మహిళల చేత మహిళల కోసం...

Published: Thu, 10 Mar 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మహిళల చేత  మహిళల కోసం...

అక్కడ పరిశ్రమల అధిపతులు... అందులో భాగస్వాములు... మహిళలే! పెట్టుబడి పెట్టేదీ... నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించేదీ... వారే. శ్రమశక్తిని నమ్ముకుని... స్వేదాన్ని చిందిస్తున్న స్త్రీశక్తిని ఒకచోట చేర్చింది... ‘ఎఫ్‌ఎల్‌ఓ- ఇండస్ర్టియల్‌ పార్క్‌’. దేశంలోనే మొట్టమొదటిసారిగా వంద శాతం మహిళలే యజమానులుగా నెలకొల్పిన ఈ పారిశ్రామిక వాడకు ఓ రూపం తెచ్చింది కూడా వనితలే. వారిలో కీలక పాత్రధారులైన జ్యోత్స్న అంగారా, అజితా యోగేష్‌లను ‘నవ్య’ పలుకరించింది... ‘‘మహిళా సాధికారతకు అహర్నిశలూ కృషి చేస్తున్న సంస్థ ‘ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌’ (ఎఫ్‌ఎల్‌ఓ). దీనికి మేం గతంలో చైర్‌పర్సన్లుగా వ్యవహరించాం. సంస్థలో ఇన్నేళ్ల మా ప్రయాణం... స్త్రీల సమస్యలు, వారి ఆకాంక్షలు అర్థం చేసుకోవడానికి దోహదపడింది. ‘ఎఫ్‌ఎల్‌ఓ’ హైదరాబాద్‌ చాప్టర్‌లో ఎనిమిది వందల మంది సభ్యులున్నారు. వారిలో చాలామంది పారిశ్రామిక రంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివారిని గుర్తించి, చేయూతనిచ్చి, ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ఇలాంటి ఔత్సాహిక మహిళలందరికీ ఒక వేదిక ఉండాలనుకున్నాం. దానికి రూపమే హైదరాబాద్‌లో నెలకొల్పిన ‘ఇండస్ర్టియల్‌ పార్క్‌’. ప్రభుత్వ భాగస్వామ్యంతో, అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు అధికారికంగా ఈ పార్కు ప్రారంభమైంది. కానీ దీని వెనక ఎన్నో ఏళ్ల మా ప్రయత్నం ఉంది. మా ఇద్దరితో పాటు ‘ఎఫ్‌ఎల్‌ఓ’ కీలక సభ్యులైన వాణి సుభాష్‌, కవితాదత్‌ చిత్తూరి కూడా ఈ ప్రయత్నంలో భాగమయ్యారు. 


లక్ష్యం అదే...  

‘ఇండస్ర్టియల్‌ పార్క్‌’ ప్రధాన ఉద్దేశం తయారీ రంగంలో మహిళలను భాగస్వాములను చేయడం. తద్వారా పెట్టుబడులు వస్తాయి. పరిశ్రమలు పెరిగి, ఉపాధి కల్పన మెరుగవుతుంది. ఫలితంగా భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్న జీడీపీ వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, మా సభ్యుల ఆకాంక్షను నెరవేర్చే దిశగా అడుగులు వేశాం. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రతించాం. పారిశ్రామిక వాడ కోసం స్థలం ఇవ్వాలని, దానివల్ల మహిళలు మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్స్‌ పెట్టుకొనే వీలుంటుందని విన్నవించాం. ప్రభుత్వం వెంటనే స్పందించి సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాల భూమి కేటాయించింది. 


25 యూనిట్లు... 

భూమి చేతికొచ్చింది. ఇక మిగిలింది పరిశ్రమలకు అనుమతులు, పార్కులో మౌలిక వసతుల కల్పన, యూనిట్‌ల కోసం నిర్మాణాలు. ఒక్కొక్కటీ చేసుకొంటూ వచ్చాం. వీటన్నిటికీ ఇన్నేళ్ల సమయం పట్టింది. అయితే ఇప్పటికే ఐదు యూనిట్లు పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించాయి. మరో పది పదిహేను నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి 25 యూనిట్లు సిద్ధమవుతాయని భావిస్తున్నాం. వీటన్నిటి యజమానులు, భాగస్వాములు మహిళలే. పనిచేసేవారిలో కూడా కనీసం 60 శాతం మహిళలు ఉంటారు. హెవీ వర్క్‌ మహిళలకు కష్టం అవుతుంది కనుక... ఆ ప్రాంతాల్లో మగవారిని నియమించుకోవచ్చు. 


ఉత్పత్తులెన్నో... 

