ఆహారమే పరమౌషధం

ABN , First Publish Date - 2021-07-24T08:56:34+05:30 IST

పాకశాస్త్ర గ్రంథాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైనది ‘పాక దర్పణం’. ఇది బహుశా క్రీ.శ 11వ శతాబ్దినాటిది కావచ్చని చరిత్రకారుల భావన.

ఆహారమే పరమౌషధం

ఏకాకీ నైషధః ప్రాణ్య కదాచిత్‌ కలినాశనః ఋతుపర్ణస్య నగరీం రాజానమిదమబ్రవీత్‌!

 (ఒకసారి కలినాశకుడైన నిషధ దేశ చక్రవర్తి నలుడు అయోధ్యచక్రవర్తి ఋతుపర్ణుడి వంటవాడిగా ఉద్యోగం కోసం వెళ్లి ఆశ్రయించాడు. అందుకు దారి తీసిన పరిస్థితులు విషాదకరమైనవే! ఇదీ ఈ పద్య తాత్పర్యం)


పాకశాస్త్ర గ్రంథాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైనది ‘పాక దర్పణం’. ఇది  బహుశా క్రీ.శ 11వ శతాబ్దినాటిది కావచ్చని చరిత్రకారుల భావన. బుతుపర్ణ చక్రవర్తికి నలుడు చెప్పిన ఆహార రహస్యాల సమాహారమే ఈ గ్రంథం. ఇందులోని ఆహార పదార్థాల తయారీ ఆయుర్వేదంలో చెప్పిన విధంగా ఉంటుంది. ప్రతీ ఆహారపదార్థాన్ని మరింత ఆరోగ్యదాయకంగానూ, రుచికరంగానూ, ప్రభువులు తినటానికి యోగ్యమైనదిగానూ ఎలా వండాలో ఈ గ్రంథంలో నలుడు వివరిస్తాడు.  వీటిలో చాలా వంటకాలు మనం ప్రస్తుతం తింటున్నవే! కానీ, వాటిని వండే తీరులోనే చాలా తేడాలున్నాయి. కొన్ని సందర్భాల్లో అపకారం చేసేవిగా మనం ఎలా వండుకుంటున్నామో ఈ నలుడి పాకసూత్రాలు చదివితే అర్థం చేసుకోగలుగుతాం. ఈ సూత్రాలను ఒక రాజుగారికి చెప్తున్న తీరులో వ్రాసినవి కాబట్టి, ధనాధికుల ధనిక భోజనం ఎలా ఉంటుందో ఇవి చదివితే అర్థం అవుతుంది. ‘బంగారు పళ్లెంలో తినటం కాదు, తినేది బంగారంలా ఉండాలనే’ సూత్రం ఈ గ్రంథానికి లక్ష్యంగా కనిపిస్తుంది. మన భోజన విధానాన్ని సంస్కరించుకోవటానికి ’పాకదర్పణం‘ ఒక కరదీపిక. వంటకాల తయారీ ఒక అందమైన కళ. ఒక శిల్పాన్ని చెక్కటం శిల్పికి ఎంత శ్రమో, వంట చేసి మెప్పించటం కూడా అంతే శ్రమతో కూడుకున్న క్లిష్టతరమైన విద్య. 64 కళల్లో పాక శాస్త్ర ప్రావీణ్యం కూడా ఒకటి. ‘ పాకకళ ద్వారా రసపాక కార్యాన్ని నెరవేర్చగలను నేను. పాకకళ తెలియకపోతే అమృతం పోసి వండినా దానికి రుచిని తీసుకు రాలేము’ అంటాడు నలుడు.


5 రకాల వంటకాలు.. 

