50 ఎకరాల్లో వందేళ్ల నాటి వృక్షాలు నరికివేత

ABN , First Publish Date - 2020-12-31T05:33:17+05:30 IST

నేషనల్‌ ఫారెస్ట్‌ నిబంధనల ప్రకారం 33శాతం అడవి ఉండాలి.. ఆ లెక్క ప్రకారం జిల్లాల్లో నాలుగు లక్షల హెక్టారుల్లో అడవి ఉండాలి.. కానీ 1.30వేల హెక్టార్లు మాత్రమే ఉంది.

50 ఎకరాల్లో వందేళ్ల నాటి వృక్షాలు నరికివేత

వందేళ్ల నాటి వృక్షాలపై అక్రమార్కులు వేటు వేస్తున్నారు. బెల్లంకొండ మండలంలో యథేచ్ఛగా అడవి చెట్లను నరికేస్తున్నారు..  దర్జాగా  జిల్లా దాటిస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మిన్నకుండిపోతున్నారు. కింది స్థాయి ఉద్యోగులను బాధ్యులుగా చేస్తున్నారు. 


అటవీ ప్రాంతంలో అక్రమార్కుల బారిన భారీ వృక్షాలు

జిల్లాలు దాటిస్తున్నా చేష్టలుడిగి చూస్తున్న అధికారులు

అటవీశాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత



(ఆంధ్రజ్యోతి, గుంటూరు)

నేషనల్‌ ఫారెస్ట్‌ నిబంధనల ప్రకారం 33శాతం అడవి ఉండాలి.. ఆ లెక్క ప్రకారం జిల్లాల్లో నాలుగు లక్షల హెక్టారుల్లో అడవి ఉండాలి.. కానీ 1.30వేల హెక్టార్లు మాత్రమే ఉంది. కారణం అక్రమార్కుల ధనదాహానికి వందేళ్ల నాటి వృక్షాలు నరికివేతకు గురవుతుండడమే. దీంతో రోజు రోజుకు అటవీప్రాంతం కుచించుకుపోతోంది. ప్రధానంగా బెల్లంకొండ, రాజుపాలెం, వెంకటాయపాలెం, గుత్తికొండ, రామాంజనేయపాలెం, శివాపురం తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా చెట్లను యంత్రాల సహాయంతో నరికి కలపను ఎల్లలు దాటిస్తున్నారు. వీటిలో నర్లంగి, చిట్రేగు, గుట్టి, కుంకుడు, జావ వంటి అటవీ వృక్షాలున్నాయి. 


రాజకీయ నేతల హస్తం..!

బెలంకొండ తదితర ప్రాంతాల్లో చెట్ల నరికివేతలో అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నేతల హస్తం ఉన్నట్లు సమాచారం. అలానే గిరిజన హక్కు పత్రాలు(ఆర్‌వోఎఫ్‌ఆర్‌) అందుతాయని గిరిజనులను రెచ్చగొడుతూ దగ్గరుండి చెట్లను నరికి వేయిస్తున్నారని స్థానికులు అంటున్నారు. పెద్ద పెద్ద మొద్దులను జిల్లాలను దాటిస్తున్నారు. 


 వేధిస్తున్న సిబ్బంది కొరత

అటవీ ప్రాంతంలో వృక్షాల నరికివేతను అడ్డుకోవటంలో అటవీశాఖ సిబ్బంది నానా కష్టాలు పడుతోంది. భారమంతా కిందిస్థాయి ఉద్యోగులదే అన్నట్లు వ్యవహారం సాగుతోంది. ఎవరైనా చెట్లు నరికివేస్తే వారినే బాధ్యులుగా చేస్తున్నారు. ఒక్కో బీటు ఆఫీసర్‌ పరిధిలో నిబంధనల ప్రకారం వెయ్యి హెక్టార్లు ఉండాలి. కాని సిబ్బంది కొరతతో బీటు ఆఫీసర్‌ ఒక్కొక్కరు దాదాపు 5వేల హెక్టార్లను పర్యవేక్షించాల్సి వస్తోంది. జిల్లాలో కేవలం 44మంది మాత్రమే అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి 50శాతం ఖాళీలను భర్తీ చేయడం లేదని కిందిస్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. ఉన్న వారికి వాహన సదుపాయాలు లేవు. అలానే డిసెంబరు నుంచి  వాహనాలకు ఇంధన బిల్లులు రావటం లేదు. ఎఫ్‌బీవోలు పాతికేళ్లుగా ఎటువంటి ప్రమోషన్లు లేకుండా అదే స్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. అలానే కంపా స్కీం కింద చేసిన పనులకు రూ.కోట్లలో బిల్లులు రావాల్సి ఉంది. దీనిపై అటవీశాఖ ముఖ్య అధికారులను వివరణ కోరగా బెల్లం కొండ అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేసిన విషయాన్ని గుర్తిం చామన్నారు. నిందితులను రెండురోజుల్లో పట్టుకుంటామన్నారు. వృక్షాలను నరికితే పీడీ యాక్టులు పెడతామని హెచ్చరిస్తున్నారు. చెట్టు నరికిన ప్రాంతంలో జేసీబీలతో గుంతలు తీస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2020-12-31T05:33:17+05:30 IST