Dubai వెళ్తున్నారా? అయితే ఈ ఐదు విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి

ABN , First Publish Date - 2021-11-24T16:00:57+05:30 IST

ఈ నెల 25 నుంచి డిసెంబర్ 5 మధ్య దుబాయ్ వచ్చేవారు తప్పకుండా ఐదు విషయాలు గుర్తుపెట్టుకోవాలని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ పది రోజుల పాటు దుబాయ్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల తాకిడి భారీగా ఉండబోతున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రకటన చేశారు. సుమారు 18లక్షల మంది...

Dubai వెళ్తున్నారా? అయితే ఈ ఐదు విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి

దుబాయ్: ఈ నెల 25 నుంచి డిసెంబర్ 5 మధ్య దుబాయ్ వచ్చేవారు తప్పకుండా ఐదు విషయాలు గుర్తుపెట్టుకోవాలని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ పది రోజుల పాటు దుబాయ్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల తాకిడి భారీగా ఉండబోతున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రకటన చేశారు. సుమారు 18లక్షల మంది ఈ పది రోజుల్లో దుబాయ్ విమానాశ్రయం నుంచి ప్రయాణించనున్నారని సమాచారం. అంటే రోజుకు సగటున 1.64లక్షల మంది ప్రయాణికులు రానున్నారు. ఇక డిసెంబర్ 4న అత్యధికంగా 1.90లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందట. ఇలా ఈ పది రోజుల పాటు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది కనుక దుబాయ్ వచ్చేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.  


"విమానాశ్రయ అన్ని విభాగాల వారి సహకారంతో ఇప్పటివరకు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూశాం. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ది బెస్ట్ సర్వీసులు అందించాం. అయితే ఈ పీక్ సమయంలో దుబాయ్ వచ్చేవారు కొన్ని ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవడం వల్ల తమ ప్రయాణాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించవచ్చు" అని దుబాయ్ ఎయిర్‌పోర్టులోని టర్మినల్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈస్సా అల్ షంసీ వెల్లడించారు.  


దుబాయ్ ఎయిర్‌పోర్టు వెళ్లే ప్రయాణికులు గుర్తు పెట్టుకోవాల్సిన ఐదు విషయాలివే:

* మీరు ప్రయాణించే గమ్యస్థానానికి సంబంధించిన తాజా ప్రయాణ నిబంధనల గురించి ముందే పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి ముందే అక్కడ చూపించాల్సిన ధృవపత్రాల గురించి మీరు ప్రయాణిస్తున్న ఎయిర్‌లైన్ వారిని అడిగి తెలుసుకుని వాటిని రెడీగా పెట్టుకోవాలి. దీని వల్ల మీరు త్వరగా విమానాశ్రయం నుంచి బయటపడొచ్చు.  

* రద్దీ సమయాల్లో దుబాయ్ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారులు రద్దీగా ఉండే అవకాశం ఉన్నందున విమానాశ్రయానికి చేరుకోవడానికి కొంత అదనపు సమయాన్ని కేటాయించండి.

* మీరు ప్రయాణించాల్సిన విమానం టెర్మినల్ 1 నుండి బయల్దేరేటట్లయితే, మీ డిపార్చర్ సమయానికి మూడు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోండి. టెర్మినల్ 3 నుండి బయలుదేరే వారు మీ విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు వరకు చెక్-ఇన్ చేయడం ద్వారా క్యూలను అధిగమించవచ్చు.

* మీ ప్రయాణాన్ని సాఫీగా ప్రారంభించేందుకు అందుబాటులో ఉన్న చోట ఆన్‌లైన్, సెల్ఫ్ సర్వీసులను ఉపయోగించండి.

* రద్దీగా ఉండే ఈ సమయాల్లో విమాన టికెట్ ఉన్న ప్రయాణీకులు మాత్రమే డిపార్చర్ జోన్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. కనుక కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులను మీ ఇంట్లో వీడ్కోలు చెప్పండి.

Updated Date - 2021-11-24T16:00:57+05:30 IST