విదేశీ బొగ్గు కోసం.. ప్రతి వారం15% బిల్లు చెల్లించాల్సిందే!

ABN , First Publish Date - 2022-05-27T08:42:46+05:30 IST

ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ బొగ్గును జెన్‌కో (విద్యుదుత్పత్తి సంస్థలు)లతో కొనిపించాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త ఉత్తర్వులతో రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బొగ్గు దిగుమతులకు నిధుల కోసం.

విదేశీ బొగ్గు కోసం.. ప్రతి వారం15% బిల్లు చెల్లించాల్సిందే!

  • జెన్‌కోలకు డిస్కంలు తప్పక కట్టాల్సిందే
  • లేదంటే రాష్ట్రానికి 15% విద్యుత్తు కోత
  • విదేశీ బొగ్గు కొనుగోళ్లకు కొత్త నిబంధ న
  • ఎన్టీపీసీ, ‘ప్రైవేట్‌’తో రాష్ట్రానికి ఇబ్బందులే


హైదరాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి): ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ బొగ్గును జెన్‌కో (విద్యుదుత్పత్తి సంస్థలు)లతో కొనిపించాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త ఉత్తర్వులతో రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బొగ్గు దిగుమతులకు నిధుల కోసం.. విద్యుదుత్పత్తి సంస్థలకు ఇకపై ప్రతి వారం కనీసం 15 శాతం బిల్లులు చెల్లించాలని దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లకు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ గురువారం ఆదేశాలిచ్చింది. బిల్లు జారీ చేసిన తేదీ నుంచి.. వారంలోపు జెన్‌కోలు కచ్చితంగా కనీసం 15 శాతం చెల్లించాలని, మిగిలిన 85 శాతం మొత్తాన్ని కొనుగోలు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం చేయాలని పేర్కొంది. వారంలోగా 15 శాతం బిల్లు కట్టడంలో విఫలమైతే, ఒప్పందం ప్రకారం డిస్కంలకు అమ్మాల్సిన విద్యుత్తులో 15 శాతాన్ని విద్యుదుత్పత్తి కంపెనీలు ఎనర్జీ ఎక్స్ఛేంజీల్లో అమ్ముకోవడానికి వీలు కల్పించింది. 2023 మార్చి 31 వరకు ఈ నిబంధన అమల్లోకి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక విద్యుదుత్పత్తికి మండించే బొగ్గులో విధిగా 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని, దీనికయ్యే అదనపు వ్యయాన్ని కొనుగోలుదారుల నుంచి ఉత్పత్తి సంస్థలు వసూలు చేసుకోవడానికి వీలుగా కూడా కొత్త విధానాన్ని విడుదల చేసింది.


రాష్ట్ర డిస్కంలపై ప్రభావం

కేంద్రం నిబంధనల ప్రభావం రాష్ట్ర డిస్కమ్‌లపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఎన్టీపీసీ, ఇతర కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి 3,111 మెగావాట్లు, ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్లు, ప్రైవేటు సంస్థ సెంబ్‌కార్ప్‌ నుంచి 840 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తును రాష్ట్ర డిస్కమ్‌లు కొనుగోలు చేస్తున్నాయి. ఇవన్నీ దీర్ఘకాలిక ఒప్పందాలు. వీటిలో విద్యుత్తు సరఫరా చేసిన 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించే వెసులుబాటుంది.  ఆ గడువులోగా కూడా రాష్ట్ర డిస్కంలు కట్టలేకపోతున్నాయి. రూ.వందల కోట్ల ఆలస్య రుసుమును భరిస్తున్నాయి. ఇక కేంద్రం కొత్త ఆదేశాల ప్రకారమైతే.. ఎన్టీపీసీ తదితర విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రతి వారం 15 శాతం బిల్లులు చెల్లించాలి. లేదా 15 శాతం విద్యుత్తును కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే.. 750 మెగావాట్ల లోటును ఎదుర్కోనున్నాయి.


దిగుమతితో తీవ్ర ప్రభావం

రాష్ట్రంలోని జెన్‌కో కేంద్రాలన్నింట్లో సరిపడా నిల్వలున్నాయని.. బొగ్గును కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తెలంగాణ జెన్‌కో ఇప్పటికే కేంద్రానికి స్పష్టం చేసింది. ఎన్‌టీపీసీ, సెమ్‌కార్ప్‌లు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటే.. వాటికి 15 శాతం చెల్లించాల్సిన పరిస్థితి డిస్కమ్‌లది. ప్రస్తుతం వేతనాల మంజూరుకే ఇబ్బంది పడుతున్న డిస్కమ్‌లు, ఆ వ్యయాన్ని భరించే పరిస్థితుల్లేవు. దేశంలో బొగ్గు కొరత తీవ్రమైన నేపథ్యంలో అన్ని థర్మల్‌ విద్యుత్కేంద్రాల్లో 90 శాతం దేశీయ బొగ్గులో 10 శాతం విదేశీ బొగ్గును తప్పనిసరిగా కలిపి మండించి ఉత్పత్తి చేయాలని గతంలోనే కేంద్రం పలుసార్లు ఆదేశించింది. తాజాగా విదేశీ బొగ్గు కొనుగోళ్లకు ఈ నెల 31లోగా ఆర్డర్లు జారీ చేయాలని, జూన్‌ 15లోగా దిగుమతులు ప్లాంట్ల వద్దకు చేరుకోవాలని మరో ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, తమకు విదేశీ బొగ్గు దిగుమతి అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. వాస్తవానికి బొగ్గు దిగుమతుల ఆదేశాల ప్రభావం జెన్‌కో, సింగరేణి థర్మల్‌ విద్యుత్కేంద్రాలపై ఉండదని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ, తాజాగా ప్రతి వారం 15 శాతం బిల్లుల చెల్లింపు, లేదంటే 15 శాతం విద్యుత్తు కోత పెడతామని కేంద్రం పేర్కొనడంతో ప్రభావం పడుతోంది. ఇక తెలంగాణ జెన్‌కో కేంద్రాలు కూడా విధిగా బొగ్గు కొనాలని కేంద్రం గుర్తుచేయడంతో డిస్కమ్‌లలో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2022-05-27T08:42:46+05:30 IST