‘బియ్యంతోనో, పప్పులతోనో, కూరగాయలతోనో, మాంసంతోనో ఒక వంటకాన్ని తయారు చేయటాన్ని’- శుద్ధ సంస్కారం అంటారు. వంట చేయడం అంటే ఆహారద్రవ్యాన్ని సంస్కరించటం అని అర్థం. సంస్కరించబడే విధంగా వండే తీరు ఉండాలి. ఇలా సంస్కరించబడిన ఆహార పదార్ధాలు ఐదు రకాలు. అవి

భక్ష్యాలు- గారెలు, బూరెలు వగైరా నమిలి తినేవి

భోజ్యాలు - కూర, పప్పు, పచ్చడి లాంటి భుజించ దగినవి 

లేహ్యాలు - హల్వా, కేసరి లాంటి నాకుతూ తినదగినవి

చోష్యాలు - పీలుస్తూ త్రాగే సాంబారు, రసం పులుసు, సాసుల వంటివి

పేయాలు - పాయసం, పానకం లాంటి త్రాగదగినవి 

ఈ 5 రకాల వంటకాలను ’వ్యంజనా‘ లంటారు. అన్ని రకాల వ్యంజనాలు తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అనే ఆరు రుచులతో కూడి ఉన్నపుడే అది ‘షడ్రసోపేత భోజనం’ అవుతుంది. ఒకవిధంగా 6 రుచులూ ఉన్న భోజనాన్ని ధనిక భోజనం అంటే పోషక విలువలు కలిగినదిగా భావించాలి. ఒకే వంటకంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు కలిసి ఉంటే ఆ వంటకాలను ఉత్తమ రుచి కలిగిన ’చిత్రపాకాలు‘ అంటారు. రుచులు ఈ ఆరే గానీ, ఇవి ఒకదానితో ఒకటి వివిధ నిష్పత్తుల్లో కలవటం ద్వారా 63 రుచులు అవుతాయి. రుచులు విడివిడిగా (6), ఏవైనా రెండు రుచులు కలిసినవి (15), ఏవైనా మూడు రుచులు కలిసినవి (20), ఏవైనా నాలుగు రుచులు కలిసినవి (15), ఏవైనా ఐదు రుచులు కలిసినవి(6). ఆరు రుచులూ కలిసినవి (1) మొత్తం 63 రుచులతో మన ఆహార పదార్ధాలు కూడి ఉంటాయి. వివిధ ఆహార ద్రవ్యాల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మనం 63 రుచుల్ని తీసుకుంటున్నాం. పాకశాస్త్ర ప్రావీణ్యం ఉన్నవ్యక్తి ఈ 63 రుచుల మర్మాన్ని తెలుసుకుని, ఆహార పదార్ధాలను వండగలిగితే ఆరోగ్యదాయకంగా పోషకంగా ఉంటాయి. ఏ వంటకాన్ని వండేడప్పుడైనా మనసులో ఆరురుచులూ కలిగేలా ఒక ప్రణాళికతో వండితే అది ఆరోగ్యదాయకం అవుతుంది.


రోగాలను హరించే ఆహారం 

భుజ్యతే యేన యత్నేన తస్యారోగ్యం భవేద్‌ ధృవమ్వాతజం పిత్తజం రోగం శ్లేష్మజం హన్తి సర్వదా!

‘‘నేను తయారు చేసిన రుచికరమైన పదార్థాలను తిన్నవారికి తప్పకుండా ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది. ఒక్కసారి తీసుకుంటే చాలు, త్రిపురాసురుణ్ణి పరమశివుడు సంహరించినట్టు వాత, పిత్త, కఫ రోగాలను హరిస్తాయి. అజీర్ణం లాంటి దోషాలు వచ్చినప్పుడు జ్వరాలు, హృద్రోగాలు, క్షయవ్యాధి, ఆయాసం, దగ్గు, కడుపు నొప్పి, ఒళ్లునొప్పులు, మొలలు, లూఠీ, కలరా లాంటి వ్యాధులు, మూడుదోషాలు కలిసి ఏర్పడే వ్యాధులు... ఇలా అన్ని వ్యాధుల్లోనూ ఈ వంటకాలు ఔషధంగా పనిచేసి ఆ వ్యాధుల్ని శమింప చేస్తాయి. భోజనాన్ని ఒక ఔషధంగా ఉపయోగపడే విధంగా నేను ఆరోగ్యాహారాన్ని తయారు చేయగలను. నన్ను అందుకు వినియోగించండి ప్రభూ’ అని నలుడు కోరతాడు.

Updated Date - 2021-07-24T08:56:34+05:30 IST