మురుగునీటి కాలువలో పూడికను పరిశీలిస్తున్న కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్
కడప కార్పొరేషన్ కమిషనర్ గురి
పారిశుధ్యం, వరద కాలువలు, ఆక్రమణలపై దృష్టి
తెల్లవారుజామునే రోడ్లపైకి
శివారు ప్రాంతాల్లోనూ పారిశుధ్యంపై పర్యవేక్షణ
ఇటీవల కడప కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి సూర్యసాయి ప్రవీణ్‌చంద్ బాధ్యతలు చేపట్టారు. వెంటనే ఆయన పరిపాలనతో తన మార్క్ చూపిస్తున్నారు. కార్పొరేషన్‌లోని కొన్ని శాఖల్లో ఎవరిదారి వారిది కావడంతో పాలన గాడితప్పింది. అయితే ఇంటిని చక్కదిద్దుకున్నట్లుగానే అక్కడి నుంచే ఆయన పని మొదలు పెట్టి పాలనను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో ప్రధాన రోడ్లు మినహాయిస్తే మిగతా వీఽధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త ఉండేది. పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండేది. వర్షపు నీరు, మురుగు నీరు వెళ్లే మార్గం లేక చిన్నపాటి వర్షానికే రోడ్లు కాలువలను తలపించేవి. ఇప్పుడు వాటిపై దృష్టి పెడుతున్నారు. సమస్యల సత్వర పరిష్కారం కోసం జోన్ల వ్యవస్థను తీసుకొచ్చారు.
(కడప - ఆంధ్రజ్యోతి) : కడప కార్పొరేషన్లో 50 వార్డులు ఉన్నాయి. సుమారు 4 లక్షల పైచిలుకు జనాభా ఉంది. క్రమం తప్పకుండా నగర వాసులు పన్నులు చెల్లిస్తున్నప్పటికి సరైన మౌలిక వసతులు అందడం లేదు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండేది. నీటి సమస్య తలెత్తినా పెద్దగా స్పందించే వారు కాదు. ఇక భవనాల నిర్మాణానికి సంబంధించి తెచ్చిన ఇసుక, కంకరను రోడ్లపైనే పడేసేవారు. దీంతో ఆ ప్రాంతంలో తిరగాలంటే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడేవారు. కాలువల్లో పేరుకుపోయిన పూడిక తీతను కూడా నామమాత్రంగా తీసేవారు. కమిషనర్ తొలుత వీటి పైనే దృష్టి పెట్టారు.
నాలుగు జోన్లు
కడప కార్పొరేషన్ విస్తీర్ణం 164.8 చదరపు కిలోమీటర్లు. తాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్లు, అక్రమ కట్టడాల గురించి ఆయా శాఖల అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి. దీంతో కార్పొరేషన్‌ను నాలుగు జోన్లుగా విభజించి ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పజెప్పారు. అంటే ఆ డివిజన్లలో అన్ని సమస్యలు ఆ అధికారి దృష్టికి తీసుకెళితే పరిష్కారం చూపిస్తారు.
జోన్లు ఇవే..
- ఈస్ట్ జోన్లో 13 డివిజన్లు ఉన్నాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 25, 26, 27 డివిజన్లు ఇందులోకి వస్తాయి. ఇక్కడ మొత్తం జనాభా 86,387.
- వెస్ట్ జోన్లో 10 డివిజన్లు ఉన్నాయి. 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 48 డివిజన్ల పరిధిలో 74,379 జనాభా ఉంది.
- నార్త్ జోన్లో 14 డివిజన్లున్నాయి. 1, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 50 డివిజన్లు దీని పరిధిలోకి వస్తాయి. ఇక్కడి జనాభా 91,905.
- సౌత్ జోన్ పరిధిలోకి 13 డివిజన్లు వస్తాయి. ఇందులో 11, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 డివిజన్లు, 87,773 మంది జనాభా ఉన్నారు.
పారిశుద్ధ్యం పై దృష్టి
నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుధ్యాన్ని గాడిలో పెట్టేందుకు కమిషనర్ ఉదయం 5.30 గంటలకే రోడ్ల పైకి వచ్చేస్తున్నారు. ఆయా డివిజన్లలోకి వెళ్లి పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. కమిషనర్ వేకువ జామునే డివిజన్లో పర్యటిస్తుండడంతో సిబ్బంది కూడా వచ్చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జనాల మధ్యకు వెళ్లి నేరుగా సమస్యలు వింటున్నారు. పూడిక తీతను స్వయంగా తీసి చూపిస్తున్నారు. ఎక్కువగా జనంతో మమేకం కావడం, ఏదైనా సంక్షేమ పథకం అందలేదంటే వెంటనే తన దగ్గరున్న ల్యాప్‌టా్‌పలో దాని స్టేట్‌సను తెలుసుకుంటున్నారు. పాత మార్కెట్, బుగ్గవంక పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెత్తాచెదారం, వ్యర్థాలు పేరుకుపోయాయి. వాటన్నింటిని వెంటనే అక్కడి నుంచి తొలగించేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో కూడా పారిశుధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రకా్‌షనగర్‌లో భూగర్భ డ్రైనేజీ నీటితో అక్కడంతా బురదమయంగా ఉండేది. అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. అధ్వాన్నంగా ఉన్న డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ పేరిట పారిశుధ్య పనులు చేపడుతున్నారు.
అక్రమణల తొలగింపులో..
రహదారుల విస్తరణ, కాలువల ఆక్రమణల తొలగింపు, రోడ్లు విస్తరణకు సంబంధించి కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్ దగ్గరుండి మార్కింగ్ ఇస్తున్నారు. గతంలో ఏ కమిషనర్ కూడా ఈ స్థాయిలో ప్రత్యేకంగా పారిశుధ్యం, ఇతర వాటిపై తిరగలేదని చెబుతారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులను కూర్చోబెట్టుకొని సమస్య వింటున్నారు. బర్త్ సర్టిఫికెట్లు కూడా ఆస్పత్రిలో బిడ్డ పుట్టిన తరువాత డిశ్చార్జ్ అయ్యేలోపే ఇవ్వాలని ఆదేశించారు.
ఇలాగే కొనసాగితే..
ఎక్కడా లేని విధంగా నగరంలో డ్రైనేజీ విధంగా సక్రమంగా సాగలేదని కమిషనర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. నగరంలో వర్షపు నీరు, మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు, మరికొన్ని డివిజన్లలోని ప్రధాన డ్రైన్స్లో కలిపే విధంగా ఓ ప్రైవేటు ఏజెన్సీతో సర్వే చేయించి అంచనాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఎక్కడ తమ ప్రాబల్యం తగ్గిపోతుందో అనే ఆందోళనతో అధికార పార్టీ నేతలు ఆయనకు అడ్డంకులు సృష్టించకపోతే కడప గాడిన పడుతుందని జనం భావిస్తున్నారు. ఇదే స్పీడ్ కొనసాగిస్తే రహదారుల విస్తరణ, బుగ్గవంక పూర్తి అయ్యి కాలువల ఆక్రమణలు తొలగి కడప ముంపు నుంచి గట్టెక్కుతుందని నగర వాసులు అంటున్నారు.