వరద నిర్వహణకు రూ.2,250 కోట్లు

ABN , First Publish Date - 2022-06-26T16:43:50+05:30 IST

వర్షం పడితే వరదలతో తల్లడిల్లే హైదరాబాద్‌లో ఆ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు రూ.2,250 కోట్లతో పనులు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ శనివారం విడుదల

వరద నిర్వహణకు రూ.2,250 కోట్లు

వివిధ దశల్లో పనులు

నాలాలు, వరద నీటి డ్రైన్‌ల నిర్మాణం, పునరుద్ధరణ

చెరువులకూ మరమ్మతు


హైదరాబాద్‌ సిటీ: వర్షం పడితే వరదలతో తల్లడిల్లే హైదరాబాద్‌లో ఆ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు రూ.2,250 కోట్లతో పనులు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నాలాల పూడికతీత, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, బాక్స్‌ డ్రైన్‌లు, చెరువుల వద్ద అలుగుల మరమ్మతు, బండ్‌ల బలోపేతం వంటి పనులు చేపట్టామని తెలిపింది.. ఇంజనీరింగ్‌ మెయింటెనెన్స్‌ విభాగం రూ.415 కోట్లతో, ప్రాజెక్టుల విభాగం రూ.1,006 కోట్లు, వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ)లో భాగంగా రూ.735 కోట్లు, చెరువుల మరమ్మతు కోసం రూ.94 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు పేర్కొంది.


ఎస్‌ఎన్‌డీపీలో 37 పనులు

నాలాల అభివృద్ధి, విస్తరణ, రహదారులున్న చోట బాక్స్‌ డ్రైన్‌లు ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా నిర్మిస్తున్నారు. గ్రేటర్‌లో 37 పనులకుగాను 36 ప్రాంతాల్లోని పనులు పురోగతిలో ఉన్నాయి. ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం అనుమతి వచ్చిన వెంటనే మరో పని మొదలవుతుందని పేర్కొన్నారు. 13చోట్ల పనులు త్వరలో పూర్తవుతాయని చెబుతున్నారు. వర్షం కురిసినా పనులకు ఆటంకం కలగకుండా ప్రత్యేక మాన్‌సూన్‌ బృందాలు ఏర్పాటు చేశారు.  


వరద నీటి డ్రైన్‌లు

వరద నీటి ప్రవాహం కోసం పలు ప్రాంతాల్లో స్ర్టామ్‌ వాటర్‌ డ్రైన్‌లు నిర్మిస్తున్నారు. నాలా భద్రతా చర్యల్లో భాగంగా ప్రీ కాస్ట్‌ స్లాబ్స్‌, చైన్‌ లింక్‌ మెష్‌ ఏర్పాటు చేస్తున్నారు.  


అయినా.. వరద ముంపు

ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తోన్నా, పనులు పూర్తయ్యాయని/పూర్తవుతున్నాయని జీహెచ్‌ఎంసీ హడావిడి చేస్తోన్నా చినుకు పడితే నగరవాసికి వణుకు తప్పడం లేదు. వాన కురిసిందంటే ఇప్పటికీ ఆయా ప్రాంతాలను వరదలు ముంచెత్తుతుండడం గమనార్హం.


అప్రమత్తంగా ఉండాలి : మేయర్‌ 

వర్షాకాలం నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జోనల్‌, అడిషనల్‌ కమిషనర్స్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జోనల్‌ స్థాయిలో హెల్ప్‌లైన్‌ (కంట్రోల్‌ రూమ్‌) ఏర్పాటు చేయాలని జోనల్‌ కమిషనర్‌లను ఆదేశించారు.

Updated Date - 2022-06-26T16:43:50+05:30 IST