గోవా విమానాశ్రయంలో పెరిగిన ప్రయాణికుల రద్దీ

ABN , First Publish Date - 2022-04-07T20:29:03+05:30 IST

గోవా విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు నెమ్మదిగా సాధారణ

గోవా విమానాశ్రయంలో పెరిగిన ప్రయాణికుల రద్దీ

పనజీ : గోవా విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కోవిడ్-19 మహమ్మారి పూర్వపు స్థితికి చేరుకునే దిశగా గడచిన మూడు నెలల్లో ప్రయాణికుల రద్దీ కనిపించింది. మార్చి నెలలో ఈ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల సంఖ్య 78 శాతం పెరిగింది. గోవాను సందర్శించే యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. 


కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతోపాటు, గోవా శాసన సభ ఎన్నికల కోసం విధించిన ఆంక్షలను ఉపసంహరించడం వల్ల ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. డబొలిమ్ విమానాశ్రయం విడుదల చేసిన వివరాల ప్రకారం, జనవరిలో 4,129; ఫిబ్రవరిలో 3,505; మార్చిలో 5,508 విమానాల రాకపోకలు జరిగాయి. ఈ టెర్మినల్ ద్వారా జనవరిలో 4.5 లక్షల మంది, ఫిబ్రవరిలో 5.2 లక్షల మంది, మార్చిలో 8.1 లక్షల మంది రాకపోకలు సాగించారు. 


జనవరి రెండున 204 డొమెస్టిక్ అరైవల్స్, డిపార్చర్స్‌ ఈ టెర్మినల్‌లో జరగడం ఓ లైఫ్‌టైం రికార్డు. డిసెంబరు 28 నుంచి జనవరి 2 వరకు 1,206 విమానాల రాకపోకలు ఈ విమానాశ్రయం నుంచి జరిగాయి. ఈ సమయంలో 1.6 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. మార్చి వారంతంలో 54,857 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కోవిడ్ మహమ్మారికి పూర్వం వారాంతాల్లో ఇదే స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు జరిగేవి. 


ఈ గణాంకాలు రివెంజ్ టూరిజం సజీవంగా ఉందని చెప్తున్నాయని విమానాశ్రయం అధికారులు చెప్పారు. కోవిడ్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న తర్వాత ఎయిర్‌లైన్స్ కోలుకుంటున్నాయన్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపిన వివరాల ప్రకారం, గోవా అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో తొమ్మిదవది. ప్రయాణికుల రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 


Updated Date - 2022-04-07T20:29:03+05:30 IST