అయిన వారికి..!

ABN , First Publish Date - 2021-07-20T05:34:31+05:30 IST

నామినేటెడ్‌ పదవుల్లో భాగంగా శ్రీశైల దేవస్థానం పాలక మండలికి కొత్త చైర్మన్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

అయిన వారికి..!

  1. నిబంధనలకు విరుద్ధంగా ‘శ్రీశైలం’ చైర్మన్‌ పదవి
  2. వ్యూహాత్మకంగానే 15వ పాలక మండలి రద్దు 
  3. కోర్టు ఉత్తర్వులూ బుట్టదాఖలు


కర్నూలు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్‌ పదవుల్లో భాగంగా శ్రీశైల దేవస్థానం పాలక మండలికి కొత్త చైర్మన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆలయ 16వ పాలక మండలి ఏర్పాటైంది. చైర్మన్‌గా చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డిని నియమించారు. ఇందుకు సంబంధించి రెండేళ్ల నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందున్న పాలక మండలిని వైసీపీ అధికారంలోకి రాగానే రద్దు చేసింది. దీంతో అప్పట్లో పాలక మండలి కోర్టును ఆశ్రయించింది. పాలక మండలిని యథాతథంగా కొనసాగించాలంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయం తెలియజేస్తూ అప్పటి ఈవో శ్రీరామచంద్రమూర్తి దేవదాయశాఖకు లేఖ రాశారు. అయితే అటునుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో శ్రీశైల దేవస్థానం అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోయారు. ఇదిలా ఉండగానే పాత పాలక మండలి గడువు 2021 ఫిబ్రవరిలో ముగిసింది. కేవలం పాలక మండలిని తమ వారికి కట్టబెట్టేందుకే ప్రభుత్వం 15వ పాలక మండలి పట్ల ఇలా వ్యవహరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఇదీ జరిగింది


టీడీపీ హయాంలో 2019 ఫిబ్రవరి 10న వంగాల శివరామిరెడ్డి చైర్మన్‌గా 15వ పాలక మండలి ఏర్పాటైంది. ఆ తర్వాత మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో బోర్డు సమావేశాలను ఏర్పాటు చేసుకోలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం రాగానే 2019 ఆగస్టులో పాలక మండలిని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయమై పాలక మండలి సభ్యుడు శివశంకర్‌ హైకోర్టుకెళ్లారు. పాలక మండలి రద్దు నిబంధనలకు విరుద్ధమని, పాలక మండలి రద్దుకు, కోర్టు ఉత్తర్వుల నాటికి పాలక మండలి సమయంమూడు నెలలు వృథా అయిందని, ఆ సమయాన్ని కూడా పాలక మండలి ఉపయోగించుకునేలా చూడాలని కోరారు. దీనిపై కోర్టు పాలక మండలిని కొనసాగించాలని దేవదాయశాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆశాఖ కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదు. అంతేగాకుండా సమావేశాలు నిర్వహించుకోవడం గానీ, దేవస్థానానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి గానీ పాలక మండలికి దేవస్థానం అధికారులు సహకరించలేదు. దర్శనాల్లో తప్ప మిగతా విషయాల్లో ప్రొటోకాల్‌ను పాటించలేమంటూ దేవస్థాన అధికారులు పాలక మండలికి సహకరించడం మానేశారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి. దేవదాయశాఖ, దేవస్థానం కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, దీనిపై మరోసారి కలుగజేసుకోవాలని పాలక మండలి సభ్యులు కోర్టును కోరారు. కోర్టు స్పందించేలోపు 15వ పాలక మండలి గడువు ముగిసిపోయింది. కొత్తది ఏర్పాటైంది. అసలు పాలక మండలిని రద్దు చేయడమేగాక కోర్టు తీర్పును కూడా పరిగణలోకి తీసుకోకపోవడం జగన్‌కే చెల్లిందని, తమకు ఇష్టం లేని వారి పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమనే విమర్శలు వినిపిస్తున్నాయి.


నిబంధనలు ఏమయ్యాయి? 


ఇప్పటి వరకు శ్రీశైలం దేవస్థానానికి 15 పాలక మండళ్లు ఏర్పాటయ్యాయి. ఇందులో తొమ్మిది సార్లు కర్నూలుకు చెందిన వారు చైర్మన్లుగా ఎంపికయ్యారు. నాలుగు సార్లు అనంతపురం, ప్రకాశం, నెల్లూరుకు చెందిన వారు ఒక్కో పర్యాయం చైర్మన్‌ పదవిని చేపట్టారు. ప్రస్తుతం 16వ పాలక మండలి చైర్మన్‌గా చిత్తూరుకు చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి నియమితులయ్యారు. అయితే ప్రస్తుత చైర్మన్‌ను నియమించడానికి ముందు పాలక మండలి విషయంలో చాలా కథే నడిచినట్లు తెలుస్తోంది. పాలక మండలి చైర్మన్‌ పదవి కోసం బ్రాహ్మణ, వీరశైవ సామాజిక వర్గాలకు చెందిన చెరుకుచెర్ల రఘురామయ్య, వీరుపాక్షయ్య స్వామి తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. కానీ ప్రభుత్వాధినేత తన సామాజిక వర్గానికి చెందిన వారికే ఈ పదవి కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లుంది. బైరెడ్డి సిద్ధార్థను చైర్మన్‌గా నియమించాలని వైసీపీ అధినాయకత్వం చూసినా.. ఆయన వద్దనడంతో వేరే వారి పేర్లు ముందుకు వచ్చాయి. పార్టీల పరంగా అయితే సరేగాని, ఇలా కులాల పరంగా చైర్మన్‌ పదవిని కట్టబెట్టడమేమిటన్న అసంతృప్తితో చైర్మన్‌ పదవికి పోటీ పడ్డ ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలు విరమించుకున్నట్లు సమాచారం. ఇక పాలక మండలి చైర్మన్‌ ఎంపికలో విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన పాలక మండలిని ఏర్పాటు చేయడానికి పది పదిహేను రోజుల ముందు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని శ్రీశైలం దేవస్థానం, దేవదాయశాఖ, ప్రభుత్వం కలిసి ఎంపిక చేయాలి. అయితే నూతన పాలక మండలి విషయంలో ఇవేమీ పాటించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాకు చెందిన వారినే చైర్మన్‌గా నియమిస్తే ఆయా సామాజిక వర్గాల వారి నుంచి వ్యతిరేకత వస్తుందని పక్క జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టారని పలువురు విమర్శిస్తున్నారు.

Updated Date - 2021-07-20T05:34:31+05:30 IST