నినదించిన అమరావతి

Dec 8 2021 @ 02:06AM
శ్రీకాళహస్తి మండలంలో రోడ్డుకు ఒకవైపు పాదయాత్రగా వస్తున్న రైతులు

అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో రాజధానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన జగన్‌, అధికారంలోకి రాగానే మడమ తిప్పేశాడు. మాట మార్చేశాడు. అభివృద్ధి ఆశలతో, భవిత బంగారం అవుతుందన్న నమ్మకంతో భూములిచ్చిన రైతుల కలలు భగ్నమయ్యాయి. బంగపడ్డ ప్రజల కన్నీళ్లను ఎగతాళి చేశారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. పచ్చని అమరావతిని ఎడారి చేశారు. న్యాయస్థానం ముందు కడుపు చించుకున్న జనం, ఏడుకొండలస్వామికి నివేదించుకోవడానికి బయలుదేరారు. వెంకన్నని స్మరించుకుంటూ.. దారిలో పలకరించినవారితో తమ దుఃఖం పంచుకుంటూ..నడచుకుంటూ..నదులు, గుట్టలు, అడవులు, పల్లెలు, పట్టణాలు దాటుకుంటూ.. అమరావతి..అమరావతి..అంటూ పలవరిస్తూ 37వ రోజున చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టారు. 


శ్రీకాళహస్తి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రకు జిల్లా సరిహద్దులో మహా స్వాగతం లభించింది. పాదయాత్ర 37వ రోజైన మంగళవారం ఉదయం 10.20 గంటలకు నెల్లూరు జిల్లా సరిహద్దులు దాటి శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద జిల్లాలోకి ప్రవేశించింది.పాదయాత్రకు స్వాగతం పలికేందుకు, మద్దతు ప్రకటించేందుకు జిల్లావ్యాప్తంగా వైసీపీయేతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, సామాన్య జనం పెద్ద ఎత్తున  తరలివచ్చారు. టీడీపీకి సంబంధించి మాజీ మంత్రి అమరనాధరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, తిరుపతి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల కమిటీల అధ్యక్షులు నరసింహ యాదవ్‌, పులివర్తి నాని, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉష,తెలుగుయువత అధ్యక్షుడు రవినాయుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీకాళహస్తి, పుంగనూరు, సత్యవేడు, నగరి ఇంఛార్జులు బొజ్జల సుధీర్‌ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, జేడీ రాజశేఖర్‌, గాలి భానుప్రకాష్‌, చిత్తూరు మాజీ మేయర్‌ కటారి హేమలత, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి,వెంకిటీల సురేంద్రకుమార్‌ తదితరులతో పాటు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాదయాత్రకు స్వాగతం పలికారు. బీజేపీకి సంబంధించి శ్రీకాళహస్తి నేత కోలా ఆనంద్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రకు మద్దతు ప్రకటించడంతో పాటు యాత్రలో పాల్గొన్నారు. మరోవైపు సీపీఎం జిల్లా నేత పుల్లయ్య, జనసేన పార్టీ నేత చక్రధర్‌ నేతృత్వాల్లో ఆయా పార్టీల కార్యకర్తలు వేర్వేరుగా వచ్చి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించి యాత్రలో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రజాసంఘాల తరపున కూడా పలువురు యాత్రకు మద్దతు ప్రకటించి బృందంతో పాటు కలసి నడిచారు.


జాతరను తలపిస్తూ....

జిల్లాలో తొలిరోజు సాగిన మహా పాదయాత్ర జాతరను తలపించింది. శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె నుంచీ పరమేశ్వర కాలనీ, ఇనగలూరు, ఆంజనేయపురం, వాంపల్లి, ఎంపేడు, వినాయకపురం, ఈండ్రపల్లె, పల్లంపేట, పల్లం, పల్లం దళితవాడ, చింతలపాలెం వరకూ పాదయాత్ర కొనసాగింది.ప్రతి గ్రామంలో డప్పులు, డ్రమ్స్‌ వంటి వాయిద్యాలతో, బాణాసంచా పేలుళ్ళ నడుమ జనం స్వాగతం పలికారు. పాదయాత్ర బృందంపైనా, శ్రీవారి రథంపైనా పూలవర్షం కురిపించారు. ప్రత్యేకించి మహిళలు సాంప్రదాయానుసారం పళ్ళేల్లో పూలు, పండ్లు, పసుపు కుంకుమలతో వచ్చి శ్రీవారి రధానికి పూజలు చేశారు. హారతులు పట్టి  కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. కొన్ని చోట్ల శ్రీవారి రధానికి ముందు బిందెలతో నీళ్ళుతెచ్చి రోడ్డంతా శుభ్రం చేసి స్వాగతం పలికారు. దేవుడి రధంతో పాటు పాదయాత్ర బృందంపై కూడా పూలు చల్లారు. ఈ సందడికి తోడు టీడీపీ, బీజేపీ, సీపీఎం, జనసేన పార్టీల శ్రేణులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి పాదయాత్రకు ముందు వెళ్ళగా... వెనుక శ్రీవారి రధం, ఆపై అమరావతి మహిళా జేఏసీ సభ్యులు, చివరగా రైతులు పాదయాత్ర సాగించారు. దీనికి తోడు ఆయాచోట్ల గ్రామస్తులు కూడా కొంతదూరం వంతున మద్దతుగా పాదయాత్రలో పాల్గొనడం వెంకటగిరి-ఏర్పేడు ప్రధాన రహదారిపై మహా జనప్రవాహాన్ని సృష్టించింది.


