యూపీ ఎన్నికల కోసమే సాగు చట్టాల రద్దు: ప్రతిపక్షాలు

ABN , First Publish Date - 2021-11-19T21:39:57+05:30 IST

వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటించారని..

యూపీ ఎన్నికల కోసమే సాగు చట్టాల రద్దు: ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని ప్రకటించారని విమర్శలు గుప్పించారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతు ఆందోళనపై ఎప్పుడూ ఒక్కమాటైనా మాట్లాడని ప్రధానమంత్రి, ఉన్నపళంగా వచ్చి సాగు చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం వెనుక ఎన్నికల భయమే ఉందని ప్రతిపక్షాలు అన్నాయి. ప్రధాని ఇప్పుడు క్షమాపణలు చెప్పినా, తప్పుల్ని ఒప్పుకున్నా ప్రజలు ఆయనను నమ్మరని విమర్శించారు.


కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ‘‘రైతు ఆందోళనలో సుమారు 600 మంది రైతులు చనిపోయారు. ప్రధాని ఒక్కసారి కూడా వారి గురించి మాట్లాడలేదు. ఏడాది కాలంగా దేశ రాజధాని సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను ఏనాడూ పలకరించలేదు. రైతులను ఉగ్రవాదులను, దేశద్రోహులని ఆ పార్టీకి చెందిన నేతలు అనేక నిందలు వేశారు. వీటిపై కూడా ప్రధాని మాట్లాడలేదు. లఖీంపూర్‌లో కేంద్ర మంత్రి కుమారుడు రైతుల్ని తొక్కి చంపారు. ఆ మంత్రి ఇంకా మోదీ క్యాబినెట్‌లోనే ఉన్నారు. వీటి గురించి ఎప్పుడూ ఒక్కమాట మాట్లాడని ప్రధాని, ఉన్నపళంగా వచ్చి రద్దు చేస్తున్నామని క్షమాపణలు చెప్పడం వెనుక ఎన్నికల దురాశ ఉంది’’ అని అన్నారు.


ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ‘‘క్షమాపణలు చెప్పి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని మోదీ నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు. కానీ ప్రజలకు తెలుసు. లఖింపూర్‌లో రైతులను ఎలా చంపారో ప్రజలకు గుర్తుంది. ఇప్పుడు ఓట్ల కోసం చట్టాలను రద్దు చేస్తే ఎవరూ నమ్మరు. ఈ ఎన్నికల్లో బీజేపీని రైతులు తమ ఓట్లతో కడిగిపారేస్తారు’’ అని అన్నారు.

Updated Date - 2021-11-19T21:39:57+05:30 IST