భక్తులకూ.. భద్రత శూన్యం

ABN , First Publish Date - 2020-09-28T17:17:26+05:30 IST

దుర్గగుడిలో భక్తులకు సైతం భద్రత లేదు. ఇక్కడ ఫైర్‌ సేఫ్టీని అధికారులు నిర్లక్ష్యం చేయడం..

భక్తులకూ.. భద్రత శూన్యం

దుర్గగుడిలో ఫైర్‌ సేఫ్టీ అలంకారప్రాయమే

నిర్వహణ లేక తుప్పు పట్టిపోతున్న పరికరాలు

ఆలయంలో ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుర్గగుడిలో భక్తులకు సైతం భద్రత లేదు. ఇక్కడ  ఫైర్‌ సేఫ్టీని అధికారులు నిర్లక్ష్యం చేయడం చూసి ప్రభుత్వ భద్రతా విభాగాల అధికారులు సైతం విస్తుపోతున్నారు. అమ్మవారి ప్రధాన ఆలయం ముందు నిర్మించిన ఏడంతస్థుల మహామండపంలో ఆరేళ్ల క్రితమే ఫైర్‌ ఫైటింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేసినా ఇంత వరకు కనెక్షన్లు ఇవ్వకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం. అమ్మవారి ఆలయంలోనూ, ఉపాలయాల్లోనూ అర్చకులు నిత్యం హారతులు ఇస్తూనే ఉంటారు. అమ్మవారికి నివేదనలను తయారు చేసే వంటశాల మహామండపంలోనే ఉంది. అయినా దుర్గగుడి అధికారులు అప్రమత్తంగా వ్యవహరించక, నిప్పుతో చెలగాటమాడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆలయంలో జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?


విజయవాడ హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో కొద్దికాలం క్రితం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదానికి పది మంది కరోనా బాధితులు బలైపోయిన విషయం తెలిసిందే. ఆ హోటల్‌ భవనంలో నిబంధనల ప్రకారం అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, భవనానికి అత్యవసర ద్వారం లేకపోడమే ఇంత ప్రాణ నష్టం జరగడానికి కారణమని తర్వాత దర్యాప్తు బృందాలు తేల్చాయి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే దుర్గగుడిలోనూ అలాంటి ప్రమాదమే పొంచి ఉంది. కనకదుర్గమ్మ ఆలయంలోనూ, ఉపాలయాలు, ముఖమండపం, ప్రాకార మండపాల్లో ఎక్కడ ప్రమాదం సంభవించినా, ఎలాంటి అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవు. అమ్మవారి ప్రధాన ఆలయం ముందు నిర్మించిన ఏడంతస్థుల మహామండపంలో ఆరేళ్ల క్రితమే ఫైర్‌ ఫైటింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేసినా పనికిరాకుండా పడి ఉంది. అమ్మవారి ఆలయంలోను, ఉపాలయాల్లోను అర్చకులు నిత్యం హారతులు ఇస్తూనే ఉంటారు. 


అమ్మవారికి నివేదనలను తయారు చేసే వంటశాల మహామండపం ఆరో అంతస్థులోనే ఉంది.  హారతులు మొదలుకొని ప్రసాదాల తయారీ పోటులో నిత్యం నిప్పు రాజుకుంటూనే ఉంటుంది. అయినా ఆలయంలో అగ్నిమాపక వ్యవస్థపై అధికారులు దృష్టి పెట్టకపోవడాన్ని చూసి ప్రభుత్వ భద్రతా విభాగాల అధికారులు సైతం విస్తుపోతున్నారు. 


