వరద సాయం ఎంత!?

ABN , First Publish Date - 2020-12-02T04:36:11+05:30 IST

జిల్లా రైతాంగానికి గత ఏడాది కాలంగా ఎదురైనన్ని చేదు అనుభవాలు మునుపెన్నడూ లేదు.

వరద సాయం ఎంత!?
కోవూరు : వేగూరులో నేలమట్టమైన అరటి తోట

సీఎం ఆదేశాలు ఆచరణ సాధ్యమేనా!?

ఖరీఫ్‌ వంచనకు రబీలో న్యాయం జరిగేనా!?

నష్టపరిహారంపైనే అన్నదాత ఆశలు


ఖరీ్‌ఫలో వంచనకు గురైన అన్నదాతకు రబీలో అయినా న్యాయం జరిగేనా!? వరద సాయంలో మానవీయ కోణంలో ఆలోచించామన్న ముఖ్యమంత్రి ఆదేశాలు ఆచరణలో కనిపించేనా!? వరద సాయం వాస్తవ నష్టానికి దగ్గరగా అందుతుందా!? లేదా కాగితాలకే పరిమితం అవుతుందా!?  ఇలా సవాలక్ష ప్రశ్నలు జిల్లా రైతాంగంలో కలుగుతోంది. వరద సాయం విషయంలో అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు మొదలైన క్రమంలో రైతులకు అందే వరస సాయంపై అన్ని వర్గాల్లోనే ఆసక్తి నెలకొంది.


నెల్లూరు. డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా రైతాంగానికి గత ఏడాది కాలంగా ఎదురైనన్ని చేదు అనుభవాలు మునుపెన్నడూ లేదు. కరోనా ప్రభావం తో వ్యవసాయ పెట్టుబడులు అమాంతం పెరిగిపోయాయి. వాతావరణం అనుకూలించక దిగుబడి దిగజారిపోయింది. కోతకొచ్చిన పంటను అకాల వర్షం ముంచేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దళారులు రైతు కష్టాన్ని దోచుకున్నారు. అధికార పార్టీ నేతలే దళారుల అవతారం ఎత్తి వందల కోట్ల రూపాయలు దండుకున్నారనే విమర్శలు పెల్లుబికాయి. దళారులకుపోగా మిగిలిన సొమ్ము అయినా చేతికందిందా అంటే అదీ లేదు. ధాన్యం డబ్బు రైతు ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.


నివర్‌ ముంచేసింది!

ఇన్ని కష్టాల నడుమ రబీకి సిద్ధపడిన రైతును నివర్‌ రూపంలో తుఫాన్‌ నిలువునా ముంచింది. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలను ధ్వంసం చేసింది. అధికారుల ప్రాథమిక అంచనా మేరకు 17,648 హెక్టార్లలో వరి నీట మునిగింది. మరో 25వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టాన్ని అధికారులు మరోసారి అధ్యయనం చేస్తున్నారు. వాస్తవానికి పంట నష్టపోయిన విస్తీర్ణం ఇంతకు రెట్టింపు ఉంటుందని రైతులు అంటున్నారు. వాస్తవ విస్తీర్ణంపై అధికారులు సర్వే చేస్తున్న క్రమంలో విస్తీర్ణం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

అయితే, నష్టపరిహారం ఎంత ఇస్తారు..:!? ఎప్పుడు ఇస్తారు అన్నదే ఇప్పుడు రైతులను వేదిస్తున్న ప్రధాన సమస్య. ప్రాథమిక సమాచారం ప్రకారం వరి పంటకు హెక్టారుకు రూ.15వేలు పరిహారం ఇస్తారని అంటున్నారు.  దీనిపై స్పష్టత లేదు. వాస్తవానికి హెక్టారు వరి నాట్లకు  30వేల వరకు ఖర్చు అయ్యింది. వరద దెబ్బకు ఈ పెట్టుబడులు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. మళ్లీ నాట్లు వేయాలంటే హెక్టారుకు రూ.30 వేలు ఖర్చు చేయక తప్పని పరిస్థితి. ఏడాది కాలంగా ఎదురుదెబ్బలు తిని అప్పులు పాలైన రైతన్నకు వరద సాయమైనా వాస్తవ వ్యయానికి సమానంగా అందకపోతే మరింత చితికిపోవడం ఖాయం. 

ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే సుమారు 45 వేల హెక్టార్లలో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉదాహరణకు కొండాపురం మండలం తూర్పు ఎర్రబెల్ల పంచాయితీకి చెందిన మోడేపల్లి కొండలరావు 40 ఎకరాలు కౌలుకు తీసుకొని మినుము సాగు చేశారు. సాగుకు రూ.6 లక్షలు ఖర్చు చేశారు. మర్రిపాడు మండలానికి చెందిన కన్నమరకల రమణయ్య 1.5 ఎకరాల్లో మిరప సాగుచేశారు. 1.5 లక్షల రూపాయలు పంట సాగుకు ఖర్చు చేశారు. వాస్తవ నష్టం మాట అటుంచి ఇప్పటివరకు అధికారులు ఈ పొలం వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే చేపల చెరువులపై వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు. వరద పోటెత్తడంతో వందల హెక్టార్ల విస్తీర్ణంలోని చేపలు మొత్తం ఏటి పాలయ్యాయి. చేపల రైతులు కోట్లలో నష్టపోయారు. ముఖ్యమంత్రి జగన్‌ అన్నట్లు మావనీయ కోణంలో పరిశీలిస్తే పల్లె పల్లెలో గుండె పిండేసే రైతుల వ్యఽథలు లెక్కకు మించి కనిపిస్తాయి. వీటన్నింటిని సావధానంగా పరిశీలించి పెట్టుబడి రూపంలో రైతు ఎంత నష్టపోయాడో ఆ మేర పరిహారం అందించినప్పుడే అన్నదాతలకు మేలు చేసినట్లు అవుతుంది. లేదంటే సహాయక చర్యలు కంటి తుడిపే అవుతాయనడంలో అనుమానం లేదు.



ఈ చిత్రంలో చేపల చెరువు గట్టు మీద నిలబడి ఉన్న  ఈయన పేరు నండూరి రవీంద్రరెడ్డి. సంగం మండలం పెరమన గ్రామం. తనకున్న పదెకరాలను చెరువులుగా మార్చి, ఏడు నెలలుగా చేపలు పెంచుతున్నాడు. ఇప్పటిదాకా రూ.20 లక్షల పెట్టుబడి అయింది. పది రోజుల్లో చేపలు పట్టాల్సి ఉండగా తుఫాన్‌ ప్రభావంతో అటు పెన్నా వరద, ఇటు బీరాపేరు వరదతో చెరువు కట్టలు మునిగిపోయి చేపలన్నీ కడలి పాలయ్యాయి. సుమారు రూ.35 లక్షలు నష్టం వాటిల్లింది. కనీసం పెట్టుబడి ఖర్చు అయినా ఇవ్వాలని రవీంద్రారెడ్డి వేడుకుంటున్నాడు. 


కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామానికి చెందిన యువ కౌలు రైతు మహే్‌షరెడ్డి. అనంతసాగరం మండలంలోని కామిరెడ్డిపాడులో 50 ఎకరాలు కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయంతో మునగ సాగు చేశాడు. తుఫాన్‌తో  చేతికందిన పంట పనికి రాకుండా పోయింది.  పంట కోసం రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు వాపోయాడు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. 



3 ఎకరాలు నిండిపోయింది

వర్షాలు కురుస్తుండటంతో ఈ ఏడాదైనా పంటలు బాగా పండుతాయన్న ఆశతో అప్పు చేసి మూడెకరాల్లో వరి సాగు చేపట్టా. తుఫాన్‌ పుణ్యమా అని పెట్టిన పంట అంతా మునిగి  కుళ్లిపోయింది. విత్తనాలు, దుక్కి, అడుగుమందు వంటి వాటికి ఖర్చు చేసిన  రూ.40వేలు పూర్తిగా నష్టపోయా. తిరిగి నాట్లు వేసుకునేందుకు ప్రభుత్వం ఆదుకోవాలి. 

-  బెల్లంకొండ శీనయ్య, కాపులూరు, నాయుడుపేట మండలం



10 ఎకరాలు పూర్తిగా దెబ్బతింది 

20 ఎకరాల వరిసాగు చేపట్టా. తుఫాన్‌ వల్ల పొలాల్లో నీరు చేరి పదెకరాల్లో పంట పూర్తిగా మునిగిపోయింది.   రూ.15వేలు వంతున నష్టపోయా. జరిగిన నష్టం మేర  పరిహారం ఇప్పించాలి.

 - వేమసాని బాబునాయుడు,  సింగనాలత్తూరు, దొరవారిసత్రం మండలం



నష్టపరిహారం ఇవ్వాలి  

నివర్‌ తుఫానుతో నాలుగున్నర ఎకరాల్లో పైరు దెబ్బతింది. రూ.1.05 లక్షల అప్పు తెచ్చి వరి సాగు చేశా.  పాడైపోయిన పంటకు వైఎస్సార్‌ బీమా పథకం వర్తిస్తుందో లేదో అనుమానంగా ఉంది.  రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.

- షేక్‌ గౌస్‌ మొహద్దీన్‌, వాకాడు



Updated Date - 2020-12-02T04:36:11+05:30 IST