Corona Vaccine తీసుకున్న తర్వాత.. ఈ పొరపాట్లను అస్సలు చేయకండి..!

May 22 2021 @ 11:54AM
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం భారతదేశంలో కరోనా పేరు చెబితే చాలు ప్రజలంతా వణికిపోతున్నారు. ఈ మహమ్మారి సెకండ్ వేవ్ భారత దేశంలో సృష్టించిన దృశ్యాలు అలాంటివి. ఆస్పత్రిలో బెడ్లు దొరక్క అంబులెన్సులోనే అసువులు బాసిన వారెంతమందో.. ఆస్పత్రిలో చేరి ఆక్సిజన్ అందక ఊపిరొదిలిన వారు అంతకుమించి.. చనిపోయిన తర్వాత కనీసం అంత్యక్రియలు చేయడానికి స్మశానంలో కూడా ఖాళీ లేని దుస్థితి.. ఇవీ కరోనా సెకండ్ వేవ్ మనదేశంలో కనిపించిన దృశ్యాలు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకొని మళ్లీ జనజీవనం సాధారణ స్థితికి చేరాలంటే మన ముందు నిలిచిన ఏకైక మార్గం వ్యాక్సిన్. కానీ దీని చుట్టూ ఎన్నో సందేహాల వలలు! వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకున్న తర్వాత ఏం చేయాలి? అసలు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఇలా ఎన్నో అనుమానాలు సామాన్యుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. వీటికి సమాధానాలు తెలుసుకుందామా..


కరోనా వ్యాక్సిన్‌ను అత్యంత వేగంగా రికార్డు స్థాయిలో అభివృద్ధి చేశారు. అందుకే దీన్ని తీసుకోవడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సహజమే. కానీ ప్రభుత్వంకానీ, ఆరోగ్యశాఖ అధికారులు కానీ ఇలాంటి భయాలేవీ వద్దని హామీ ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రజలకు ఎటువంటి హానీ ఉండబోదని చెప్తున్నారు. కరోనా మహమ్మారిని నిరోధించే ఈ పోరాటంలో మనమూ ఒక చెయ్యేద్దాం.. ఉడతాభక్తి సాయం చేద్దామని అనుకుంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం. కాకపోతే కొంతమందిలో చాలా లైట్‌గా జ్వరం, ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో దద్దుర్లు, నొప్పి, దురదలు, ఒళ్లు నొప్పులు వంటి కొన్ని లక్షణాలు కనిపించాయి. అయితే ఏ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకున్నా ఇలా జరగడం సహజమే.


కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని గనుక నిర్ణయించుకుంటే టీకా తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఒకసారి లుక్కేస్తే.. ఒక వేళ వ్యాక్సిన్ తీసుకోడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత మనలో వైరస్ లక్షణాలు కనిపించినా, లేక ఇటీవలి కాలంలో కలిసిన వారికి కరోనా సోకిందని తెలిసినా వ్యాక్సిన్ వాయిదా వేసుకోవడం మంచిదని నిపుణుల సలహా. అలాగే..


1. వ్యాక్సిన్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఒక అరగంట సేపు వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉండాలి. దీని వల్ల మనపై అక్కడి వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తితే వారు వెంటనే స్పందిస్తారు.


2. ఏవైనా ఆరోగ్య సమస్యలు అప్పటికే ఉన్నా, ప్రిస్క్రయిబ్ చేసిన మందులు వాడుతున్నా.. వ్యాక్సిన్ తీసుకునేముందు మన డాక్టర్ సలహా కూడా తీసుకోవాలి. అలాగే హెమోఫిలా వంటి రక్తస్రావం జరిగే వ్యాధులు ఉన్న వారు వారి వైద్యుడి పర్యవేక్షణలో వ్యాక్సిన్ తీసుకుంటే మంచింది.


3. వ్యాక్సిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఎక్కువ కాలం కనుక ఉంటే వెంటనే వ్యాక్సినేషన్ కేంద్రాన్ని లేదా దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. అంతేగానీ సొంత ప్రయోగాలు వద్దు.


4. షెడ్యూల్ ప్రకారమే వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవాలి. ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం కోవ్యాక్సిన్ అయితే తొలి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల తేడాలో రెండో డోసు తీసుకోవాలి. కోవిషీల్డ్ అయితే ఈ గ్యాప్ 12-16 వారాలు ఉంటుంది.


5. అన్నింటి కన్నా ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా నిబంధనలు పాటించాలి. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతుల శుభ్రత మానకూడదు.

ప్రతీకాత్మక చిత్రం

వీటితోపాటు కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకునే సమయంలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి పరిశీలిస్తే మంచింది.


1. వ్యాక్సిన్ కార్డు పారేసుకోకండి. రెండో డోసు వేసుకునే సమయంలో ఈ కార్డు చాలా అవసరం. దీనిపై టైం స్టాంప్ బట్టే మనకు రెండో డోసు వేస్తారు. అలాగే కొన్ని విమానాల వంటివి ఎక్కే సమయంలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఏవైనా పత్రాలు కావాలని సడెన్‌గా నిబంధనలు వచ్చినా ఈ కార్డు ఉపయోగపడుతుంది.


2. రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి చేసుకున్న అపాయింట్‌మెంట్ మిస్ చేయకండి. ఇలా చేయడం వల్ల ఒక వ్యాక్సిన్ డోసు వృధా అయినట్లే. వ్యాక్సిన్‌ను గడ్డకట్టే ఉష్ణోగ్రతలో దాస్తారు. వాటిని ఒకసారి బయటకు తీసిన తర్వాత అదే రోజు వాటిని వాడేయాలి. లేదంటే వృధానే. ప్రస్తుతం మన దేశ పరిస్థితుల దృష్ట్యా ఇలా చేయడం భరించలేని తప్పు.


2. ఇబుప్రోఫఎన్, యాస్పిరిన్, అసిటమినోఫెన్ వంటి మాత్రలు వేసుకొని వ్యాక్సిన్ తీసుకోవద్దని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి మందులు వ్యాక్సిన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో సరైన ఆధారాలు లేవు. కానీ వీటి వల్ల వ్యాక్సిన్ ప్రభావం కోల్పోయే ప్రమాదం ఉంది.


3. రెండో డోసు కూడా తీసుకున్న 14రోజుల తర్వాతే మన వ్యాక్సినేషన్ పూర్తయినట్లు. కాబట్టి తొలి డోసు తీసుకున్న తర్వాత కూడా కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలి. పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత కూడా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతుల శుభ్రత వంటి నిబంధనలకు నీళ్లొదలద్దని నిపుణులు చెప్తున్నారు.


4. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత చిన్న లక్షణమైనా సరే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టులను తెలుసుకోవడంలో సహాయం చేసినట్లే. దీని ద్వారా భవిష్యత్తులో వ్యాక్సిన్ అభివృద్ధికి దోహదం చేసినట్లు అవుతుంది.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.