కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో బడా బకాయిలపై దృష్టి

ABN , First Publish Date - 2022-05-26T04:11:42+05:30 IST

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో బడా బకాయిలకు చెందిన ఆస్తి పన్ను వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో ఎస్పీఎం, సర్‌సిల్క్‌ మిల్లు ఉండగా, ఎస్పీఎం నుంచి రూ.4 కోట్లు, సర్‌సిల్క్‌ మిల్లు నుంచి రూ.3 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు రావాల్సి ఉంది.

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో బడా బకాయిలపై దృష్టి

- ఎస్పీఎం నుంచి రూ.4 కోట్లు

- సర్‌సిల్క్‌ మిల్లు నుంచి రూ.3 కోట్లు 

- ఎస్పీఎం క్వార్టర్లపై కొనసాగుతున్న జాయింట్‌ సర్వే

- పక్షం రోజుల్లో తేలనున్న లెక్క

- బకాయిలు వసూలు చేస్తేనే తీరనున్న కష్టాలు 

కాగజ్‌నగర్‌, మే 25: కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో బడా బకాయిలకు చెందిన ఆస్తి పన్ను వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో ఎస్పీఎం, సర్‌సిల్క్‌ మిల్లు ఉండగా, ఎస్పీఎం నుంచి రూ.4 కోట్లు, సర్‌సిల్క్‌ మిల్లు నుంచి రూ.3 కోట్లు ఆస్తి పన్ను బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిలు వసూలు చేస్తే కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఏరియర్స్‌, ఇతర జీతభత్యాలు చెల్లించే వీలుంటుంది. ఈ లక్ష్యంతో అధికారులు పావులు కదుపుతున్నారు. గత మార్చి నెలలోనే పూర్తి స్థాయిలో చెల్లించాలని రెండు మిల్లులకు నోటీసులు పంపించారు. 2014నుంచి ఎస్పీఎం మిల్లు మూతబడింది. 2018లో కొత్తగా జేకేయాజమాన్యం చేతుల్లోకి తీసుకుంది. పాత బకాయి చెల్లింపులకు మినహాయింపు ఇచ్చి ప్రస్తుతం వచ్చే బిల్లుపై తమకు రివైజర్డ్‌ సర్వే చేసి నూతన బిల్లులు ఇచ్చేట్టు చూడాలని ఎస్పీఎం యాజమాన్యం మున్సిపల్‌ అధికారులకు నెల రోజుల క్రితం దర ఖాస్తు చేసుకున్నారు. మున్సిపల్‌ అధికారులు, బిల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్పీఎం ఇన్‌చార్జీలు కొన్ని రోజులుగా కాలనీల్లో క్వార్టర్ల లెక్కింపులు చేస్తున్నారు. ఈ లెక్కింపులు కూడా పక్షం రోజుల్లోనే పూర్తి అయితే ఎన్ని క్వార్టర్లకు ఎంత మేర బిల్లులు వసూలు చేయాలన్నది తేలుతుంది. దీంతో ఎస్పీఎం నుంచి రావాల్సిన బకాయిలు క్లియర్‌ కానుంది. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను క్లియరెన్స్‌ అయ్యేందుకు అడుగులు పడుతుండటంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సర్‌సిల్క్‌ మిల్లు నుంచి రూ.3 కోట్ల మేర బకాయిలు ఉండటంతో మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది హైకోర్టు లిక్విడేటర్‌కు తమ బకాయిలు చెల్లింపులు చేయాలని నోటీసులను అందించారు. ప్రస్తుతం సర్‌సిల్క్‌ భూములు ఎంత ఉన్నాయి..? కబ్జాలో ఎంత ఉంది..? బిడ్డర్‌కు ఎంత భూములు పోతున్నాయనే విషయంలో అధికారుల సర్వేలు చేపట్టారు. ఈ ప్రక్రియ లిక్విడేటర్‌ పరిధికి చేరగా భూముల అమ్మకాలపై స్పష్టత రానుంది. ఈ భూముల అమ్మకాల ప్రక్రియ పూర్తి అయితే తొలుత సర్‌సిల్క్‌ మిల్లు కార్మికుల బకాయిలు చెల్లింపులు, ఆ తర్వాత మున్సిపల్‌ కార్యాలయల బకాయిల చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామని హైకోర్టుకు లిక్విడేటర్‌ తెలిపినట్టు తెలిసింది. బడాబకాయిల పెండింగ్‌ వసూళ్లకు అడుగులు పడుతున్నాయి. 

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలోని 13948 నివాస గృహాలకు ఆస్తిపన్ను లక్ష్యం రూ.1.90 కోట్ల ఉండగా, ఇందులో రూ.1.35కోట్లు వసూలు అయ్యాయి. ఇంకా రూ.55లక్షలు వసూలు కావాల్సి ఉంది. వీటిపై అధికారులు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటు తాగునీటి బిల్లులు, ట్రేడర్స్‌ బిల్లులు కూడా వసూలు చేస్తున్నారు. వీటితో పాటు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.15లక్షలు మేర వసూలు కావాల్సి ఉంది. వీటి విషయంలో కూడా అధికారులు అన్ని కార్యాలయాలకు నోటీసులు కూడా పంపించారు. మున్సిపాల్టీలో 30 వార్డుల పారిశుధ్య పనులను తీసేందుకు 160మంది కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.15, 600 జీతంతో పనిచేస్తుండగా వీరికి సాలీన ఖర్చు రూ.2,99,52,000 అవు తోంది. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ పెండింగ్‌ బకాయిలు రూ.1.25 కోట్ల మేర ఉంది. బడా బకాయిలు వసూలు అయితే జీత భత్యా లతో పాటు కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ చెల్లింపులు చేసేందుకు కూడా మార్గం క్లియర్‌ కానుంది.

బడా బకాయిలపైన్నే దృష్టి సారించాం..

- సీవీఎన్‌ రాజు, కమిషనర్‌, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌లోని బడాబకాయిల వసూళ్లపై దృష్టి సారిస్తున్నాం. కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీకి అతిపెద్ద చెల్లింపులు చేసే మిల్లులు రెండున్నాయి. ఇందులో ఎస్పీఎం నుంచి రూ.4కోట్లు, సర్‌సిల్క్‌ నుంచి రూ.3 కోట్లు మేర రావాల్సి ఉంది. ఎస్పీఎంకు ఆస్తి పన్ను రివైజ్డ్‌ చేసేందుకు వినతిపత్రాలు దాఖలు కావటంతో తమ సిబ్బంది, ఎస్పీఎం సిబ్బంది కలిసి పూర్తి స్థాయిలో లెక్కలు తీస్తున్నాం. త్వరలోనే ఎంతమేర చెల్లించాలన్న విషయం తేలుతుంది. సర్‌ సిల్క్‌ మిల్లు విషయంలో కూడా లిక్విడేటర్‌కు పూర్తి స్థాయిలో సమస్యలు వివరించాం. బడా బకాయిలు వసూలు జరిగితే కార్మికుల బకాయిలు అన్ని చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

Updated Date - 2022-05-26T04:11:42+05:30 IST