న్యాయం కోసం.. మళ్లీ మళ్లీ..

ABN , First Publish Date - 2022-08-09T05:03:50+05:30 IST

స్థానికంగా అధికారులను ఆశ్రయించాము... అక్కడ మాకు న్యాయం జరగలేదు.. మీ దగ్గరకు వచ్చినాం.. అయినా మా సమస్య తీరలేదు.. మీరు మరొక్కసారి జోక్యం చేసుకుని.. న్యాయం చేయమని.. కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ప్రజలు మళ్లీ మళ్లీ వస్తున్నారు. ఇందులో భూవివాదాలు, కుటుంబ తగాదాలతోనే.. ఎక్కువ మంది స్పందన తలుపుతడుతున్నారు. స్థానికంగా అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి.. జిల్లా అధికారుల వద్దకు వచ్చినా.. తమ సమస్య పరిష్కారం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

న్యాయం కోసం.. మళ్లీ మళ్లీ..
కలెక్టరేట్‌ వద్ద అర్జీదారులకు అర్జీలు రాసిస్తున్న దృశ్యం

స్పందన తలుపు తడుతున్న అర్జీదారులు

భూవివాదాలు.. కుటుంబ తగాదాలే అధికం

కలెక్టర్‌, ఎస్పీ స్పందనలకు జనం

(రాయచోటి-ఆంధ్రజ్యోతి): స్థానికంగా అధికారులను ఆశ్రయించాము... అక్కడ మాకు న్యాయం జరగలేదు.. మీ దగ్గరకు వచ్చినాం.. అయినా మా సమస్య తీరలేదు.. మీరు మరొక్కసారి జోక్యం చేసుకుని.. న్యాయం చేయమని.. కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ప్రజలు మళ్లీ మళ్లీ వస్తున్నారు. ఇందులో భూవివాదాలు, కుటుంబ తగాదాలతోనే.. ఎక్కువ మంది స్పందన తలుపుతడుతున్నారు. స్థానికంగా అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి.. జిల్లా అధికారుల వద్దకు వచ్చినా.. తమ సమస్య పరిష్కారం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇందులో ఎక్కువగా భూవివాదాలు, కుటుంబ తగాదాలే ఉండడంతో.. కొన్ని సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం కలెక్టర్‌, ఎస్పీ స్పందన కార్యక్రమాన్ని ఆంధ్రజ్యోతి పరిశీలించింది. 


ఎక్కువగా భూవివాదాలే..

జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కలెక్టర్‌, ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అందులో ఎక్కువగా భూముల సమస్యల మీదే వస్తున్నాయి. డీకేటీ భూములు, ఇతరులు ఆక్రమించుకోవడం, దౌర్జన్యంగా స్థలంలోకి ప్రవేశించడం వంటి సమస్యలే అధికంగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు కలెక్టర్‌ వద్దకు 5003 అర్జీలు వచ్చాయి. ఇందులో రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు 683,  ఆక్రమణలకు సంబంధించి 347, భూ సేకరణకు సంబంధించి 242, హౌసింగ్‌ కార్పొరేషన్‌ సంబంధించి 226, లా అండ్‌ ఆర్డర్‌కు సంబంధించి 225, ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి 160, వలంటీర్లకు సంబంధించి 159, భూపరిపాలనకు సంబందించి 135, ఏపీఎస్పీడీసీఎల్‌కు సంబంధించి 126, అసైన్‌మెంట్‌ ఇంటి స్థలాల విషయమై 117 ఫిర్యాదులు అందాయి. అందులో 4416 పరిష్కారం అయినట్లు కలెక్టరేట్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా 587 పరిష్కారం కావాల్సి ఉంది. భూవివాదాలు అప్పటికప్పుడే పరిష్కరించడానికి చాలా సమస్యలు ఉన్నాయని కలెక్టర్‌ గిరీషా తెలిపారు. అదే విధంగా ఎస్పీ కార్యాలయానికి కూడా ఇప్పటి వరకు సుమారు 1000కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా భూవివాదాలు ఉండగా.. తర్వాత స్థానంలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. ఈ రెండు విషయాలలో కొన్ని ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించలేకున్నామని ఎస్పీ హర్షవర్దన్‌రాజు తెలిపారు. స్థానికంగా రెవెన్యూ, పోలీసుల దగ్గర పరిష్కారం కాని సమస్యలనే తమ వద్దకు తీసుకురావాలని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. 


- గాలివీడు మండలం గోరాన్‌చెరువు గ్రామం ఆవులశెట్టివారిపల్లెకి చెందిన పెద్దరెడ్డెయ్య ఇప్పటికి రెండుసార్లు స్పందన కార్యక్రమానికి వచ్చి కలెక్టర్‌ను కలిశాడు. తనకు వృద్ధాప్య పెన్షన్‌ రావడం లేదని వాపోయాడు. తమ వలంటీర్‌ నీకు పెన్షన్‌ రాదు..పో అంటున్నాడని ఆవేదన చెందారు. తన కొడుకు కడపలో ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తాడని, అందుకే పెన్షన్‌ రావడం లేదన్నాడు. అయితే తమ గ్రామంలో కార్లు, 10 ఎకరాల వరకు భూములు ఉన్న వాళ్లకు వృద్ధాప్యపెన్షన్లు వస్తున్నాయని వాపోయాడు. దీంతో సోమవారం కలెక్టర్‌ను కలవడానికి వచ్చాడు. అయితే  మదనపల్లెలో మరొక కార్యక్రమంలో పాల్గొనడానికి కలెక్టర్‌ వెళ్లడంతో.. డీఆర్‌వోకు తన గోడు వెల్లబోసుకున్నాడు. 


- ములకలచెరువు మండలం చిటికెలవారిపల్లెకు చెందిన రైతు నరసింహారెడ్డి.. గత నెల కిందట ఎస్పీ స్పందన కార్యక్రమానికి వచ్చారు. తనకు న్యాయం జరగడం లేదని సోమవారం మరొక్కసారి వచ్చారు. అతడి కథనం ప్రకారం... తన తండ్రి చిన్నమల్‌రెడ్డి 30 సంవత్సరాల కిందట దళితుల దగ్గర సెటిల్‌మెంట్‌ భూమిని (ఒరిజినల్‌ పట్టా) కొన్నాడు. అప్పటి నుంచి ఇతడి అనుభవంలో ఉంది. అయితే ఆరు నెలల కిందట భూమిని అమ్మేసిన దళితులు వచ్చి.. దౌర్జన్యంగా ఆ భూమి తమదే అంటున్నారు. నెల రోజుల కిందట ఆ భూమిలో ఉన్న పంటను ధ్వంసం చేశారు. దీంతో అప్పుడు బాధితుడు ఎస్పీని కలిసి న్యాయం చేయమని అడిగాడు. అయినా ఇంతవరకు స్థానిక పోలీసులు న్యాయం చేయలేదు. వాళ్లతో నీవు గొడవ పడలేవు.. ఆ భూమిని అమ్మేసుకోమని స్థానిక పోలీసులు సలహా ఇస్తున్నారని వాపోయారు. 

Updated Date - 2022-08-09T05:03:50+05:30 IST