ఉచితంలో అనుచితం

ABN , First Publish Date - 2022-06-21T08:15:47+05:30 IST

‘వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌’.. రైతన్నలకు ఎంతో ఊరట కలిగిస్తున్న పథకమిది. 2004 నుంచి ప్రభుత్వాలు మారినా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాయి.

ఉచితంలో అనుచితం

వ్యవసాయ విద్యుత్‌ పథకానికి తూట్లు!

పంపుసెట్లకు మీటర్లపై రైతులు వ్యతిరేకం 

బ్యాంకులకు ఆథరైజేషన్‌కు ససేమిరా 

ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం ఒత్తిడి

బిల్లుల్లో తప్పులు వస్తే బాధ్యులెవరు? 

ప్రతినెలా ఖాతాల్లో వేస్తారని గ్యారెంటీ ఏమిటి?

డిస్కమ్‌లు సొంత డబ్బు తీసుకుంటే ఎలా? 

బిల్లులు, జీతాలే సరిగా చెల్లించడం లేదు 

సర్కారు, డిస్కమ్‌ల తీరుపై రైతుల మండిపాటు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌’.. రైతన్నలకు ఎంతో ఊరట కలిగిస్తున్న పథకమిది. 2004 నుంచి ప్రభుత్వాలు మారినా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాయి. వ్యవసాయ పంప్‌ సెట్లకు రోజుకు 9 గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. 18 ఏళ్లుగా పంప్‌ సెట్లకు మీటర్లు లేవు. బిల్లులూ వసూలు చేయడం లేదు. ఏ ప్రభుత్వమూ అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ఎలాంటి అవాంతరాలూ లేకుండా సాఫీగా అమలవుతున్న ఈ పథకానికి జగన్‌ సర్కారు క్రమంగా తూట్లు పొడుస్తోందని రైతాంగం ఆందోళన చెందుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు, షరతులే ఇందుకు కారణం. పంప్‌ సెట్లకు మీటర్లు అమర్చడాన్ని, షరతులను రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఉచిత విద్యుత్‌ పథకంలో లబ్ధి పొందాలంటే మోటార్లకు మీటర్లు బిగించేందుకు రైతులు కచ్చితంగా ఆమోదం తెలపాలని డిస్కమ్‌లు చెబుతున్నాయి.


నెలవారీ విద్యుత్‌ వాడకం బిల్లుల మొత్తాలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖాతాల నుంచి డిస్కమ్‌లు నేరుగా డబ్బు తీసుకుంటాయని వెల్లడించింది. రైతులు పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. రైతు ఖాతా నుంచి నేరుగా డిస్కమ్‌లకు బిల్లులు చెల్లించడం వల్ల కరెంటు సరఫరాలో లోపాలుంటే డిస్కమ్‌లను నిలదీసే హక్కు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే చెబుతూ వచ్చారు. అయితే అసలు తిరకాసు ఇక్కడే మొదలైంది. నెలవారీ బిల్లులను డిస్కమ్‌లు వసూలు చేసుకునేందుకు వీలుగా రైతులు తమ బ్యాంకు ఖాతా నంబర్‌ ఇవ్వడంతో పాటు బ్యాంకులకు ఆథరైజేషన్‌ ఇవ్వాలి. ఇందుకోసం రైతుల నుంచి సంతకాల సేకరణను డిస్కమ్‌లు ప్రారంభించాయి. సంతకాలు చేసిన వారే ఉచిత విద్యుత్‌ పథకంలో లబ్ధి పొందుతారని, లేదంటే రైతులు వాడిన విద్యుత్‌కు వారే బిల్లులు చెల్లించుకోవాలని డిస్కమ్‌లు స్పష్టం చేసున్నాయి. శ్రీకాకుళంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన మోటార్లకు మీటర్ల బిగింపు కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి ఆథరైజేషన్‌ పత్రాలు తీసుకుంటున్నారు.


