న్యాయశాస్త్ర ప్రజ్ఞానిధి

ABN , First Publish Date - 2021-04-16T05:49:42+05:30 IST

జీవీజీగా సువిఖ్యాతుడయిన మాజీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ జీవీజీ కృష్ణమూర్తి వృత్తిరీత్యా, శిక్షణ లోనూ న్యాయవాది....

న్యాయశాస్త్ర ప్రజ్ఞానిధి

జీవీజీగా సువిఖ్యాతుడయిన మాజీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ జీవీజీ కృష్ణమూర్తి వృత్తిరీత్యా, శిక్షణ లోనూ న్యాయవాది. దౌత్యనీతిపై ఆయన రాసిన ఒక పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలలో తప్పనిసరిగా చదవాల్సిన ఒక పాఠ్యగ్రంథంగా ఉన్నది. ప్రభుత్వంలో సుదీర్ఘకాలం వివిధ బాధ్యతలు నిర్వహించిన జీవీజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీకి సన్నిహితులు. ఆమె ఒక పర్యాయం ఆయనకు ఐక్యరాజ్యసమితికి భారత ప్రతినిధి బృందం నాయకుడిగా పంపించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆయన సేవలను నిర్లక్ష్యం చేసింది. లా కమిషన్ సభ్య-కార్యదర్శిగా ఆయన్ని బదిలీ చేసింది. భోపాల్ విషవాయు దుర్ఘటన బాధితులకు న్యాయం సాధించడంలో జీవీజీ కీలకపాత్ర వహించారు. భారత్ న్యాయవాదుల బృంద సభ్యుడిగా బహుళజాతి కంపెనీ యూనియన్ కార్బైడ్‌కు వ్యతిరేకంగా అమెరికా న్యాయస్థానాలలో ఆయన వాదనలు అవిస్మరణీయమైనవి. బాధితులకు అధిక నష్టపరిహారాన్ని సాధించేందుకు ఆయన విశేష కృషి చేశారు. 


ఎన్నికలరంగంలో శాశ్వత విలువ, ప్రాధాన్యం గల సేవలను జీవీజీ అందించారు. పనితీరు,వచో శైలితో ‘ఆల్సేషియన్‌’ గా పేరు పొందిన ప్రధాన ఎన్నికల కమిషనర్ టి ఎన్ శేషన్ నిరంకుశ ధోరణిని ఆయన దీటుగా ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో జీవీజీ-–శేషన్ పోరాటం ఢిల్లీలో నిత్య చర్చనీయాంశంగా ఉండేది. వారిరువురి మధ్య పోరాటం అంతిమంగా సర్వోన్నత న్యాయస్థానంలో ఒక కొలిక్కి చేరింది. ఫలితంగా ముగ్గురు ఎన్నికల కమిషనర్లకు సమాన హోదా కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది శేషన్‌కు పెద్ద దెబ్బ. సహచర ఎన్నికల కమిషనర్ల ఫోన్‌లైన్లను కట్ చేయించిన ఘనచరిత్ర శేషన్‌కు ఉన్నది.


సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పుడు శేషన్ తన గ్రీన్‌కార్డ్‌ను పునరుద్ధరించుకునేందుకు అమెరికాలో ఉన్నారు. సుప్రీం తీర్పు దృష్ట్యా శేషన్ తన పర్యటనను మధ్యలోనే విరమించుకుని స్వదేశానికి తిరిగి వస్తారని మీరు భావిస్తున్నారా అని ఒక విలేఖరి ప్రశ్నించగా ‘ఆయన తన నాలుకను అదుపులో ఉంచుకోవడం మినహా ఏమైనా చేయగలరు’ అని జీవీజీ వ్యాఖ్యానించారు. అమెరికాలో శేషన్ ఫోన్ నెంబర్ గురించి మరో విలేఖరి ప్రశ్నిం చగా ‘నేను ఎవరి ఏజెంట్‌నూ కాను. ఒక చిల్లర కూరగాయల వ్యాపారికి అసలే కాదు’ అని జీవీజీ బదులిచ్చారు. ఆ రోజుల్లో ఒక టీవీ కమర్షియల్‌లో ‘సఫల్ ఫ్రోజెన్ వెజిటబుల్స్’‌కు అనుకూలంగా శేషన్ చేసిన ప్రచారంపై జీవీజీ విసురు అది. 


