మళ్లీ మడతేసింది..!

ABN , First Publish Date - 2022-03-17T07:34:13+05:30 IST

మళ్లీ మడతేసింది..!

మళ్లీ మడతేసింది..!

నాలుగో విడత విద్యా దీవెన ఎగవేత

2020-21కి 650 కోట్లు ఎగవేత

ఇస్తామని ఇటీవల సర్కారు కోతలు 

తాజా నిధుల విడుదలలో ఆ ఊసే లేదు 

కేంద్రం డబ్బులూ సొంత ఖజానాకు

విద్యార్థులకు విడతల వారీగా చెల్లింపు

రాష్ట్రం ఇవ్వాల్సిన వాటాలో కోత

ఎప్పటికప్పుడు చెల్లించేస్తున్నాం: సీఎం


‘విద్యా దీవెనను ఠంచనుగా ఎప్పటికప్పుడు 3 నెలలకోసారి చెల్లిస్తాం’.. ఇదీ ప్రభుత్వం మాట. కానీ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో విడతను ఎగ్గొట్టేసింది. తల్లుల ఖాతాలో వేయాల్సిన దాదాపు రూ.650 కోట్లను ఇవ్వనే లేదు. ఈ డబ్బు ఇస్తామని ఇటీవల చెప్పి మరీ మాట మడతేసింది. 


2020-21లో ఏ గ్రేడ్‌ కళాశాలలో బీఎస్సీ విద్యార్థికి ఏడాదికి ఫీజు రూ.16 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని విద్యా దీవెన కింద అందిస్తానని చెప్పింది. కేంద్రం తన వాటాగా ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థుల కోసం 60ు అంటే రూ.9,600ను ఒకేసారి విడుదల చేసింది. రాష్ట్రం మాత్రం ‘చెల్లింపు’ను 

4 విడతలు చేసింది. 3 విడతల్లో రూ.12 వేలు ఇచ్చింది. నాలుగోసారి నో చెప్పేసింది. తన వాటాగా ఇవ్వాల్సిన రూ.4 వేలు కోత పెట్టేసింది.  


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదొకటి. చేసేది మరొకటి. పేదరికంతో చదువు ఆగిపోరాదని, విద్యా దీవెన చెల్లిస్తామని ఘనంగా చెప్పింది. కానీ ఒక విడత విద్యా దీవెనను ఎగ్గొట్టేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పథకం కింద నాలుగో విడతగా సుమారు రూ.650 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే.. విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేయలేదు. పైగా కేంద్రం ఒకేసారి విడుదల చేసిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుని.. విడతల వారీగా చెల్లిస్తోంది. 2020-21 విద్యా సంవత్సరంలో ఏ గ్రేడ్‌ కళాశాలలో బీఎస్సీ చదివే విద్యార్థికి ఏడాదికి ఫీజు రూ.16 వేలుగా ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ మొత్తాన్ని విద్యా దీవెన కింద అందిస్తానని చెప్పింది. ఈ పథకంలో కేంద్రం వాటా 60 శాతం కాగా, రాష్ట్రం వాటా 40 శాతం. అంటే రూ.16 వేలలో రూ.9,600 కేంద్రం ఇవ్వాల్సి ఉండగా... మిగతా రూ.6,400 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్రం తన వాటా డబ్బు మొత్తాన్ని ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే చెల్లించింది. మిగిలిన అర్హులందరికీ పూర్తిగా విద్యా దీవెన అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం వాస్తవమే అయినా పూర్తిగా చెల్లించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తానివ్వాల్సిన డబ్బునే కాకుండా కేంద్రం ముందుగానే ఇచ్చిన డబ్బును కూడా ఇతర అవ సరాలకు వాడేసుకుంది. ఆ తర్వాత నాలుగు విడతలుగా ఇచ్చేలా సర్దుబాటు చేసుకుంది. ఈ లెక్కన ఒక్కో విడతకు రూ.4 వేలు చొప్పున ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మూడు విడతలే ఇచ్చింది. నాలుగో విడతకు ఎగనామం పెట్టింది. ఇచ్చిన మూడు విడతల్లో ఒక్కో విడతకు నాలుగువేల చొప్పున మొత్తం రూ.12 వేలు ఇచ్చింది. ఇందులో రూ.9,600 కేంద్రం ఇచ్చినవే. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.2,400లే. కేంద్రం ఇచ్చిన డబ్బులనే దాదాపుగా సర్దుబాటు చేసేసి తాను ఇవ్వాల్సిన 40 శాతం నిధుల్లో కోత పెట్టేసింది. రూ.6 వేలు ఇవ్వాల్సిన చోట రూ.2,400లే ఇచ్చింది. డిగ్రీ విద్యార్థులకే కాదు.. ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఇతర కోర్సులకూ ఇదే పరిస్థితి. 


ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదు

వాస్తవానికి విద్యాదీవెన మొత్తం డబ్బులు ప్రభుత్వం ఇవ్వదేమోనన్న అనుమానం కళాశాలల యాజమాన్యాల్లో మొదట్నుంచీ ఉంది. దీనిపై ఇటీవలే ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. నాలుగో విడత ఇస్తారా? ఇవ్వరా? అని ఆ కథనంలో పేర్కొంది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ నాలుగో విడత కచ్చితంగా ఇస్తామని ప్రకటించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి నాలుగో విడత విద్యా దీవెనను ఇస్తామని సచివాలయంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. కానీ బుధవారం ఇచ్చిన విద్యా దీవెన కానుక 2021-22 విద్యా సంవత్సరానికి చెందిన మొదటి విడత అని చెప్పారు. దీంతో గత విద్యా సంవత్సరానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులు ఇవ్వనట్లేనని స్పష్టమైంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం గుంభనంగా వ్యవహరించింది. నాలుగో విడత ఇస్తామని పైకి చెబుతూనే... ఆ సమయంలో కొవిడ్‌తో కళాశాలలు జరగనందున ఇవ్వకూడదని నిర్ణయించినట్టు చెబుతున్నారు. గత ఏడాదికి సంబంధించిన నాలుగో విడత ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 


కొవిడ్‌లోనూ తరగతులు చెప్పాం.. 

కొవిడ్‌ సమయంలో కళాశాలలు జరగకున్నా ఆన్‌లైన్‌ తరగతులు చెప్పామని, అదేవిధంగా లెక్చరర్లకు జీతాలు కూడా చెల్లించామని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ‘జీతాలు చెల్లించకపోతే కుదరదు.. ఒప్పుకోం.. ఊరుకోం’ అని ప్రభుత్వం హెచ్చరించిందని గుర్తు చేస్తున్నారు. అందరికీ జీతాలు చెల్లించామని, ఆన్‌లైన్‌లో, కొన్నిచోట్ల ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించామని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆ ఏడాదికి సంబంధించిన సిలబస్‌ అంతా పూర్తిచేశామని, ప్రభుత్వం మాత్రం ఒక విడత విద్యాదీవెన ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి.


విద్యార్థులపైనే భారం 

ప్రభుత్వం ఒక విడత విద్యా దీవెన ఇవ్వకున్నా కళాశాలలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తాయి. దీంతో విద్యార్థులపైనే భారం పడుతుంది. ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన కింద డబ్బులేస్తుంది. తల్లులు ఆ డబ్బులను కళాశాలల యాజమాన్యాలకు కట్టాలి. ఇప్పుడు తల్లుల ఖాతాల్లో నాలుగో విడత విద్యా దీవెన జమ చేయలేదు. కళాశాలలకు నేరుగా సంబంధం లేని విషయం ఇది. విద్యార్థులు టీసీల కోసం వెళ్లినప్పుడు ఫీజు కట్టాల్సిందేనని కళాశాలల యాజమాన్యాలు అడుగుతాయి. అంతిమంగా ఆ భారం తల్లిదండ్రులపై పడే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కొవిడ్‌ పేరుతో ప్రభుత్వం నాలుగో విడత ఫీజులు కోసేసిందని.. కానీ అదే సమయంలో ఇంటి పన్ను, విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు కట్టే ఫీజుల్ని పెంచిందని చెబుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే వాటిని మాత్రం పెంచి... ఇచ్చేవాటికి మాత్రం కొవిడ్‌ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-03-17T07:34:13+05:30 IST