Airfares: దీపావళి సీజన్‌లో విమాన చార్జీల మోత.. 30శాతం వరకు అదనంగా వెచ్చించాల్సిందేనట

ABN , First Publish Date - 2022-09-20T13:25:16+05:30 IST

ఈ దీపావళి సీజన్‌లో విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. గత ఏడాదితో పోలిస్తే, విమాన టికెట్‌ చార్జీలపై 20 నుంచి 30 శాతం వరకు అదనంగా వెచ్చించాల్సి రావచ్చు.

Airfares: దీపావళి సీజన్‌లో విమాన చార్జీల మోత.. 30శాతం వరకు అదనంగా వెచ్చించాల్సిందేనట

గత ఏడాదితో పోలిస్తే 20-30శాతం అదనంగా చెల్లించాల్సి రావచ్చు: ఇక్సిగో  

విమాన ప్రయాణం దీపావళికి మరింత ప్రియం

న్యూఢిల్లీ: ఈ దీపావళి సీజన్‌లో విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. గత ఏడాదితో పోలిస్తే, విమాన టికెట్‌ చార్జీలపై 20 నుంచి 30 శాతం వరకు అదనంగా వెచ్చించాల్సి రావచ్చు. ఎందుకంటే, దీపావళి సీజన్‌లో ప్రయాణానికి ముందస్తు టికెట్‌ బుకింగ్స్‌ జోరందుకోవడంతో పాటు గత ఏడాదితో పోలిస్తే విమాన ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరలు భారీగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే, ఈ నెలలో ఏటీఎఫ్‌ కోసం ఎయిర్‌లైన్స్‌ 83 శాతం అధికంగా చెల్లించాల్సి వస్తోంది. దసరా, దీపావళి సీజన్‌లో విహారయాత్ర కోసం అందుబాటులో ఉన్న విమానాల కోసం సెర్చ్‌లు 25-30 శాతం పెరిగాయని ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ బుకింగ్‌ పోర్టల్‌ ఇక్సిగో సహ వ్యవస్థాపకులు రజినీశ్‌ కుమార్‌ తెలిపారు. 


ఈసారి విదేశీ యాత్రలపై ఆంక్షలు కూడా లేనందున పండగ సీజన్‌లో యాత్రలు కరోనా పూర్వ స్థాయికి చేరుకోవచ్చన్నారు. ఈ దఫా పండగ యాత్ర ల మార్కెట్‌ వార్షిక ప్రాతిపదికన 35 శాతం వరకు వృద్ధి నమోదు చేసుకోవచ్చని అంచనా. ఇక్సిగో విశ్లేషించిన డేటా ప్రకారం.. ఢిల్లీ-ముంబై, బెంగళూరు-ఢిల్లీ, హైదరాబాద్‌-ఢిల్లీ వంటి ప్రధాన నగరాల మధ్య విమాన సర్వీసుల సగటు చార్జీలు 20-33 శాతం వరకు పెరిగాయి. ఢిల్లీ-హైదరాబాద్‌ మార్గంలో విమాన చార్జీ గత ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరిగింది. కోల్‌కతా-ఢిల్లీ, కోల్‌కతా-ముంబై, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు మార్గాలకు ఎయిర్‌ టికెట్‌ ధరలు వార్షిక ప్రాతిపదికన 2-7 శాతం పెరిగాయి. కాగా, ముంబై-ఢిల్లీ, బెంగళూరు-ఢిల్లీ, హైదరాబాద్‌-ఢిల్లీ మార్గాల్లో చార్జీ 20-33 శాతం వరకు ఎగబాకింది. 

Updated Date - 2022-09-20T13:25:16+05:30 IST