ఆడపడుచు కోసం..

Published: Sun, 27 Mar 2022 00:52:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆడపడుచు కోసం..

వందలాది కిలోమీటర్ల పాదయాత్ర
భ్రామరికి వాయనం సమర్పించేందుకని..
రోజుల తరబడి సాగుతున్న కన్నడిగులు
మండుటెండలను లెక్కచేయని భక్తులు


భ్రమరాంబదేవిని కన్నడిగులు ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. ఉగాది మహోత్సవాల కల్లా శ్రీశైలానికి వెళ్తారు. వందలాది కిలోమీటర్లు నడిచి ఆమె సన్నిధికి చేరుకుంటారు. పుట్టింటి సారె (పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, వడిబియ్యం) సమర్పిస్తారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ ఆచారం సాగుతోందని పండితులు చెబుతున్నారు. ఈ నెల 30 నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో వేలాదిగా కన్నడిగులు పాదయాత్రగా వస్తున్నారు. ఎండలను సైతం లెక్కచేయకుండా నల్లమల అటవీ మార్గాన్ని దాటుకుంటూ సాగుతున్నారు.
- ఆత్మకూరు

శ్రీశైలంతో కన్నడిగులకు అనుబంధం

భ్రమరాంబ కన్నడిగురాలు. స్వప్నంలో సాక్షాత్కరించిన పరమేశ్వరుడిని వరించాలని తలంచుతుంది. దీంతో శివుడు ఓ భ్రమరమును (తుమ్మెదను) చూపించి అది నిలిచిన చోటుకు వస్తే తానే వరిస్తానని స్వప్నంలో చెప్పడంతో భ్రమరాంబదేవి భ్రమర (తుమ్మెద)ను అనుకరించింది. అయితే శ్రీశైలం వద్ద ఆగిన భ్రమర సమీపంలోనే భ్రమరాంబ వచ్చి నిలిచింది. అక్కడికి వృద్ధుడి రూపంలో వచ్చిన పరమేశ్వరుడు స్వప్నంలో అగుపించింది తానేనని చెప్పడంతో ముదుసలి వేషంలో ఉన్న శివుడిని వివాహమాడింది. అందుకే శ్రీశైల క్షేత్రంలో వృద్ధ మల్లికార్జున స్వామికి ప్రత్యేక ఆలయం ఉంది. భ్రమరాంబదేవిని మల్లికార్జున స్వామి వరించడంతో కన్నడిగులు ఆమెను తమ ఆడపడుచుగా భావిస్తారు. ప్రతిఏటా శ్రీశైలానికి సారెతో రావడం సంప్రదాయంగా మారింది. ఇందులో భాగంగానే భ్రమరాంబకు సమర్పించేందుకు మిరియాల చూర్ణాన్ని (మిరియాలపట్టు) తీసుకొస్తారు. మహాశివరాత్రి ఉత్సవాల భక్తుల రద్దీతో అమ్మవారికి తలపోటు వస్తుందన్న భావనతో తమ ఆడపడుచుకు ఆ కష్టాన్ని తొలగించాలని మిరియాల పట్టును తీసుకుని వస్తారని ప్రతీతి. శ్రీశైలానికి బయలుదేరే ముందు కన్నడిగులు తమ ఇంట్లో అఖండ జ్యోతిని వెలిగించి వస్తారు. ఈ జ్యోతి మల్లన్న దర్శనం అనంతరం ఇంటికి తిరిగి వెళ్లే వరకు వెలుగుతుందన్న అపార విశ్వాసం వీరిది.

వందలాది కిలోమీటర్ల నుంచి..

కర్ణాటక రాష్ట్రంలోని బైచ్‌వాల్‌, కన్నల్ని, కూడలి, కెంపాలి, సోలాపూర్‌, బాగల్‌కోటా, అత్తిని, బళ్లారి, గుల్బర్గ, ఉగ్లీ, సింధిని, కచునూర్‌, అరికెరి, రాయచూర్‌ వంటి సుదూర ప్రాంతాల నుంచి వందలాది కిలోమీటర్లు కాలినడకన వస్తున్నారు. ఇందుకోసం 15 రోజుల నుంచి నెల ముందు తమ సొంత ప్రాంతాల నుంచి బయలుదేరారు.

