బీజేపీలో లుకలుకలు

ABN , First Publish Date - 2021-01-16T04:48:22+05:30 IST

రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీ జిల్లాలో మాత్రం దారి తప్పుతున్నది.

బీజేపీలో లుకలుకలు

- జిల్లాలో గాడిన పడని పార్టీ

- ఎవరికి వారుగానే కార్యక్రమాలు 

- పది నెలలైనా ఏర్పాటుకాని జిల్లా కార్యవర్గం

- నేతల మధ్య కొరవడిన సమన్వయం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీ జిల్లాలో మాత్రం దారి తప్పుతున్నది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరిస్తుండంతో పార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొన్నది. పది నెలలుగా పార్టీ జిల్లా కార్యవర్గాన్ని నియమించకపోవడంతో పదవులపై ఆశలు పెంచుకున్న నేతలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. దీనిపై రాష్ట్ర నాయకత్వం ఏమి పట్టించుకోకపోవడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తికి గురై అధిష్టానానికి లేఖ రాసినట్లుగా ప్రచారం జరుగుతున్నది. పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో వర్గపోరు తీవ్రంగా ఉండగా, మంథని నియోజకవర్గంలో పార్టీ అంతంత మాత్రంగానే ఉన్నది. 

నేతల్లో సమన్వయ లోపం..

రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు పార్టీ వైపు చూస్తున్నారు. అయితే జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. జిల్లా పార్టీ నేతల్లో సమన్వయం లేకపోవడం, వర్గాలు పెరుగుతుండడంతో ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ముందుకు రావడం లేదు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్‌ వివేక్‌, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ 2019లో బీజేపీలో చేరారు. అప్పటినుంచి సదరు నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈక్రమంలో గత ఏడాది ఫిబ్రవరిలో జిల్లా అధ్యక్షుడిగా సోమారపు సత్యనారాయణను పార్టీ నియమించింది. ఆ తర్వాత ఒకటి, రెండు నెలల్లో జిల్లా కార్యవర్గాన్ని నియమించాల్సి ఉండగా, జిల్లాలో మాత్రం పది నెలలు కావస్తున్నా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. జిల్లా అధ్యక్షుడు కార్యవర్గ జాబితాను సిద్ధం చేసి పార్టీ అధిష్టానానికి పంపించారు. ఆ జాబితాను అందరు నేతలను సంప్రదించి సిద్ధం చేయలేదని పార్టీకి చెందిన కొందరు నేతలు రాష్ట్ర నాయకత్వానికి తెలపడంతో నిలిచిపోయింది. చేర్పులు, మార్పులు చేసైనా పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుడు, నాయకులను సంప్రదించి కమిటీని వేయాల్సి ఉండగా కొలిక్కి తీసుకరావడం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన బండి సంజయ్‌కుమార్‌ జిల్లాపై తనదైన ముద్రను వేసుకుంటున్నారు. గతంలో రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి గుజ్జుల రామకృష్ణారెడ్డి, బల్మూరి వనితలకు బండి కార్యవర్గంలో చోటు లభించలేదు. జిల్లాకే చెందిన దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు రాష్ట్ర ప్రధానకార్యదర్శి పదవిని కల్పించారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను గుజ్జుల, ప్రదీప్‌కుమార్‌ వర్గీయులు ఎవరికి వారుగా చేపడుతున్నారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రామగుండంలోనూ మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, వివేక్‌ వర్గీయులు ఎవరికి వారుగా కార్యక్రమాలు చేపడుతుండడంతో జిల్లా అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఏకంగా ఆయన పార్టీ నేతల వైఖరిపై పది రోజుల క్రితం అధిష్టానానికి లేఖ రాసినట్లు తెలుస్తున్నది. జిల్లా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించి పార్టీని గాడిన పడేయాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. 

Updated Date - 2021-01-16T04:48:22+05:30 IST