అయితే ఆచరణలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకం ఎవరిది? ఈ పథకం అమలు కోసం బ్యాంకులకు ఆథరైజేషన్‌ ఇవ్వాల్సింది ఎవరు?’’ అని ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తున్నారు. ఇతర పథకాల తరహాలోనే ఈ పథకం కూడా నీరుగారిపోతుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 


రైతులపై డిస్కమ్‌ల ఒత్తిడి 

ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేసిన వ్యవసాయ పంప్‌ సెట్లకు మోటార్లు బిగించే కార్యక్రమాన్ని క్రమంగా రాష్ట్రమంతా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యుత్‌ వాడకంపై వాస్తవ గణాంకాలు తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నట్టు చెబుతున్నారు. మీటర్ల రీడింగ్‌ మేరకు బిల్లులను వ్యక్తిగతంగా రైతులకు అందజేస్తారని, ఆ మొత్తాన్ని మాత్రం ప్రభుత్వమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని డిస్కమ్‌లు చెబుతూ వచ్చాయి. ఈ జమ చేసిన మొత్తాన్ని డిస్కమ్‌లు రైతుల బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా చేసుకుంటాయని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే రైతుల ఖాతాల్లోకి విద్యుత్‌ బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వం వేసినప్పటికీ.. వారి ఆమోదం లేకుండా డిస్కమ్‌లు నేరుగా డబ్బులు విత్‌డ్రా చేసుకోలేవు. ఈ బిల్లులు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా బ్యాం కులకు ఆథరైజేషన్‌ ఇవ్వాలని రైతులపై డిస్కమ్‌లు ఒత్తిడి తెస్తున్నాయి. తామెందుకు బ్యాంకులకు ఆథరైజేషన్‌ ఇవ్వాలని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 


ఆథరైజేషన్‌ ఎలా సాధ్యం..? 

ఈసీఎస్‌ విధానంలో ఆర్థిక సంస్థలు నెలవారీగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు నేరుగా విత్‌డ్రా చేసుకునే విధానం ప్రస్తుతం అమలులో ఉంది. గృహ, వాహన, ఇతర వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటారు. ఇలా తీసుకున్న రుణాలను ప్రతినెలా నిర్ణీత మొత్తంలో వాయిదాల రూపంలో చెల్లిస్తారు. ఆర్థిక సంస్థలు ముందుగా నిర్దేశించుకున్న మొత్తాన్ని మాత్రమే ప్రతినెలా విత్‌డ్రా చేసుకుంటాయి. కానీ రైతులకు ప్రభుత్వం అందించే ఉచిత విద్యుత్‌ పథకంలో బిల్లులు ప్రతినెలా ఒకేలా వచ్చే అవకాశం లేదు. రైతు వాడే కరెంటును బట్టి నెలవారీ బిల్లు వస్తుంది. ఒక నెల బిల్లు మొత్తం ఎక్కువగా, మరో నెల తక్కువగా రావచ్చు. ఇలా బిల్లులు అస్థిరంగా వచ్చే వీలున్నందున తమ ఖాతాల నుంచి డిస్కమ్‌లు డబ్బు విత్‌ డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు ఎలా ఆఽథరైజేషన్‌ ఇస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు. 


రైతుల అభ్యంతరాలు, సందేహాలు ఇవీ.. 

  • విద్యుత్‌ బిల్లుల్లో తప్పులు దొర్లే అవకాశముంది. అలాంటప్పుడు బ్యాంకుల్లో వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బును డిస్కమ్‌లు విత్‌ డ్రా చేసుకుంటే రైతుల పరిస్థితి ఏమిటి? ఎవరిని అడిగాలి? జవాబుదారు ఎవరు? 
  • రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఎప్పుడు డబ్బు వేస్తుందో చెప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులకు ఆథరైజేషన్‌ ఇవ్వాలనడం సబబా? 
  • ప్రభుత్వం కచ్చితంగా నెల నెలా రైతుల ఖాతాల్లో విద్యుత్‌ బిల్లులు జమ చేస్తుందని గ్యారెంటీ ఏమి టి? కాంట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లించడం లేదు. 
  • ఆథరైజేషన్‌ ఇచ్చాక ప్రభుత్వం ఖాతాల్లో డబ్బులు వేయకపోయినా రైతుల ఖాతాల నుంచి డిస్కమ్‌లు డబ్బులు విత్‌డ్రా చేసే వీలుంది. ఖాతాల్లో సరిపడనంత నగదు లేకుంటే ఒక విధంగా డిఫాల్టర్‌ కిందకు వస్తుంది. 
  • ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉచిత విద్యుత్‌ కోసం రైతుల పేరిట ప్రభుత్వమే ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను తెరవాలి. అప్పుడు బ్యాంకులకు ఆఽథరైజేషన్‌ ఇచ్చినా సమస్య ఉండదు. ప్రస్తుతమున్న ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామంటే కుదరదని, వివరాలు ఇచ్చేది లేదని రైతాంగం స్పష్టం చేస్తోంది. 

Updated Date - 2022-06-21T08:15:47+05:30 IST