ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి

Published: Sat, 26 Mar 2022 23:50:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి

 

- బలమైన అభ్యర్థులకు కాంగ్రెస్‌, బీజేపీ వలలు

- వలస అభ్యర్థుల కోసం ప్రయత్నాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌, బీజేపీ ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నాయి. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ఈ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు ఎస్సీ నియోజకవర్గాలకు రాష్ట్రస్థాయి నాయకులను ఇన్‌చార్జిలుగా నియమించి సమన్వయ సమావేశాలు నిర్వహించి బలపడేందుకు ప్రయత్నించాయి. ప్రస్తుతం అదే కార్యాచరణతో ఆ పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నాయి. బీజేపీ రాష్ట్రస్థాయిలో ఈ బాధ్యతలను మాజీ ఎంపీ డాక్టర్‌ వివేక్‌కు అప్పగించింది. 


ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు


ఉమ్మడి జిల్లా పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో మానకొండూర్‌, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ 500లోపు స్వల్ప మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీకే చెందిన సుంకె రవిశంకర్‌, మానకొండూర్‌ నియోజకవర్గం నుంచి రసమయి బాలకిషన్‌ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో మళ్లీ తమ అభ్యర్థులే గెలుపు పతాకాన్ని ఎగరవేస్తారని అధికారపార్టీ భావిస్తుండగా కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం ఈ నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్నాయి. ఎస్సీ నియోజవర్గాలను గెలుపొందడం సులువుగా భావిస్తున్న ఈ పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా బీజేపీ వలస అభ్యర్థుల కోసం ఇప్పటి నుంచే ఆకర్ష్‌ వలలు వేస్తున్నది. ఆయా నియోజకవర్గాల్లో వీలైతే కాంగ్రెస్‌ అభ్యర్థులను, టీఆర్‌ఎస్‌లో టికెట్‌ దొరకని బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నుంచి గతంలో పోటీ చేసినవారు, మరికొందరు బలమైన అభ్యర్థులు బీజేపీ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌ కూడా తనపాత అభ్యర్థులతో ఈసారి విజయం కోసం గట్టిప్రయత్నాలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు బలమైనవారే కాకుండా నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో సత్సంబంధాలు ఉన్నవారు కావడంతో వారిని మార్చకపోవచ్చని తెలుస్తున్నది. ఎన్నికల నాటికి బీజేపీ బలపడితే ఒకటి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు పునరాలోచనలో పడే అవకాశాలు లేకపోలేదని బీజేపీ భావిస్తోంది. 


 మానకొండూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్‌ ఉండగా గత ఎన్నికల్లో ఈయనతో కాంగ్రెస్‌ నుంచి డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, బీజేపీ నుంచి గడ్డం నాగరాజు పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉండడంతో ఆయనే మళ్లీ ఇక్కడ అభ్యర్థిగా పోటీలోకి దిగడం ఖాయమని చెప్పవచ్చు. బీజేపీ నుంచి గడ్డం నాగరాజుతోపాటు దళితమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, ఎల్లారెడ్డిపేటకు చెందిన గాయకుడు దరువు ఎల్లయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ దగ్గరి అనుచరుడు సొల్లు అజయ్‌వర్మ టికెట్‌ ఆశించే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్‌ కూడా టికెట్‌ అడిగే అవకాశాలున్నాయి. బీజేపీ ఆశావహుల పరిస్థితి ఎలా ఉన్నా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసంతృప్తివాదులు, టికెట్‌ దొరకని వారిపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. 


 చొప్పదండి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మేడిపల్లి సత్యం, బీజేపీ అభ్యర్థిగా బొడిగె శోభ పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో లింగంపల్లి శంకర్‌ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ప్రస్తుతం గత ఎన్నికల్లో పోటీ చేసినవారే అభ్యర్థులుగా ఉంటారని అన్ని పార్టీలు చెబుతున్నాయి. 


 ధర్మపురి నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా గత ఎన్నికల్లో ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ జడ్పీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, బీజేపీ అభ్యర్థిగా కన్నం అంజయ్య పోటీ చేశారు. కన్నం అంజయ్య 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా 2009 ఎన్నికల్లో ప్రస్తుత దళిత మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్‌ కుమార్‌ పోటీ చేశారు. ఇప్పుడు వీరితోపాటు మాజీ ఎంపీ డాక్టర్‌ వివేక్‌ పేరు కూడా వినిపిస్తున్నది. డాక్టర్‌ వివేక్‌ కాని, ఆయన కుటుంబ సభ్యులుకాని ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగవచ్చని చెబుతున్నారు. 


 ఎవరి వ్యూహం వారిదే..


బీజేపీ అధినాయకత్వం మాత్రం రాష్ట్రంలో, జిల్లాల్లో అన్ని స్థాయిల్లో కాంగ్రెస్‌ నాయకత్వం లేకుండా పోయి బలహీనపడితే తప్ప తమకు లాభం చేకూరదనే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. వీలైనంత వరకు కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ వస్తున్న నేతలను టార్గెట్‌గా చేసుకొని ఆకర్ష్‌ వలలు వేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌లో టికెట్‌ దొరకని అసంతృప్తవాదులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపితే పెద్దపీట వేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో గడ్డం నాగరాజు, కన్నం అంజయ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు వ్యతిరేకవర్గ నాయకులైన కిసాన్‌ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్‌రావు, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డికి సన్నిహిత అనుచరులైనందున వారికి అవకాశాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. చొప్పదండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇప్పటికీ బలమైన అభ్యర్థిగానే ఉన్నారు. ఆమెకు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వర్గీయురాలిగా పేరు ఉన్నందున సంజయ్‌ ఎంతవరకు సహకరిస్తారో అన్నది ప్రశ్నార్థకంగా చెబుతున్నారు. ఈటల రాజేందర్‌ కూడా బీజేపీలో బలమైన వ్యక్తిగానే ఉన్నందున బొడిగె శోభ అభ్యర్థిత్వానికి ఏమాత్రం ఢోకా ఉండదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతున్నది. ఎస్సీ నియోజకవర్గాలపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించడాన్ని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా గమనిస్తున్నదని, తమ అభ్యర్థుల విజయావకాశాలపై వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించవని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.