతుకమ్మ అనగా బతుకును ఇచ్చే అమ్మ అని అర్థం. శివుని భార్య గౌరీదేవీ మహిషాసురునితో పోరాడి అతన్ని వధించిన అనంతరం అలసిపోయి ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నాడు మూర్చపోయిందని, ఆమె మూర్చ నుంచి తేరుకోవడానికి వివిధ రీతుల్లో గౌరీదేవిని స్తుతించారని తెలంగాణ ప్రాంత జానపదుల ప్రతితీ. మరికొన్ని కథలు పల్లెల్లో ప్రచారం ఉన్నాయి.


తీరొక్క పూలతో ముస్తాబు

బతుకమ్మల కోసం ప్రత్యేకంగా సభి అనే వెదురుతో చేసిన కంచం లేదా చిన్న సైజు తబుకు అని పిలిచే ఇత్తడి, రాగి, స్టీలు, అల్యూమినియం పాత్రలో ఏదో ఒకటి వాడుతుంటారు. ముందుగా గుమ్మడి ఆకు లేదా ఏదైనా పెద్దగా, వెడల్పుగా ఉండే ఆకులను పళ్లెంలో పరుస్తారు. గుమ్మడి పువ్వును తొలుతగా పెడతారు. అనంతరం తంగేడు పువ్వులతో మొదలు పెట్టి, గునుగ పువ్వు, చామంతి, గడ్డిపూలు, అల్లి, కట్ల, పట్టుగుచ్చులు ఇలా రకరకాల పూలతో అందంగా వరుసగా పేర్చి తీర్చిదిద్దుతారు. బతుకమ్మపై పసుపుతో తయారుచేసిన గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. బియ్యపు పిండితో చేసిన దివ్వెతో దీపం వెలిగించి పూజిస్తారు. ప్రస్తుతం పండుగలో పూల బతుకమ్మలు కనుమరుగవుతున్నాయి. పూల ధరలు పెరగడంతో కాగితపు బతుకమ్మలు వచ్చాయి.


ఆడపడుచుల హంగామా

కొత్తగా పెళ్లయిన ఆడపడుచులు అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లడానికి ఎంతో ఆసక్తిగా వెయ్యి కళ్లతో ఎదురుచూసే పండుగ బతుకమ్మ. ప్రకృతి శక్తికి, భక్తికి, ఆచారాలకు, సంప్రదాయాలకు దైవత్వాన్ని ముడిపెట్టి తమను వైపరీత్యాలకు గురి చేయొద్దంటూ ఆరాధనగా వేడుకోవడమే పండుగ పరమార్థం. పడతులు తమ పసుపు, కుంకుమలను పది కాలాల పాటు పదిలపరచమని కోరుతూ గౌరీదేవికి పూజలు చేస్తారు. సాయంత్రం మహిళలంతా బతుకమ్మలను తీసుకుని ప్రధాన కూడలిలో పెట్టి ఒకరి పక్కన ఒకరు నిలబడి గుండ్రంగా తిరుగుతూ ఆడతారు. 


తొమ్మిది రోజులు.. తొమ్మిది రకాలు

బతుకమ్మను తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. తొమ్మిది రోజలు తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను అమావాస్య రోజు పేరుస్తారు. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూలను ఒక రోజు ముందే తెంపుకొచ్చి వాడి పోకుండా వాటిని నీళ్లలో లేదా తేమ ఉన్న వస్త్రంలో ఉంచి మరుసటి రోజు బతుకమ్మను పేరుస్తారు. అందుకే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. వాయినంగా తమలపాకులు ఇచ్చుకుంటారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, నైవేద్యంగా అటుకులు సమర్పిస్తారు. మూడో రోజు ముద్ద పప్పు బతుకమ్మగా కొలుస్తారు. నైవేద్యంగా ముద్దపప్ప్పు, బెల్లంను చేస్తారు. నాల్గో రోజు నాన బియ్యం బతుకమ్మ, నైవేద్యంగా నానేసిన బియ్యం. పాలు, బెల్లంతో కలిపిన ముద్ధలు చేస్తారు. ఐదోరోజు అట్ల బతుకమ్మగా పిలుస్తారు. నైవేద్యంగా పిండితో చేసిన అట్లనుసమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఆరోజు బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, నైవేద్యంగా సకినాల పిండిని వేపకాయ ముద్దలుగా చేసి నూనెలో వేయిస్తారు. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా కొలుస్తారు. నైవేద్యంగా నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యి సమర్పిస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా పిలిచే పెద్ద బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇదే బతుకమ్మ వేడుకల్లో చివరి రోజు. 


బతుకమ్మ పాటలు ప్రత్యేకం

ఇద్దరక్కచెల్లెలను ఉయ్యాలో.. ఒక్కూరికిచ్చిరీ ఉయ్యాలో.. ఒక్కడే మా అన్న ఉయ్యాలో.. వచ్చన్నవోడాయే ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. కలవారి కోడలు ఉయ్యాలో... కలికి కామాక్షి ఉయ్యాలో... కడుగుచున్నది పప్పు ఉయ్యాలో.. కడువలో పోసి ఉయ్యాలో.. 

అంటూ రాగయుక్తంగా సాగే బతుకమ్మ ఉయ్యాల పాటలు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆడుతూ పాడాతారు. పాట తెలిసిన ఒకరు బతుకమ్మ పాటను ఆలపిస్తూ ఉంటే మిగిలిన వారంతా చప్పట్లు కొడుతూ ఆమెను అనుసరిస్తూ గొంతు కలుపుతారు. పువ్వుల గురించి, పురాణాలను చర్చించే, బతుకు సత్యాలను, శ్రమ జీవుల వెతలను బతుకమ్మ పాటలుగా పాడుతారు. పొద్దుపోయే వరకు ఆడి, పాడుతారు. అనంతరం పోయిరా బతుకమ్మ... పోయి రావమ్మా అంటూ సమీపంలోని చెరువులు, కుంటల్లో  నిమజ్జనం చేస్తారు. చెరువులో నుంచి కొంచెం నీరు తీసుకోని పసుపుతో చేసిన గౌరమ్మను ఆ నీటితో కలిపి మహిళలు ఒకరికొకరు గదవలకు పూసుకుంటారు. అక్కడికి తెచ్చుకున్న సద్దులతో మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు.


ఖండాంతరాలను దాటిన సంబురం

పూర్వ కాలం నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగకు విశిష్ట ప్రాధాన్యం ఉన్నప్పటికీ మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఈ పండుగకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఉద్యమంలో బతుకమ్మ పాట కూడా తమ వంతు పాత్ర పోషించింది. తెలంగాణకే ప్రత్యేకమైన ఈ పండుగ గత రెండు దశాబ్దాలుగా ఖండాంతరాలు దాటి పలు దేశాలలోనూ ఆడడం ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐలు బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బతుకమ్మ పండుగకు విశేష ప్రాముఖ్యతనిస్తుంది. కొన్నేళ్లుగా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ  చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 

Updated Date - 2022-09-25T05:20:09+05:30 IST