మీలాగే మాకూ హక్కులున్నాయి : అమెరికాకు చెప్పిన జైశంకర్

ABN , First Publish Date - 2022-04-14T18:03:45+05:30 IST

భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని

మీలాగే మాకూ హక్కులున్నాయి : అమెరికాకు చెప్పిన జైశంకర్

వాషింగ్టన్ : భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత దేశ విధానాలపై అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు ఎవరికైనా ఉందని, అయితే అదే సమయంలో వారి గురించి కూడా అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు భారత దేశానికి అంతే సమానంగా ఉందని చెప్పారు. 


ఇటీవల న్యూయార్క్‌లో సిక్కు మతానికి చెందిన ఇద్దరిపై విద్వేషపూరిత దాడి జరిగిన నేపథ్యంలో జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్, అమెరికా 2 ప్లస్ 2 మినిస్టీరియల్ డయలాగ్‌లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించారు. ఈ చర్చల్లో అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం సోమవారం జరిగిన సంయుక్త విలేకర్ల సమావేశంలో ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, భారత దేశంలో ఇటీవల జరుగుతున్న ఆందోళనకర పరిణామాలను అమెరికా పరిశీలిస్తోందన్నారు. ప్రభుత్వం, పోలీసులు, జైలు అధికారులు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుండటం పెరిగిందన్నారు. దీనిపై జైశంకర్ సోమవారం స్పందించలేదు. 


జైశంకర్ బుధవారం మీడియా సమావేశంలో స్పందిస్తూ, భారత దేశం గురించి అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు ఎవరికైనా ఉందన్నారు. అయితే వారి అభిప్రాయాలు, ఆసక్తులు, లాబీలు, వాటిని నడిపిస్తున్న ఓటు బ్యాంకుల గురించి అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు భారత దేశానికి కూడా అంతే సమానంగా ఉందని తెలిపారు. కాబట్టి ఎప్పుడు చర్చ జరిగినా, మాట్లాడటానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. 2 ప్లస్ 2 మినిస్టీరియల్ డయలాగ్‌లో మానవ హక్కుల అంశం చర్చనీయాంశం కాదన్నారు. 


‘‘అమెరికాతో సహా, ఇతర దేశాల్లో మానవ హక్కుల పరిస్థితిపై కూడా అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కు మాకు ఉంది, అమెరికాలో మానవ హక్కుల సమస్యలు ఉత్పన్నమైనపుడు కూడా స్పందిస్తామన్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైనపుడు తప్పకుండా స్పందిస్తామని చెప్పారు. వాస్తవానికి మంగళవారం ఓ సంఘటన జరిగిందన్నారు.  


అమెరికాలోని న్యూయార్క్‌లో మంగళవారం ఇద్దరు సిక్కులపై విద్వేష దాడి జరిగింది. రిచ్‌మండ్ హిల్స్‌లో ఉదయం వాకింగ్‌కు వెళ్ళిన ఈ ఇద్దరిపైనా దాడి జరిగింది. 10 రోజుల క్రితం కూడా ఇదే విధంగా మరొకరిపై దాడి జరిగింది.  మంగళవారం జరిగిన దాడి సంఘటనను జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. 


ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా తదితర దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాము ఆంక్షలు విధించినప్పటికీ, రష్యాతో భారత్ సంబంధాలను కొనసాగిస్తుండటంపై అమెరికా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంటోనీ బ్లింకెన్ 2 ప్లస్ 2 మినిస్టీరియల్ డయలాగ్ మధ్యలో భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావించారు. ఇలా నేరుగా భారత్‌ను విమర్శించడం చాలా అరుదు అని విశ్లేషకులు చెప్తున్నారు. 


న్యూయార్క్ స్టేట్ ఆఫీస్‌కు ఎన్నికైన తొలి పంజాబీ అమెరికన్ జెనిఫర్ రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలో భారతీయులపై విద్వేషపూరిత దాడులు ఇటీవలి సంవత్సరాల్లో 200 శాతం పెరిగాయి. 


Updated Date - 2022-04-14T18:03:45+05:30 IST