వైరస్‌ సోకిందని..!

ABN , First Publish Date - 2021-05-15T04:40:30+05:30 IST

కరోనా సోకిందన్న భయంతోనో..లేక వైద్యం చేయించుకునే స్థోమత లేదనో... ఓ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన వేపాడ మండలం నల్లబిల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్త (62), ఆయన భార్య సత్యవతి (57), అత్త సుబ్బలక్ష్మి (75)లు శుక్రవారం ఉదయం శివాలయం వెనుకభాగంలో ఉన్న బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు.

వైరస్‌ సోకిందని..!
గ్రామస్థులతో మాట్లాడుతున్న సీఐ సింహాద్రినాయుడు




ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం

బావిలో దూకి ఆత్మహత్య

నల్లబిల్లిలో విషాదం .

వేపాడ మే 14 : కరోనా సోకిందన్న భయంతోనో..లేక వైద్యం చేయించుకునే స్థోమత లేదనో... ఓ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన వేపాడ మండలం నల్లబిల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్త (62), ఆయన భార్య సత్యవతి (57), అత్త సుబ్బలక్ష్మి (75)లు శుక్రవారం ఉదయం శివాలయం వెనుకభాగంలో ఉన్న బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలు తేలియాడడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారమందించారు. వారు వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. సత్యనారాయణ గుప్త చాలా ఏళ్లు కిందట ఉపాధి నిమిత్తం కుటుంబంతో గుంటూరు వెళ్లిపోయారు. అక్కడే ఒక మిర్చీ యార్డులో పనిచేసేవారు. కుమారుడు, కుమార్తెలకు వివాహాలు చేశారు. వారు వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. రెండేళ్ల కిందట భార్య, అత్తతో కలిసి సత్యనారాయణ విశాఖ జిల్లా చోడవరానికి మకాం మార్చారు. రెండు రోజుల కిందట సత్యనారాయణ గుప్త అనారోగ్యానికి గురయ్యారు. కరోనా లక్షణాలు ఉన్నాయని..పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తూ రేపు మళ్లీ రావాలని డాక్టర్‌ సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్వగ్రామం నల్లబిల్లి గ్రామానికి భార్య, అత్తతో కలిసి వచ్చారు. గ్రామంలో బంధువులు, మిత్రులను కలిశారు. ఆత్మీయంగా మాట్లాడి తిరిగి చోడవరం బయలుదేరారు. గ్రామంలోని శివాలయం సమీపంలోకి వచ్చి ముందుగానే తెచ్చుకున్న పురుగు మందు తాగారు. అనంతరం బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం 11 గంటల సమయంలో బావిలో మృతదేహాలు తేలియాడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో వల్లంపూడి ఎస్‌ఐ లోవరాజు సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీయించారు. సీఐ సింహాద్రినాయుడు, తహసీల్దారు కృష్ణంరాజు, సర్పంచ్‌ సూర్యకుమారిల సమక్షంలో శవపంచనామా చేసి..మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లోవరాజు తెలిపారు. కరోనా సోకిందన్న భయంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత గ్రామానికి వచ్చిన సత్యనారాయణ గుప్త కుటుంబంతో ఇలా బలవన్మరణానికి పాల్పడడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.  



Updated Date - 2021-05-15T04:40:30+05:30 IST