ధాన్యం కొనుగోలు కేంద్రంలో అన్నదాత కష్టాలు!

ABN , First Publish Date - 2021-05-10T05:00:23+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రంలో అన్నదాత కష్టాలు!

ధాన్యం కొనుగోలు కేంద్రంలో అన్నదాత కష్టాలు!
కొనుగోలు కేంద్రం వద్ద తడసిన వరిధాన్యాన్ని పరిశీలిస్తున్న మహిళా రైతు...

  • హమాలీల కొరతతో నత్తనడకన అమ్మకాలు
  • గతంలో హమాలీలుగాపనిచేసిన బిహారీలు
  • కొవిడ్‌ భయంతో సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణం..
  • కాంటాలకు ముందుకు రాని స్థానికులు
  • వేధిస్తున్న హమాలీల కొరత
  • టార్పాలిన్లు లేక తడుస్తున్న ధాన్యం


తాండూరు: ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకెళితే అక్కడ సమస్యలు వారిని వేధిస్తున్నాయి. ప్రధానంగా హమాలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ధాన్యం లోడింగ్‌, అన్‌లోడింగ్‌ నిల్వలకు ఇబ్బందిగా మారింది. గతంలో బిహార్‌కు చెందిన హమాలీలు తాండూరుకు వచ్చి ధాన్యం తూకాలు వేసి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ పనులు చేసేవారు. అయితే, కరోనా కారణంగా బిహార్‌కు చెందిన హమాలీలు తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. స్థానికంగా ఉన్న హమాలీలు ఈ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. మొత్తం జిల్లాలో 54 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్‌ సప్లయ్‌శాఖ, డీసీఎంఎస్‌, ఐకేపీ, పీఏసీఎ్‌సలకు కమీషన్‌ పద్ధతిన అప్పగించింది. అందులో అత్యధికంగా 47 కేంద్రాలను తాండూరులోనే ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా యాలాల మండలంలో 6,385 ఎకరాల్లో వరి పంటను సాగుచేశారు. తాండూరులో 5,345 ఎకరాలు, పెద్దేముల్‌, బషీరాబాద్‌ మండలాల్లో 6వేల ఎకరాల్లో వరి సాగుచేశారని వ్యవసాయశాఖ కలెక్టర్‌కు నివేదించింది. కొనుగోలు చేసిన వరిధాన్యం తాండూరు ప్రాంతంలో ఉన్న రెండు బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు సివిల్‌ సప్లయ్‌శాఖ తరలిస్తోంది. 

టార్పాలిన్‌ కవర్లు లేక తడిసిన ధాన్యం

ప్రభుత్వం హడావుడిగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నప్పటికీ అక్కడ సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌లో కొనుగోలు కేంద్రం ఏర్పాటైనా టార్పాలిన్‌ కవర్లు లేక శనివారం రాత్రి కురిసిన వర్షానికి వరిధాన్యం తడిచిపోయింది. రైతులే తమ వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్‌ కవర్లను కప్పి ఽధాన్యాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. అయినా వరిధాన్యం తడిసింది. డీసీఎంఎస్‌, సహకార సంఘాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా టార్పాలిన్‌ కవర్లు సమకూర్చుకొని రైతులకు అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులు పలుసార్లు సమావేశంలో పేర్కొన్నా అధికారులు వాటిని పట్టించుకోకుండా ఇతర సంస్థలపై ఆధారపడుతున్నారు. 

అన్నీ ఇబ్బందులే..

ధాన్యం కొనుగోళ్లకు సరిపడా సిబ్బంది, వేయింగ్‌ మిషన్లు, గోనెసంచుల కొరత ఏర్పడింది. మార్కెట్‌ కమిటీ గత ఖరీఫ్‌ సీజన్‌లో డీసీఎంఎ్‌సలకు టార్పాలిన్‌ కవర్లను, వేయింగ్‌ మిషన్లను ఇచ్చింది. ఈసారి మార్కెట్‌ కమిటీ కేవలం ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు మాత్రమే ఇచ్చింది. తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో 100 వరకు టార్పాలిన్‌ కవర్లు, 50వరకు వేయింగ్‌ మిషన్లు ఉన్నాయి. వాటిని డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రాలకు ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని డీసీఎంఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతిసారి వరిధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ డీసీఎంఎస్‌ వేయింగ్‌ మిషన్లు, టార్పాలిన్‌ కవర్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉన్నా వారు కొనుగోలు చేయకుండా మార్కెట్‌ కమిటీని కొనాలని కోరడంపై మార్కెట్‌ కమిటీ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాబ్‌ల కొరత

వరిధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 48గంటల్లో ఆన్‌లైన్‌ ద్వారా రైతులకు పేమెంట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశం ఉంది. అయితే, సిబ్బందికి సరిపడా ట్యాబ్‌లు లేకపోవడంతో 48గంటల్లో పేమెంట్‌ రావడం కష్టంగా మారింది. 54 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటివరకు 34 ట్యాబ్‌లు మాత్రమే సమకూర్చారు. వరిధాన్యం కొనుగోళ్లపై ప్రతి అంశాన్ని ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తేనే ఆన్‌లైన్‌ పేమెంట్‌ సాధ్యమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-10T05:00:23+05:30 IST