ప్రధాని కోసం... గరిటె తిప్పుతా..

ABN , First Publish Date - 2022-06-30T09:41:07+05:30 IST

‘‘తిండి కోసం తిప్పలు పడ్డ రోజుల నుంచి బయటపడి... నా చేతుల మీదుగా వేల మందికి వండి వడ్డించడం ఎంతో సంతోషంగా ఉంది.

ప్రధాని కోసం... గరిటె తిప్పుతా..

ప్రమాదవశాత్తూ భర్తను పోగొట్టుకొని... అత్తింటి ఆరళ్లు తట్టుకోలేక మూడు నెలల పసిబిడ్డతో

వీధిన పడ్డారు గూళ్ల యాదమ్మ. ఊరుకాని ఊర్లో పదిహేను రూపాయల కూలీతో కొత్త జీవితం ప్రారంభించిన ఆమె... వంటలు చేయడంలో నిష్ణాతురాలయ్యారు.‘తెలంగాణ వంటలు’ అనగానే తన పేరు గుర్తొచ్చే స్థాయికి ఎదిగారు.హైదరాబాద్‌లో ఈ వారాంతంలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో...ప్రధానమంత్రి మోదీకి, ఇతర అగ్రనేతలకు తన చేతి వంటను రుచి చూపించబోతున్న యాదమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘నవ్య’తో పంచుకున్నారు.


‘తిండి కోసం తిప్పలు పడ్డ రోజుల నుంచి బయటపడి... నా చేతుల మీదుగా వేల మందికి వండి వడ్డించడం ఎంతో సంతోషంగా ఉంది. నా కష్టాలే నాకు అన్నీ నేర్పించాయి. బతకడం కోసం వాటిని సవాలుగా తీసుకున్నాను. అదే నన్ను నిలబెట్టింది. ఇవాళ నా కుటుంబంతో పాటు మరో వంద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాను. 


అంతా తల్లకిందులైంది...

నాకు చిన్న వయసులో పెళ్లయ్యింది. నా భర్త చంద్రయ్యది హుస్నాబాద్‌ మండలం కొండాపూర్‌ గ్రామం. కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అలా సాగిపోతున్న మా కుటుంబం మీద విధి క్రూరంగా విరుచుకుపడింది. వ్యవసాయ బావుల్లో పూడిక తీయడానికి వెళ్లిన నా భర్త... మట్టి పెళ్లలు కూలి మీదపడి, ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఒక్కసారిగా అంతా తల్లకిందులయింది.. భర్త ఆకాల మరణంతో ఆవేదనలో ఉన్న నాకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. పరిస్థితిని తట్టుకోలేకపోయాను. ఊరిలో ఉండలేక మూడు నెలల బిడ్డను తీసుకొని బతుకుతెరువుకోసం కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నాను. 


20 వేల మందికైనా...

పరిచయస్తుల సహకారంతో ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో ఆయాగా కొన్నాళ్లు పని చేశాను. అలాగే సంపన్నులు, రాజకీయ నేతల ఇళ్లలో వంటలు చేసేదాన్ని. ఆ తరువాత వెంకన్న అనే వంట మాస్టర్‌ దగ్గర సహాయకురాలిగా చేరాను. ఇది ముప్ఫై ఏళ్ల క్రితం మాట. అప్పట్లో నాకు రోజుకు 15 రూపాయల కూలీ ఇచ్చేవారు. ఎంత పెద్ద వంటయినా చేసే నైపుణ్యం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అనంతరం స్వయంగా మహిళలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని... వంట పనులు చేసేదాన్ని. మొదట్లో వందల మంది హాజరయ్యే ఫంక్షన్లకు చేసేదాన్ని. ఇప్పుడు ఇరవై వేలమందికి కూడా వంట చేసే స్థాయికి చేరుకున్నాను. నా సహాయకులకు రోజూ రూ. 20 వేలకు పైగా చెల్లింపులు చేస్తున్నాను. నా దగ్గర పని చేసిన వారిలో సుమారు ఇరవై మంది మహిళలు... స్వయంగా వంటలు, క్యాటరింగ్‌ చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జీవితాల్లో స్థిరపడ్డారు. అలాగే... హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు... క్యాటరింగ్‌ బాయ్స్‌గా... పార్ట్‌ టైమ్‌ ఉపాధి కల్పిస్తున్నాను. వంట పనులు ఉన్న రోజుల్లో వందమంది వరకూ నా దగ్గర పని చేస్తారు. ఫంక్షన్‌ స్థాయిని బట్టి వారికి రోజుకు రూ. 500 నుంచి రూ. 2 వేల వరకూ చెల్తిస్తాను. సీజన్‌లో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట వంట చేస్తూనే ఉంటాను. అన్‌ సీజన్‌లో కూడా వారానికి రెండు కార్యక్రమాలైనా ఉంటాయి.