ప్రస్తుతం అక్కడ నడుస్తున్న యూనిట్లలో ప్యాకేజింగ్‌, ఎల్‌ఈడీ స్ర్కీన్స్‌, బల్బులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లాంటి వాటితోపాటు హైడ్రాలిక్‌ ఎలివేటర్స్‌ వంటి ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు కూడా తయారవు తున్నాయి. ఒకరు ఇంజనీరింగ్‌ సెక్షన్‌లో కెపాసిటర్స్‌, ఇంకొకరు మెడికల్‌ డివైజ్‌లు రూపొందిస్తున్నారు. మరొకామె బల్క్‌ ఐస్‌క్రీమ్స్‌ తయారు చేస్తున్నారు. స్టీల్‌, మాడ్యులర్‌ ఫర్నిచర్‌, ఫ్యాన్స్‌... ఇలా రకరకాల ఉత్పత్తులు మహిళల చేతుల్లో ఇక్కడ సిద్ధమవుతున్నాయి. 25 మంది యజమానులు, వారి భాగస్వాములు... ప్రస్తుతం 50 మంది మహిళలు ‘ఇండస్ర్టియల్‌ పార్క్‌’ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 


వందల మందికి ఉపాధి... 

రూ.250 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ పార్కు ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తుందని మా అంచనా. 2024 నాటికి కచ్చితంగా ఈ లక్ష్యాన్ని చేరుకొంటాం. అంత నమ్మకంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే... ఇప్పుడున్న ప్రతి యూనిట్‌ కూడా వంద శాతం ఉత్పత్తి రేటుతో దూసుకుపోతోంది. ఇంకా ఎంతో మంది మహిళలు పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వాలు ముందుకు వస్తే... దేశ వ్యాప్తంగా ఈ తరహా పార్కులు నెలకొల్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇండోర్‌, భోపాల్‌, బెంగళూరుల నుంచి చాలామంది మమ్మల్ని సంప్రతించారు. తెలంగాణలో మరొక పార్కు ఏర్పాటుకు విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తున్నాం. 


సవాళ్లు సహజం... 

పరిశ్రమ ఒకటి ప్రారంభించాలనుకొనే మహిళలు ముఖ్యంగా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధిలోకి తేవాలనేది నేర్చుకోవాలి. ఈ రంగంలో పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. పరిశ్రమ ఏర్పాటులో అతిపెద్ద సవాలు... ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం. ఏ ఒక సంస్థ ఏర్పాటు చేయాలంటే సవాళ్లనేవి సహజం. అది ఆడవారికైనా, మగవారికైనా! అయితే ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు నేటి వనితలు సిద్ధమవుతున్నారు. పట్టుదలగా ప్రయత్నించి అనుకున్నది సాధిస్తున్నారు. అలాంటి మహిళలను మేం ఇండస్ర్టియల్‌ పార్కులో చూస్తున్నాం. చెదరని వారి సంకల్ప బలం అద్భుతం. 


అవగాహన... అవకాశాలు... 

ఇక్కడ మేము ఫెసిలిటేటర్లు మాత్రమే. మా వంతు బాధ్యతగా బ్యాంకులతో మాట్లాడి రుణం పొందే ప్రక్రియను సులభతరం చేయడం, ప్రభుత్వం నుంచి త్వరితగతిన అనుమతులు తెప్పించడంలో సహకరిస్తున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలామంది మహిళలు పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్నారు. అవగాహన, అవకాశాలు పెరగడమే ఇందుకు కారణం. ప్రభుత్వాలు కూడా మహిళలను తయారీ రంగంలో ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తి వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపింది. 

 హనుమామహిళల చేత  మహిళల కోసం...

సేవ... సాధికారత...

జ్యోత్స్న అంగారా ప్రస్తుతం ‘ఎఫ్‌ఎల్‌ఓ’ నేషనల్‌ గవర్నింగ్‌ బోర్డ్‌ సభ్యురాలు. కమ్యూనికేషన్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ ప్రొఫెషనల్‌గా వివిధ రకాల పరిశ్రమలతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెది. పలు స్వచ్ఛంద సంస్థలకు సేవలందిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళల ఆర్థిక సాధికారతకు కృషి చేస్తున్నారు. సైకాలజీ పట్టా పొందిన ఆమె... పారా గ్లైడింగ్‌లో శిక్షణ పొందారు. వర్సిటీ, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పోటీపడ్డారు. ‘సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ సభ్యురాలు. ‘అక్ష సోషల్‌ ఇంపాక్ట్‌ ఫౌండేషన్‌’కు వ్యవస్థాపక డైరెక్టర్‌. ‘ఇండస్ర్టియల్‌ పార్క్‌’ ఏర్పాటులో ఆమెది కీలక పాత్ర.మహిళల చేత  మహిళల కోసం...

నైపుణ్యం పెంచేందుకు...

అజితా యోగేష్‌ ఎలక్ర్టానిక్స్‌ ఇంజనీరింగ్‌ చదివారు. ఫ్యాషన్‌ రంగానికి బంగారు భవిష్యత్‌ ఉందని ముందుచూపుతో ఆలోచించి... 1992లో ‘హామ్స్‌టెక్‌’ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ నెలకొల్పారు. నేడు దాన్ని ప్రపంచ స్థాయి ఇనిస్టిట్యూట్‌గా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ‘ఎఫ్‌ఎల్‌ఓ’ నేషనల్‌ గవర్నరింగ్‌ బాడీ సభ్యురాలిగా ఉన్నారు. మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దడం, వారిలో నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ‘ఇండస్ర్టియల్‌ పార్క్‌’లో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టాలనుకున్న మహిళలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.