శ్రీవారి రథానికి మహిళా సారఽథులు

పాదయాత్రలో భాగంగా శ్రీవారి రఽథానికి మహిళలు సారఽథులుగా వ్యవహరించడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ కన్వీనర్‌ రాయపాటి శైలజ శ్రీవారి రథానికి అమర్చిన ట్రాక్టర్‌ నడపడం అందరినీ ఉత్సాహపరిచింది. ఆమె కొంత దూరం వాహనం నడపగా మరికొంత దూరం అదే బృందంలోని మరో మహిళ నడపడం కనిపించింది. కాగా మార్గమధ్యంలో మాజీమంత్రి అమరనాధరెడ్డి సైతం కొంత దూరం పాటు రథానికి అమర్చిన ట్రాక్టర్‌ నడిపి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.


తొలిరోజు 12 కిలోమీటర్లు సాగిన యాత్ర

అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్ర ఉదయం 10.20 గంటలకు జగ్గరాజుపల్లె వద్ద జిల్లాలో ప్రవేశించింది. సాయంత్రం 5.56 గంటలకు ఏర్పేడు మండలం చింతలపాలెంలో ముగిసింది.నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచీ చింతలపాలెం వరకూ మొత్తంగా 16 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర జిల్లా వరకూ చూస్తే జగ్గరాజుపల్లె నుంచీ చింతలపాలెం వరకూ 12కిలోమీటర్లు సాగింది.మహా పాదయాత్ర బృందం మధ్యాహ్న భోజనం చేయడానికి శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామం వద్ద వెంకటగిరి-ఏర్పేడు ప్రధాన రహదారి పక్కనే తొలుత ఏర్పాట్లు చేశారు. గ్రామానికి చెందిన ఒకరు తమ భూమిని వాడుకునేందుకు అనుమతించి, డోజర్‌ పెట్టి చదును కూడా చేయించారు. అయితే ఆ భూమిని గుర్తు తెలియని వ్యక్తులు దున్నేయడంతో పాదయాత్ర బృందం మకాం వేయడానికి వీలు కాకుండా పోయింది. దీంతో రోడ్డుకు అర కిలోమీటరు దూరంగా ఒకరు తమ భూమిని కేటాయించడంతో అక్కడ మకాం వేసి మధ్యాహ్న భోజనం ముగించారు. దీనివల్ల పాదయాత్ర బృందం కొంత అసౌకర్యానికి గురైంది. మరోవైపు పాదయాత్ర బృందం భోజనం చేయడానికి భూమిచ్చిన యజమానిని ఓ పోలీసు అధికారి పలుమార్లు అక్కడికి వచ్చి ప్రశ్నలతో వేధించినట్టు తెలిసింది. అసలు ఈ భూమి మీదేనా అంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతి రావు భూమి యజమానిని ఊరడించారు. పోలీసు వేధింపులను ఎదుర్కొని కూడా తాము భోజనం చేయడానికి తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.మహా పాదయాత్ర బుధవారం చింతలపాలెం నుంచీ పంగూరు మీదుగా శ్రీకాళహస్తికి చేరనుంది. ఉదయం 9 గంటలకు యాత్ర మొదలుపెట్టి సాయంత్రానికి శ్రీకాళహస్తి పట్టణ శివార్లకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా మధ్యాహ్నం మార్గమధ్యంలోని విష్ణు కెమికల్స్‌ ఫ్యాక్టరీ సమీపంలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

స్వాగతం పలుకుతున్న టీడీపీ నాయకులు,ప్రజలుFollow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.