కుందేలు తెలివి!

ABN , First Publish Date - 2020-11-20T05:30:00+05:30 IST

అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. అది క్రూరంగా ప్రవర్తించేది. ఇతర జంతువులను చంపి తినేది. ఒక్కోరోజు పది, పదిహేను జంతువులు సింహానికి ఆహారమై పోతుండటంతో జంతువులన్నీ భయపడ్డాయి...

కుందేలు తెలివి!

అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. అది క్రూరంగా ప్రవర్తించేది. ఇతర జంతువులను చంపి తినేది. ఒక్కోరోజు పది, పదిహేను జంతువులు సింహానికి ఆహారమై పోతుండటంతో జంతువులన్నీ భయపడ్డాయి. ఇలా ఒకేరోజు ఆహారమయ్యే కన్నా, ఒక్కోరోజు ఒక జంతువు సింహానికి ఆహారం కావడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాయి. వాటి ఆలోచనను సింహానికి చెప్పాయి. అందుకు సింహం సరేనంది. అప్పటి నుంచి రోజుకో జంతువు సింహానికి ఆహారం అయ్యేది. అదే అడవిలో ఒక కుందేలు నివసిస్తోంది. అది బాగా తెలివైంది. ఆ కుందేలు సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్పుడా కుందేలు భయపడకుండా సరేనని ఒప్పుకుంది. ఎలాగైనా ఈ సింహం బెడదను వదిలించుకోవాలని అనుకుంది. సింహం దగ్గరకు సమయానికి వెళ్లకుండా సాయంత్రం వేళ వెళ్లింది. అప్పటికే బాగా ఆకలితో ఎదురుచూస్తున్న సింహం కుందేలును చూసి ‘‘ఉదయం నుంచి ఆకలితో ఉంటే ఒక చిన్న కుందేలును ఆహారంగా పంపిస్తారా? మిమ్మల్ని అందరినీ చంపేస్తాను’’ అని కోపంతో ఊగిపోయింది. అప్పుడు కుందేలు ‘‘నేను ఒక్కదాన్ని రాలేదు. మొత్తం ఆరుగురం కలిసి వచ్చాం. కానీ దారి మధ్యలో మరో సింహం మాకు ఎదురయింది. ఈ అడవికి నేనే రాజుని. మీరందరూ నాకే ఆహారం కావాలని ఆపింది. మీ గురించి చెప్పినా వినిపించుకోలేదు. ఐదు కుందేళ్లను తన దగ్గరే పెట్టుకుంది. మీకు విషయం చెప్పిరమ్మని నన్ను పంపించింది’’ అని వివరించింది. దాంతో సింహం కోపం కట్టలు తెంచుకుంది.


‘‘ఈ అడవికి నేనే రాజుని. ఆ సింహాన్ని చూపించు. దాన్ని చంపుతాను’’ అని కుందేలుతో కలిసి బయలుదేరింది. సింహాన్ని కొద్ది దూరం తీసుకెళ్లిన తరువాత ‘‘ఇదిగో ఈ బావిలోనే ఆ సింహం ఉంది. వెళ్లి దాని పనిపట్టు’’ అని అంది. బావిలోకి తొంగి చూసిన సింహానికి దాని నీడ కనిపించింది. దాన్ని మరో సింహంగా భావించి పెద్దగా గర్జిస్తూ బావిలో దూకింది. రాళ్లకు తగిలి విలవిల్లాడుతూ చనిపోయింది. సింహం పీడ విరగడ కావడంతో జంతువులన్నీ ఆనందంగా జీవించాయి. 

Updated Date - 2020-11-20T05:30:00+05:30 IST