భారత్‌లో ‘పన్ను’ను తప్పించుకునేందుకు... దుబాయ్‌ కేంద్రంగా డబ్బు మళ్ళింపు

ABN , First Publish Date - 2022-06-27T23:16:46+05:30 IST

భారత్‌లో ‘పన్ను’ను తప్పించుకునే క్రమంలో... దుబాయ్ కేంద్రంగా డబ్బు మళ్ళింపు జరిగినట్లు ముంబైలోని National Stock Exchange(NSE) కో-లొకేషన్ స్కామ్‌ విషయమై ఏజెన్సీలు జరిపిన పరిశోధనల్లో వెలుగులోకొచ్చింది.

భారత్‌లో ‘పన్ను’ను తప్పించుకునేందుకు...  దుబాయ్‌ కేంద్రంగా డబ్బు మళ్ళింపు

* చట్టవిరుద్ధంగా... గ్లోబల్ ఎక్స్ఛేంజీల మధ్య ట్రేడింగ్ లింక్‌లు

- కో-లొకేషన్ స్కామ్‌... విస్తుపోయే నిజాలు 

ముంబై : భారత్‌లో ‘పన్ను’ను తప్పించుకునే క్రమంలో... దుబాయ్ కేంద్రంగా డబ్బు మళ్ళింపు జరిగినట్లు ముంబైలోని National Stock Exchange(NSE) కో-లొకేషన్ స్కామ్‌ విషయమై ఏజెన్సీలు జరిపిన పరిశోధనల్లో వెలుగులోకొచ్చింది. ఈ క్రమంలో... హవాలా కార్యకలాపాలకు.. అమెరికా, చైనా, బ్రిటన్, పశ్చిమ ఆసియాలోని ఇతర గ్లోబల్ ఎక్స్ఛేంజీలకు వ్యాపారం కోసం డబ్బును దుబాయ్‌ కేంద్రంగా మళ్లించినట్లు తేలింది.


NSE, MCX, BSE, SHFE తదితర గ్లోబల్ ఎక్స్ఛేంజీల మధ్య ట్రేడింగ్ లింక్‌లను ఏర్పాటు చేయడానికి బ్రోకర్లు చట్టవిరుద్ధమైన మార్గాలను మోహరించినట్లు వినవస్తోంది. భారత్‌లో పన్నులను తప్పించుకునేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో, లేదా... సంస్థాగత పెట్టుబడులుగా మభ్యపెడుతూ భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ చేసేందుకు రౌండ్-ట్రిప్డ్ డబ్బును వినియోగించటం మన భారత్‌లో  చట్టవిరుద్ధం. ఈ క్రమంలో... థర్డ్-పార్టీ సర్వర్ల ద్వారా వీటిని నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. 


రెప్పపాటు తేడాతో...

అమెరికా, మారిషస్ నుంచి అధిక-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ లావాదేవీలతో పాటు, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రిజిస్టరైన  భారత బ్రోకర్లకు కూడా లింక్ ఉన్నట్లు తేలింది. దుబాయ్, ముంబై మధ్య దాదాపు 26 మిల్లీసెకన్ల వద్ద పాయింట్ టు పాయింట్ లేటెన్సీ(ట్రేడింగ్ స్పీడ్) అత్యల్పంగా ఉందని విచారణలో తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో... పలువురు వ్యాపారులు లక్షలు ఖర్చు చేసి ఆయా దేశాల మధ్య ట్రేడింగ్ స్పీడ్ మిల్లీసెకన్ల పాటు తేడా ఉండేలా ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.


పలువురు వ్యాపారులు ఈ క్రమంలోనే తమ ఆఫ్‌షోర్ కంపెనీలను దుబాయ్‌లో నమోదు చేసుకున్నట్లు వినవస్తోంది. డబ్బును హవాలా మార్గంలో దుబాయ్‌కి పంపించి, అక్కడినుంచి అన్ని ప్రాంతాలకు మళ్లించారు. కనెక్టివిటీ ఏర్పడిన తర్వాత వ్యాపారులు భారత్‌లోని ఎవరికైనా సాధారణ లావాదేవీల ద్వారా కావలసిన గమ్యస్థానానికి ‘exchange platform'లో డబ్బును బదిలీ చేయవచ్చని వినవస్తోంది. ఇలా కొన్ని ట్రేడ్స్ చేయడంద్వారా డబ్బును నల్ల ధనం రూపంలో దేశంలోకి తీసుకు రావటం సులువు.


నష్టాల్లో ఉన్న బ్రోకరేజ్ సంస్థల పుస్తకాల్లో వీటిని సర్థుబాటు చేసి తక్కువ పన్నును చెల్లిస్తారు. అక్రమంగా విదేశాలకు డబ్బును పంపేందుకు కూడా ఇదే మార్గం వినియోగంలో ఉన్నట్లు చెబుతున్నారు. పైగా దుబాయ్ లో 20 ఫ్రీ జోన్స్ ఉన్నాయి. దుబాయ్‌లో 100 శాతం గోప్యత ప్రయోజనం కూడా ఉంది. దీనిని అక్రమార్కులు తమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఇలాంటి పలు థర్డ్-పార్టీ డేటా సెంటర్‌లు ముంబై, ఢిల్లీ నుండి నడుస్తున్నట్లు సమాచారం. ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌లు ఉన్నత స్థాయి NSE ఇన్‌సైడర్‌ల ద్వారా బ్రోకర్‌లకు చేరినట్లు సమాచారం. వివిధ ఎక్స్ఛేంజీల మధ్య కనెక్టివిటీకి సంబంధించిన వాస్తవాలు ఇద్దరు NSE ఉద్యోగుల ఈ-మెయిళ్ళ లో కూడా చర్చకు వచ్చినట్లు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-27T23:16:46+05:30 IST