నిరుపయోగంగా ఫైర్‌ పైటింగ్‌ వ్యవస్థ 

అమ్మవారి ప్రధాన ఆలయం ముందు నిర్మించిన ఏడంతస్థుల మహామండపంలోని రెండు, మూడు అంతస్థుల్లో భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేస్తారు. నాలుగో అంతస్థులో భక్తులు సేదదీరుతుంటారు. ఐదో అంతస్థులో పూజా సామగ్రిని విక్రయించే షాపులున్నాయి. ఆరో అంతస్థులో ఉత్సవ మూర్తులకు భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. దసరాల్లో లక్ష కుంకుమార్చనలు ఇక్కడే జరుగుతాయి. ఆరో అంతస్థులో ప్రధాన స్టోర్స్‌, దాని పక్కనే అమ్మవారికి నివేదన తయారు చేసే వంటశాల ఉంది. ఈ భవనంలో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నియంత్రించడానికి వీలుగా 2014-15లోనే రూ.లక్షలు వెచ్చించి ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలను ఏర్పాటు చేశారు. భవనంలో ఎక్కడికక్కడ ఫైర్‌ ఫైటర్లు, ఎగ్జాస్టర్లు, పైపులైన్లు, స్మోక్‌ డిక్టేటర్లు, అలారాలు.. ఏర్పాటు చేశారు.


కానీ వాటికి కనెక్షన్లు ఇవ్వకుండా వదిలేయడంతో అగ్నిమాపక వ్యవస్థ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. ఏళ్ల తరబడి వినియోగించకపోవడం వల్ల విలువైన పరికరాలు తుప్పు పట్టిపోతున్నాయి. మహామండపం మెట్ల దారి నుంచే ఎక్కువమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. తిరిగి కిందికి చేరుకోవడానికి ఆరు మార్గాలున్నప్పటికీ.. అన్నింటినీ మూసివేశారు. దీంతో శివాలయం మెట్ల మార్గం ద్వారానే కిందికి దిగి రావాల్సిన వస్తోంది. కొండపై రద్దీ సమయంలో ఏదైనా  ప్రమాదం సంభవిస్తే భక్తులు సులువుగా కిందికి దిగడానికి అత్యవసర మార్గాలు కూడా లేవు. 


భక్తుల ప్రాణాలు గాల్లో దీపాలే! 

ఆరేళ్లకు పైగా అగ్నిమాపక వ్యవస్థ పనిచేయకపోవడం వల్ల భక్తుల ప్రాణాలకు, కనకదుర్గమ్మకు చెందిన విలువైన ఆస్తులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. కరోనా కారణంగా ప్రస్తుతం రద్దీ తగ్గింది కానీ.. సాధారణ రోజుల్లో 30 నుంచి 40 వేల మంది వరకు భక్తులు అమ్మవారిని కొలిచేందుకు కొండపైకి వస్తుంటారు. దసరా ఉత్సవాల్లో ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇంత రద్దీగా ఉండే ఆలయంలో అడుగడుగునా భద్రతా లోపాలే కనిపిస్తుండటం అధికారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. వచ్చే నెల 17 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఉత్సవాల్లో కొవిడ్‌ నిబంధనలను అమలు చేస్తూ రోజుకు పది వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆలయంలో భద్రతాపరమైన ఏర్పాట్లపై సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ అధికారులు సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహించినప్పుడు అడుగుడుగునా లోపాలే వెలుగు చూశాయి. 


సంపు నిర్మాణానికి టెండర్లు పిలిచాం 

మహామండపం, ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఫైర్‌ ఫైటింగ్‌ సిలిండర్లు, సెక్యూరిటీ అలారాలు కొత్తవి ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. అవసరమైన నీటి సరఫరా కోసం ఆలయ ప్రాంగణంలోనే పెద్ద సంపు నిర్మించి.. మోటార్లు అమర్చాలని మొదట్లోనే ప్రతిపాదించారు. సంపు నిర్మాణానికి ఇప్పటికి ఆరేడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఆ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్లీ సంపు నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించాం. సాధ్యమైనంత వరకు దసరా ఉత్సవాల నాటికే ఆలయంలో ఫైర్‌ ఫైటింగ్‌ ఎక్విప్‌మెంట్‌ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. 

- డి.వి.భాస్కరరావు, ఈఈ, దుర్గగుడి 

Updated Date - 2020-09-28T17:17:26+05:30 IST