మే 2020 తర్వాత తొలిసారి.. నవీ ముంబైలో 1000 లోపు కేసులు

ABN , First Publish Date - 2021-12-12T02:33:16+05:30 IST

కరోనా తొలినాళ్లలోను, ఆ తర్వాత దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కింది.

మే 2020 తర్వాత తొలిసారి.. నవీ ముంబైలో 1000 లోపు కేసులు

ముంబై: కరోనా తొలినాళ్లలోను, ఆ తర్వాత దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కింది. అందులోనూ ముంబైలో కేసులు పోటెత్తాయి. ఇక, నవీ ముంబైలో కేసులు మరో ఎత్తు. అక్కడ ప్రతి నెల వెయ్యి కేసులకు తక్కువగా ఎప్పుడూ నమోదు కాలేదు.


కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత కూడా అక్కడ అదే పంథా కొనసాగింది. అయితే, తొలిసారి అక్కడ ఇన్నాళ్లకు కేసులు వెయ్యికి తగ్గడం అధికారులకు ఊరటనిస్తోంది. నవీ ముంబైలో నెల రోజుల వ్యవధిలో 767 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అక్కడ అత్యధికంగా 26,930 కేసులు వెలుగుచూశాయి.


మహమ్మారి మొదలైన మార్చి 2020లో నవీ ముంబైలో 12 కేసులు నమోదు కాగా, ఏప్రిల్‌లో 218 కేసులు నమోదయ్యాయి. మేలో ఈ సంఖ్య వెయ్యి దాటేసి 1973కి ఎగబాకింది. ఆ ఏడాది ఆగస్టులో అత్యధికంగా 10,764 కేసులు నమోదయ్యాయి.


మొత్తంగా ఆ ఏడాది 51,002 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో 2007 కేసులు వెలుగు చూడగా, ఏప్రిల్‌లో అత్యధికంగా 26,930 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుదల మొదలైంది. మేలో మొత్తంగా 5,618 కేసులు నమోదయ్యాయి. 


ఆ తర్వాత ఇప్పుడు తొలిసారి వెయ్యి లోపు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. నవీముంబైలో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1.09 లక్షల మంది కరోనా బారినపడ్డారని అధికారులు తెలిపారు. అలాగే, ఇప్పటి వరకు 12.02 లక్షల మంది ప్రజలు వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారని, 8.59 లక్ష మంది రెండో డోసు కూడా తీసుకున్నారని వివరించారు. 

Updated Date - 2021-12-12T02:33:16+05:30 IST