ఊపిరాడని యూపీ.. బయటపెట్టిన ఫారెన్ మీడియా

ABN , First Publish Date - 2021-05-10T00:49:40+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. లక్షల మంది ప్రతి రోజూ ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారు. రోజు గడిచే కొద్దీ వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు ప్రతి చోటా కనిపిస్తూనే..

ఊపిరాడని యూపీ.. బయటపెట్టిన ఫారెన్ మీడియా

లక్నో: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. లక్షల మంది ప్రతి రోజూ ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారు. రోజు గడిచే కొద్దీ వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు ప్రతి చోటా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అనేక చోట్ల ఉన్న దారుణ పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా కూడా ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఓ ఫారెన్ మీడియా సంస్థ యూపీలోని ఆసుపత్రుల్లో ఉన్న దుస్థితిపై వాస్తవాలను బయటపెట్టింది. ఆసుపత్రికి వచ్చిన కరోనా పేషెంట్లను పట్టించుకునే నాథుడే లేడని, బాధితులంతా తమకు ఎప్పుడు సాయం అందుతుందా అని ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు కాస్తున్నారని వెల్లడించింది. 


కరోనాతో పోరాటంలో అలసిపోయిన అమ్మ..

ఇంతలోనే అదే ఆసుపత్రిలో ఓ తల్లి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. ఆమె పిల్లలు ఎంత ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. డాక్టర్ వచ్చి ఆమె మరణించినట్లు వెల్లడించారు. దాంతో ఆమె బిడ్డల దైన్యం, ఆక్రందనకు అంతులేకుండా పోయింది. ‘ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం కాదా..? ముప్పును ఊహించకుండా, దానిని ఎదుర్కొనేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ఉండడం వల్లనే ఇప్పుడు ఇలాంటి దుస్థితి ఏర్పడుతోంద’ని మీడియా సంస్థ ఆరోపించింది. ప్రస్తుతం దేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది.


ఆక్సిజన్ సమస్య లేదట..

ఆసుపత్రుల్లో ఉన్న ఎక్కువమంది బాధితులు తమకు ఆక్సిజన్ అందడం లేదని ఆరోపించగా.. దీనిపై సదరు మీడియా ప్రతినిధి ఈ సమస్యపై ఆసుపత్రి ఇంచార్జిని ప్రశ్నించింది. అయితే ఆక్సిజన్ కొరత ఏమీ లేదని, స్టాఫ్ తక్కువగా ఉండడం వల్లనే సమస్యలు తలుత్తుతున్నాయని ఆ ఇంచార్జి చెప్పుకొచ్చారు. 


అదే సమయంలో కొందరు బాధితులతో మాట్లాడి వారి కన్నీటి గాధను వినిపించింది. ఊపిరందని స్థితిలో ఉన్న కొడుకును చూస్తూ ఆక్రోశిస్తున్న ఓ తండ్రి ఆక్రందనను, అమ్మ ప్రాణం కోసం అల్లాడిపోతున్న నలుగురు కొడుకుల ఆవేదనను, ప్రాణవాయువు కోసం ప్రాథేయపడుతూ 4 రోజులుగా నేలపైనే పడిగాపులు కాస్తున్న ఓ మహిళ బాధను వినిపించింది. అలాగే ప్రతిరోజూ ఎంతో మంది మృత్యువుతో పోరాడి అలసిపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలనూ కళ్లకు కట్టినట్లు చూపించింది. 



Updated Date - 2021-05-10T00:49:40+05:30 IST