ఎవరి కోసమో!

May 8 2021 @ 23:25PM
చెరువు గర్భంలో నిర్మిస్తున్న కల్వర్టు

చెరువులో కల్వర్టు 

ఉపాధి హామీ నిధులతో నిర్మాణం

 పూసపాటిరేగ, మే 8: అక్కడ చెరువు గర్భంలో ఉపాధి హామీ పథకం నిధులతో కల్వర్టు నిర్మాణం జరుగుతోంది. రెవెన్యూ పరిధి వేరైనా చెరువు ఒక్కటే. కొన్నేళ్లుగా లేని కల్వర్టు అవసరం ఇప్పుడే ఎందుకు వచ్చిందో స్థానికులకు అంతుబట్టడం లేదు. చెరువు గట్టును రోడ్డులా నిర్మించి... ప్రధాన రహదారి నుంచి చెరువు గట్టు గుండా వెళ్లేందుకు కల్వర్టు నిర్మాణం చేపడుతున్నారు. చెరువుకు ఒకవైపు అధికార పార్టీకి చెందిన నాయకుల భూములు ఉన్నాయి. వాటికి ధరలు పెంచుకొనేందుకే ఈ పనులు చేపడుతున్నారని, ఇందుకు అధికారులు సహకారం అందజేస్తున్నారన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. పూసపాటిరేగ మండలంలోని కోనాడ, నడిపల్లి రెవెన్యూ పరిధిలోని అనంతసాగరంలో కొద్దిరోజులుగా ఈ తంతు జరుగుతోంది. 

ఇదీ పరిస్థితి

చెరువులో ఇటీవల ఉపాధి హామీ పనులు జరిగాయి. ఇందులో భాగంగా చెరువు గట్టును వెడల్పు చేయించారు. అనంతరం దీనిని యంత్రాల సాయంతో మరింత వెడల్పు చేశారు. అంతటితో సరిపెట్టకుండా కోనాడ వెళ్లే ప్రధాన రహదారి నుంచి ఆ గట్టుకు వచ్చేందుకు చెరువుగర్భంలో ఉపాధి హామీ నిధులతో కల్వర్టు నిర్మాణం చేపట్టారు. ఈపనులను త్వరితగతిన పూర్తిచేస్తున్నారు. కొన్నేళ్లుగా లేని కల్వర్టు అవసరం ఇప్పుడే ఎందుకు వచ్చిందో స్థానికులకు అంతుబట్టడం లేదు. పెద్ద వర్షాలు కురిస్తే నీరు కింది చెరువు భాగానికి వెళ్లకుండా పంటపొలాల మీదకి వచ్చే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అసలు పూర్వం నుంచి ఉన్న చెరువు నిర్మాణాన్ని మార్చేందుకు ఏ అధికారి అనుమతులు ఇచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. చెరువు వెనుక భాగంలో స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకునికి పొలాలు ఉన్నాయి.  వాటికి చేరుకునేందుకే ఈ తతంగం అంతా అధికారులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఎంపీడీవో వెంకటేశ్వరరావుకి ఫిర్యాదు చేశారు. ఎటువంటి చర్యలు లేకపోగా   పనులు వేగంగా జరిగిపోతున్నాయి. 

రైతులకు ఇబ్బందే

చెరువు గర్భంలో ఈవిధంగా ఎవరి స్వప్రయోజనాలకోసమో కల్వర్టు నిర్మిస్తే భవిష్యత్‌లో వర్షాలు కురిసి చెరువులోకి నీరు చేరినప్పుడు ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనిపై ఇప్పటికే మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ కల్వర్టు నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకొని నిర్మాణాన్ని నిలిపివేయాలి.

                      - కంబపు అప్పలరెడ్డి, కోనాడ.


అవతలి రైతుల కోసమే

చెరువును ఆనుకొని వెనుకవైపు ఉన్న రైతుల భూముల కోసం ఈ పనులు చేపట్టాం. గ్రామసభ ఆమోదం ద్వారా ఈ పనులు నిర్వహిస్తున్నాం. వర్షాకాలంలో చెరువు నిండేటప్పుడు రైతులు అవతలి వైపునకు వెళ్లేందుకు కల్వర్టు ఉపయోగపడుతుంది. 

- కనకరాజు, ఏపీవో.



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.