‘పురం’ మున్సిపల్‌పై ఫోకస్‌!

ABN , First Publish Date - 2021-02-25T06:45:22+05:30 IST

హిందూపురం మున్సిపాలిటీ అంటే ప్రశాంతతకు మారుపేరు.. కుట్రలు, కుతంత్రాలకు నియోజకవర్గంలో స్థానం ఏమాత్రం ఉండదు. బెదిరింపులకు, ప్రలోభాలకు దూరంగా ఉండే హిందూపురంలో ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.

‘పురం’ మున్సిపల్‌పై ఫోకస్‌!
హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం


మాట వినని  టీడీపీ నేతలకు బెదిరింపులు

ముస్లిం నేతలపై కూడా అక్రమ కేసులు

కొత్త సంప్రదాయానికి తెరతీసిన వైపీపీ


హిందూపురం, ఫిబ్రవరి 24: హిందూపురం మున్సిపాలిటీ అంటే ప్రశాంతతకు మారుపేరు.. కుట్రలు, కుతంత్రాలకు నియోజకవర్గంలో స్థానం ఏమాత్రం ఉండదు. బెదిరింపులకు, ప్రలోభాలకు దూరంగా ఉండే హిందూపురంలో ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో  అక్రమ కేసులు, బెదిరింపులు లాంటి భయానక వాతావరణాన్ని కొందరు కల్పిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే హిందూపురంలో ‘కర్నూలు’ జిల్లా తరహా రాజకీయాలు చోటు చేసుకుంటుంటుడం పురం ప్రజలను కలవరపెడుతోంది. 


మున్సిపల్‌ ఎన్నికల వేళ హిందూపురంలో టీడీపీ నేతల ఆస్తులతోపాటు అక్రమ కేసులతో బెదిరింపులకు అధికార పార్టీ సిద్ధమైంది. ఇందుకు వరుసగా టీడీపీ నేతల ఆస్తుల టార్గెట్‌, కేసుల నమోదుతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన చెందుతున్నారు. హిందూ, ముస్లింలు అంటూ తేడా లేకుండా బెదిదింపుల పర్వం మొదలైంది. ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజక వర్గంలో అధిక స్థానాల్లో మద్దతుదారులను గెలిపించుకున్న వైసీపీ హిందూపురం ఇక మున్సిపల్‌పై టార్గెట్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ కౌన్సిల్‌ అభ్యర్థుల, నేతలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. మాట వినకపోతే ఆస్తులతోపాటు కేసుల్లో ఇరికిస్తామంటూ భయపెడుతున్నట్లు టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా హిందూపురం టీడీపీ తొలి మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, కుమారులతో మంగళవారం రాత్రి వైసీపీలోకి చేరిన సంగతి తెలిసింది. ఈనేపథ్యంలో వైసీపీలో రంగనాయకులు చేరికపై హిందూపురంలో చర్చంశనీయంగా మారింది. హిందూపురం మున్సిపల్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న దూకుడుతో టీడీపీ నేతలను అధికార పార్టీలో కొందరు పెద్ద నేతలు టార్గెట్‌ చేస్తున్నట్లు సమాచారం. 


తప్పుకుంటారా? తప్పించమంటారా?

మున్సిపల్‌ కౌన్సిలర్‌ స్థానాలకు నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులకు గాలం వేస్తూ అధికారం మాదిని బరిలో నుంచి తప్పుకోవాలని మంతనాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు టీడీపీ నేతలు సైలెంట్‌ అయిపోతున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిన జేఈ వెంకటస్వామి కుటుంబంపై అసైన్డ్‌ భూముల వ్యవహరం తెరపైకి తీసుకువచ్చి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట వాల్మీకీ సర్కిల్‌లో మైనార్టీ వర్గానికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్‌ ఆధీనంలో ఉన్న భూమిని తమదే అంటూ  కొందరు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆర్టీసీ బస్డాండు వద్ద టీడీపీ నేతకు చెందిన రెస్టారెంట్‌కు మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సంఘటనలు వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నట్లు టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇంకా కొందరి నేతలపై టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. 


టీడీపీ నేతలపై ‘ఖాకీ’ప్రయోగం

ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుగా బరిలో నిలిచిన సర్పంచ్‌ అభ్యర్థులపై అధికార పార్టీ ఖాకీని ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలవకుండా చాలా మంది టీడీపీ మద్దతు అభ్యర్థులను ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుకున్నారు. అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతులో బరిలో నిలిచిన అభ్యర్థుల, నేతలపై ఏదో ఓ అక్రమ కేసు బనాయించాలని ఖాకీని అధికార పార్టీ ప్రయోగిస్తున్నట్లు గ్రామీణ టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇదే తరహాను మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రయోగించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందిని టీడీపీ క్యాడర్‌ ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విష సంస్కృతిని హిందూపురంలోకి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు.


బాలయ్య ఉంటే మరింత ధైర్యం..

ఇలా ఉంటే ప్రధానంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల సమయంలో హిందూపురంలో లేకపోవడంతోనే అధికార పార్టీ తమను టార్గెట్‌ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిడికి తమను పోలీసులు పలు మార్లు స్టేషన్ల వద్దకు పిలిపించి వార్నింగ్‌ ఇచ్చారని మంగళవారం హిందూపురంలో జరిగిన టీడీపీ సమావేశంలో గ్రామీణ  నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ‘ఎమ్మెల్యే హిందూపురంలోనే ఉంటే అధికార పార్టీ బెదిరింపులు ఉండేవి కావని, ఆయన మా మధ్య ఉంటే మాకు కొండత ధైర్యం’గా ఉంటుందని కొందరు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసినా పోలీసులు తమ ఇళ్ల వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని పంచాయతీ ఎన్నికల్లో నిలిలిచి గెలిచిన టీడీపీ మద్దతుతో గెలిపొందిన సర్పంచ్‌లతో పాటు ఓటమి చెందిన అభ్యర్థులు, నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులతోపాటు ప్రతిపక్ష పార్టీలు బరిలో లేకుండా చేపట్టాల్సిన అంశాలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార వైసీపీ ఆగడాలను దీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ నేతలు కూడా కార్యచరణ సిద్దం చేస్తోంది.


Updated Date - 2021-02-25T06:45:22+05:30 IST