
ఆంధ్రజ్యోతి(22-09-2021)
జీవక్రియల రేటు బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొన్ని అలవాట్లు మెటబాలిజంను తగ్గిస్తాయని అంటున్నారు నిపుణులు. ఆ అలవాట్లు ఏమిటంటే....
‘బరువు తగ్గాలంటే క్యాలరీలు తక్కువగా తీసుకోవాలి’- చాలామంది అభిప్రాయం ఇది. కానీ క్యాలరీల శాతం బాగా తగ్గిపోతే జీవక్రియల రేటు తగ్గిపోతుందని అంటున్నారు నిపుణులు. కాబట్టి క్యాలరీలు పూర్తిగా అందకుండా చూడటం సరైన పద్ధతి కాదు.
ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే వారిలో ప్రతిరోజూ ఖర్చయ్యే కాల్యరీల సంఖ్య తగ్గిపోతుంది. కరోనా భయం వల్ల చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారిపోయారు. ఇది మెటబాలిజంపై నెగటివ్ ఎఫెక్ట్‌ను చూపింది. మెట్లు ఎక్కడం, ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం... ఇలాంటి పనులన్నీ క్యాలరీలు ఖర్చయ్యేందుకు ఉపయోగపడేవే. రోజూ ఈ పనులు ఎవరికి వారు చేయడం నియమంగా పెట్టుకోవాలి.
ప్రొటీన్లు ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్‌నిస్తాయి. అంతేకాకుండా క్యాలరీలు ఎక్కువ ఖర్చయ్యేలా చూస్తాయి. ఆహారం జీర్ణం కాగానే మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీన్ని థెర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటారు. అలాగే థెర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రోటీన్ ఫ్యాట్ లేదా కార్బోహైడ్రేట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకుంటే మెటబాలిజం రేటు 20 నుంచి 30 శాతం వరకు పెరుగుతుంది. కార్బోహైడ్రేట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. సరిపడా నిద్ర పోకపోతే అనారోగ్యం బారినపడే అవకాశాలు పెరుగుతాయి. గుండె సంబంధ సమస్యలు, డయాబెటిస్, డిప్రెషన్ వంటి జబ్బులు రావచ్చు. అంతేకాకుండా నిద్రలేమి మెటబాలిజం రేటును తగ్గిస్తుంది.
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లతో పోలిస్తే రిఫైన్స్ కార్బోహైడ్రేట్లు భిన్నమైనవి. సులభంగా జీర్ణమవుతాయి. అయితే కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకుంటే మెటబాలిజం నెమ్మదిస్తుంది.