కోర్కెల కొండలో..

పెద్దచెరువు, భీముని కొలను ప్రాంతాల మధ్యలో వెలసిన కోర్కెల కొండలో కన్నడిగులు తమ ఆచార సాంప్రదాయలను నేటికీ కొనసాగిస్తున్నారు. తమ మనసులోని కోర్కెలు నెరవేరాలంటూ వృక్షాలకు కాషాయ రంగు వస్త్రంతో ఊయలకట్టి అందులో ఏదైనా వస్తువును ఉంచి నమస్కరిస్తారు. మరికొందరు సొంత నిర్మాణ స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు అక్కడ ఉన్న కొండరాళ్లను ఒకదానిపై ఒకటి అమర్చుతారు.

ఆత్మకూరు నుంచి శ్రీశైలానికి పాదయాత్ర ఇలా..

సుదూర ప్రాంతాల నుంచి కాలినడన వెంకటాపురం గ్రామానికి చేరుకుంటున్నారు. అక్కడ వీలైతే కాసేపు సేదతీరి పంట పొలాల మార్గం గుండా అటవీమార్గంలో ప్రవేశిస్తారు. బైర్లూటి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని, నాగలూటి వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తిప్పలపై నడుస్తూ దాదాపు 16 కిమీ దూరంలో ఉన్న పెచ్చెర్వు గూడేనికి చేరుకుంటారు. ఇక్కడ చాలా మంది కొద్దిసేపు సేద తీరుతారు. అక్కడి నుంచి తిప్పలు, అటవీ మార్గం గుండా 18 కి.మీ. నడిచి భీమునికొలను ప్రాంతానికి చేరుతారు. అక్కడి నుంచి మరో 5 కి.మీ. దూరంలో ఉన్న హఠకేశ్వరం, ఆ తర్వాత 6 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు.

సారెనందించేందుకు వచ్చాను

మా ఆడపడుచైన భ్రమరాంబకు పసుపు, కుంకుమ, గాజులు, వస్ర్తాలతో కూడిన సారెను అందించేందుకు వచ్చాను. పది రోజుల నుంచి 500 కి.మీ. దూరం నడిచాను. మా ఊరి నుంచి చాలామంది శ్రీశైలానికి వస్తున్నారు. మా గ్రామానికి, కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ.. ఏడేళ్లుగా కాలినడకన చేరుకుంటున్నా.        

- సీతవ్వ, అమిగడ్‌ గ్రామం, భాగల్‌కోట్‌ జిల్లా

20 సార్లు కాలినడకన వచ్చాను

మాది కర్ణాటకలోని బీజాపూర్‌ జిల్లా గునికి గ్రామం. పది రోజులుగా 600 కిమీ దూరం నడిచాను. ఇప్పుడు ఆత్మకూరుకు చేరుకున్నాం. ఉగాది మహోత్సవాల కోసం శ్రీశైల క్షేత్రానికి 20 సార్లు పాదయాత్రగా చేరుకున్నా. మల్లికార్జునస్వామి, అమ్మవార్లపై ఉన్న భక్తిభావమే మమ్మల్ని శ్రీశైలానికి నడిపిస్తోంది.

- శిరినేలు వెల్‌దార్‌, గునికి గ్రామం, బీజాపూర్‌ జిల్లా

మల్లన్నపై భక్తే ఇంత దూరం వచ్చేలా చేస్తోంది

శ్రీశైల మల్లన్నపై మాకున్న భక్తే వందల కిమీ దూరాన్ని నడిపించేలా చేస్తోంది. ఇప్పటి వరకు నాలుగేళ్లుగా శ్రీశైలానికి కాలినడకన వచ్చాను. మల్లన్న దయతో నాకు శక్తి ఉన్నంత వరకు శ్రీశైలానికి వస్తాను. నడిచి వెళ్లడం వల్ల మా కుటుంబానికి, గ్రామానికి మంచి జరుగుతుందని నమ్మకం.

- లక్ష్మీదేవి, చింతలకుంట గ్రామం, రాయచూర్‌ జిల్లా

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.