విదేశాలకు కూడా...

కట్టుబట్టలతో కరీంనగర్‌లో అడుగుపెట్టినప్పుడు... నా కన్నీరు తుడిచేవారు లేరు. కష్టాలను గుండె ధైర్యంతో ఎదుర్కొన్నాను. ఇప్పుడు కరీంనగర్‌ జిల్లాలో వివాహాది శుభకార్యాలు, దేవాలయాల్లో పూజలు, రాజకీయ సభలు, సమావేశాలు... ఇలా వేటిలోనైనా... వేలాది మందికి వండి వడ్డించాలంటే నా పేరే గుర్తొస్తుందని అందరూ అంటూ ఉంటే ఆనందంగా ఉంటోంది. సొంత ఇల్లు కట్టుకున్నాను. నా ఒక్కగానొక్క కొడుకు వెంకటేశ్‌ను ఎంబిఎ చదివించి ప్రయోజకుణ్ణి చేశాను. నేను వంటలు చేస్తుంటే... మా అబ్బాయి లెక్కలు రాయడం, క్యాటరింగ్‌ ఆర్డర్లు తీసుకోవడం లాంటి పనులతో నాకు సహకరిస్తున్నాడు. వెజ్‌, నాన్‌ వెజ్‌ సుమారు నలభై రకాల వంటలు చేస్తాను. నేను చేసే పప్పులకు మంచి పేరుంది. అందరూ గంగవాయిలి కూర- మామిడికాయ పప్పును, పుంటి కూర పప్పును బాగా ఇష్టపడతారు. విదేశాలకు వెళ్లేవారు నాన్‌ వెజ్‌ పచ్చళ్లు నా దగ్గర చేయించుకొని వెళ్తారు. కరీంనగర్‌లో నేను నిలదొక్కుకోవడానికి ఎంపీ బండి సంజయ్‌ గారు మొదటినుంచీ సహకరిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ జాతీయ సమావేశాల్లో... గరిటె తిప్పి... సాక్షాత్తూ ప్రధానమంత్రికి నా వంటలు రుచి చూపించే అవకాశాన్ని కలిగించారు. ఇది నా జీవితంలో మరచిపోలేని అదృష్టం.’’


నగునూరి శేఖర్‌, కరీంనగర్‌.

ఫొటోలు: సింహాచలం రవి


వెజ్‌, నాన్‌ వెజ్‌ సుమారు నలభై రకాల వంటలు చేస్తాను. నేను చేసే పప్పులకు మంచి పేరుంది. అందరూ గంగవాయిలి కూర- మామిడికాయ పప్పును, పుంటి కూర పప్పును బాగా ఇష్టపడతారు. విదేశాలకు వెళ్లేవారు నాన్‌ వెజ్‌ పచ్చళ్లు నా దగ్గర చేయించుకొని వెళ్తారు.

Updated Date - 2022-06-30T09:41:07+05:30 IST