పాలకులకు ఈ దొంగబుద్ధులెందుకు?

ABN , First Publish Date - 2021-08-01T05:59:07+05:30 IST

గ్రీకుపురాణాల్లో కనబడే రెక్కల గుర్రం పేరు పెగాసస్. ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ తాము తయారుచేసిన స్పైవేర్‌కు పెగాసస్ అనే పేరు పెట్టాలని ఎందుకు నిర్ణయించిందో మనకు తెలియదు....

పాలకులకు ఈ దొంగబుద్ధులెందుకు?

గ్రీకుపురాణాల్లో కనబడే రెక్కల గుర్రం పేరు పెగాసస్. ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ తాము తయారుచేసిన స్పైవేర్‌కు పెగాసస్ అనే పేరు పెట్టాలని ఎందుకు నిర్ణయించిందో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఆ రెక్కల గుర్రం కనబడకుండా, వినబడకుండా మన ఫోన్‌లోకి నిశ్శబ్దంగా జొరబడుతుంది. మన జీవితంలో మరుగు అనేది లేకుండా చేస్తుంది. ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న బీజెపి సర్కారు పనితీరును నిష్పాక్షికంగా విశ్లేషిస్తున్న మీడియా ప్రముఖులు, రాజకీయ ప్రత్యర్థులు, హక్కుల కార్యకర్తలు, ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర సంస్థల అధికారులు.. ఇంకా చాలా రంగాలకు చెందిన వ్యక్తులపై పెగాసస్ నిఘా ప్రయోగం జరిగింది. 


ఈ వ్యవహారంపై విచారణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇండియాలో చట్ట విరుద్ధమైన నిఘా సాధ్యం కాదు అని చెప్పి తప్పించుకునేందుకు చూస్తున్నది. ఇండియా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా ప్రభుత్వం దీనిని అభివర్ణిస్తున్నది. 


నిజానికి 2019లోనే ఒకసారి ఈ పెగాసస్ నిఘా గురించి ఇండియాలోని కొందరు జర్నలిస్టులనూ, హక్కుల కార్యకర్తలనూ, న్యాయవాదులనూ వాట్సాప్ హెచ్చరించింది. వారిలో ఎక్కువమంది భీమా కోరేగావ్ కేసుతో సంబంధం ఉన్నవారు. కెనడాకు చెందిన సిటిజెన్ ల్యాబ్ ఈ నిఘా దాడిని కనిపెట్టింది. దరిమిలా తమ మెసేజింగ్ యాప్‌లోని వీడియో కాల్ ఫీచర్‌లో ఉన్న చిన్న లొసుగును ఆసరాగా చేసుకుని ఫోన్లలో చొరబడే విధంగా స్పైవేర్ రూపొందించారంటూ పెగాసస్ తయారీ సంస్థ ఎన్ఎస్ఓపై వాట్సాప్ శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో కేసు కూడా వేసింది. 


పెగాసస్ అనేది జీరో క్లిక్ స్పైవేర్. సైబర్ నిఘా అనగానే సాధారణంగా టార్గెట్‌కు ఒక మెసేజో, ఒక మెయిలో, ఒక ఫోన్ కాలో వస్తుంది. టార్గెట్ దానికి స్పందించగానే వైరస్ జొరబడి నిఘా మొదలుపెడుతుంది. కాని క్రమేణా ఈ పద్ధతులకు సంబంధించిన అవగాహన, జాగ్రత్తలు పెరిగాయి. దానితో పెగాసస్ లాంటి జీరో క్లిక్ స్పైవేర్ తయారయింది. ఇందులో టార్గెట్‌గా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేమీ ఉండదు. ఒక ఫోన్‌పై పెగాసస్‌ను ప్రయోగించినట్లు టార్గెట్‌కి తెలిసే అవకాశం ఏమాత్రం లేదు. వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లోని ఏదో ఒక లొసుగును ఆసరాగా చేసుకుని ఈ స్పైవేర్ టార్గెట్ ఫోన్‌లోకి నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది. అంతే అక్కడ నుంచి ఆ ఫోన్ రిమోట్‌గా మరొకరి కంట్రోల్‌లో కూడా పని చేయడం మొదలుపెడుతుంది. ఫోన్ సంభాషణలు, డేటా.. సమస్తం మరొకరికి రియల్ టైమ్‌లో అందుతుంటాయి. అంతే కాదు. ఫోన్ సొంతదారుడికి తెలియకుండా ఫోన్ కెమేరా, వాయిస్ రికార్డర్ వంటివి పని చేయడం మొదలుపెడతాయి కూడా. 