అన్ని రాజకీయపార్టీల నాయకులను అదరగొట్టిన శేషన్ ఔద్ధత్యాన్ని తగ్గించేందుకే ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య సంఘంగా మార్చడం జరిగింది. ఈ ఆలోచన పీవీ నరసింహారావుది. పీవీకి జీవీజీల మధ్య హైదరాబాద్‌లో వారిరువురు న్యాయవాదులుగా ఉన్నప్పటి నుంచీ మంచి స్నేహమున్నది. ‘నన్ను ఎన్నికల కమిషనర్‌గా ఎంపిక చేసింది పీవీ కాదు. శేషన్‌ను కట్టడి చేసేందుకు నన్ను ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ప్రణబ్ ముఖర్జీ, పలువురు కాంగ్రెస్ నాయకులు పీవీకి గట్టిగా చెప్పా’రని జీవీజీ ఆ తరువాతి కాలంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిర్వాచన్ సదన్‌లో ప్రవేశించేంతవరకు శేషన్, జీవీజీ మంచి స్నేహితులు. వారి కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. సంగీతంలో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆసక్తులు శేషన్, జీవీజీలను సన్నిహితం చేశాయి. 


ఎన్నికల కమిషనర్‌గా జీవీజీ క్షేత్రస్థాయి ఎన్నికల సిబ్బందికి సదా అందుబాటులో ఉండేవారు. తన హయాంలో జరిగిన ఎన్నికలు ముగిసిన ప్రతిసారీ జిల్లాస్థాయి రిటర్నింగ్ ఆఫీసర్ (జిల్లా కలెక్టర్), జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ లకు వ్యక్తిగత లేఖ రాయడం జీవీజీకి ఆనవాయితీగా ఉండేది. ఎంతో మంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఆ లేఖలను తమ వ్యక్తిగత రికార్డులలో పదిలం చేసుకున్నారు. కింది స్థాయి అధికారులతో సన్నిహిత సంబంధాలు నెరపడం వల్లే ఆయన పీవీ అనంతరం జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించారు. కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని పీవీ భావించినప్పటికీ ఆయన విధానాలు నచ్చని జీవీజీ ఆ ఎన్నికల నిర్వహణను అడ్డుకున్నారు. 


రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాజకీయ పార్టీలు విప్ జారీ చేసే పద్ధతిని రద్దు చేయడం ఎన్నికల కమిషనర్‌గా జీవీజీ తీసుకున్న చర్యలలో ముఖ్యమైనది, కలకాలం నిలిచేది. ‘ఓటర్ల (ఎంపీలు, ఎమ్మెల్యేలు)కు లిఖితాదేశాలు జారీ చేయడం స్వేచ్ఛాయుత చర్యా కాదు, నిష్పాక్షిక నిర్ణయమూ కాదు’ అని జీవీజీ నొక్కి చెప్పారు. ఆయన నిర్ణయాన్ని రాజకీయపార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజకీయపార్టీలు విప్ జారీ చేయడం ఎంత మాత్రం సముచితం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఆదేశం ఆనాటి నుంచీ రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నది.


చీరాలలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జీవీజీ న్యాయశాస్త్రంలో స్వర్ణపతకాన్ని పొందారు. హైదరాబాద్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ స్థానిక లా కళాశాలలో బోధించేవారు. కేంద్ర హోం మంత్రి, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన శివరాజ్ పాటిల్ ఆయన విద్యార్థులలో ఒకరు. స్వయంశక్తితో ఉన్నతస్థాయికి ఎదిగిన జీవీజీ కృష్ణమీనన్, దామోదరం సంజీవయ్యలకు సన్నిహిత మిత్రుడు. సామాజిక, సాంస్కృతిక రంగా లలో ఆయన ఎంతో మందికి అండదండలనందించారు. భీష్మ నారాయణ్ సింగ్ ఆయన సన్నిహిత మిత్రులలో ఒకరు. సాంస్కృతిక కార్యకలాపాలలో ఇరువురూ చురుగ్గా పాల్గొనేవారు. రెండు సంవత్సరాల క్రితం సింగ్ చనిపోయిన అనంతరం ఆయన ఒంటరివాడయ్యారు. 86 ఏళ్ల జీవీజీ కొంతకాలం క్రితం ఇంట్లో పడిపోవడంతో ఇంటివద్ద మంచానికే పరిమితమయ్యారు. సతీమణి పద్మ, కుమారుడు జీవీరావు (ఢిల్లీలో సీనియర్ లాయర్), ఒక కుమార్తె జీవీజీ జ్ఞాపకాలుగా మిగిలారు.

మల్లాది రామారావు

Updated Date - 2021-04-16T05:49:42+05:30 IST