జర్నలిస్టులపై, విమర్శకులపై, నిజాయితీపరులైన అధికారులపై రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి పద్ధతుల్లో నిఘా పెట్టి సంపాదించిన సమాచారం ఎందుకు ఉపయోగపడుతుందో, ఎలా ఉపయోగిస్తారో ఊహించడం కష్టం కాదు. తమ ప్రత్యర్థుల కదలికలు, ఎత్తుగడలు ముందుగానే తెలుసుకుని దానికి తగినట్లు వ్యూహాలు రూపొందించుకోవచ్చు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితంలోని రహస్యాలు తెలుస్తాయి కాబట్టి వాటితో వారిని బ్లాక్‌మెయిల్ చేయవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వం కింద పని చేసే దర్యాప్తుసంస్థలు ఇలాంటి పద్ధతుల్లో నిఘా పెడుతున్నాయన్న మాట వినడానికే కంపరంగా ఉంటుంది. 2019లో కర్నాటకలో జనతాదళ్– కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన సమయంలో అక్కడ కొందరు కీలకమైన వ్యక్తుల ఫోన్లపై పెగాసస్ ప్రయోగించినట్లు తెలిసింది. 2019 ఎన్నికల ప్రచారంలో మోదీ ఎన్నికల నియమావళని ఉల్లంఘించారన్న అభియోగాలపై ఆయనకు క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన భారత ఎన్నికల సంఘం సభ్యుడు అశోక్ లావాసా ఫోన్ నంబర్, అప్పటి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ బంధువుల ఫోన్ నంబర్లు కూడా పెగాసస్ జాబితాలో ఉన్నాయి. దీనిని బట్టి పెగాసస్ నిఘాను ఎలాంటి కార్యకలాపాలకు వినియోగిస్తున్నదీ మనం అర్థం చేసుకోవచ్చు. 


పెగాసస్ ప్రధానంగా వాట్సాప్ వంటి మేసేజింగ్ యాప్ ద్వారా ఫోన్‌లోకి దొంగచాటుగా చొరబడుతుంది. నిజానికి ఆ చొరబాటే చట్టవిరుద్ధమైనది. ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడం వంటి లక్ష్య సాధనకైనా గానీ ప్రజాస్వామిక ప్రభుత్వాలు చట్ట విరుద్ధంగా వ్యవహరించడానికి వీలు లేదు. తీవ్రవాదులు తుపాకులు పట్టుకున్నారన్న కారణంగా రాజ్యం వారిని కాల్చి చంపడాన్ని చట్టం అనుమతించదు. నిఘా అయినా అంతే. జాతీయ భద్రత దృష్ట్యా ఎవరి మీదయినా నిఘా పెట్టాల్సివస్తే చట్టప్రకారమే ఆ పని చేసేందుకు అవకాశం ఉంది. చట్టబద్ధమైన ఫోన్ ట్యాపింగ్‌కు వీలుంది. వాట్సాప్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లలో సమాచారం కావాల్సి వస్తే నేరుగా వాటినే సమాచారం అందించాల్సిందిగా కోరవచ్చు. ప్రభుత్వం చట్టబద్ధంగా కోరిన పక్షంలో వాట్సాప్ వంటి సంస్థలు కాదనేందుకు వీలు లేదు. అలా చేయకుండా పెగాసస్ వంటి స్పైవేర్‌ను ఉపయోగించడం ప్రజాస్వామిక సమాజాలలో తగని పని. నియంతల పాలనలో కునారిల్లుతున్న సమాజాలలో కనబడే ఇలాంటి పోకడలు చట్టబద్ధ పాలనకు విరుద్ధం. రూల్ ఆఫ్ లాను గౌరవించాల్సిన బాధ్యత ప్రజల కన్నా ముందు ప్రభుత్వంపైనే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి దొంగ పనులు చేయకుండా ప్రభుత్వాలను నియంత్రించకపోతే జార్జ్ ఆర్వెల్ తన 1984 నవలలో చిత్రించిన బిగ్ బ్రదర్ స్టేట్ ఎంతో దూరంలో ఉండదు. 

ఆలపాటి సురేశ్ కుమార్

సీనియర్ జర్నలిస్టు

Updated Date - 2021-08-01T05:59:07+05:30 IST