కొరవడిన నిఘా

Published: Sat, 25 Jun 2022 22:24:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొరవడిన నిఘా

అటవీశాఖలో పోస్టులు ఖాళీ...!

దీర్ఘకాలిక సెలవుల్లో బీట్‌ ఆఫీసర్లు

ఉన్నత ఉద్యోగ ప్రయత్నంలో కొందరు

ఒత్తిళ్లు తాళలేక మరికొందరు దూరం

విధుల్లో ఉన్న వారిపై అదనపు భారం

మంచిర్యాల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): అడవుల్లో నిఘా కొరవడింది. అటవీశాఖలో ఖాళీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మంజూరైన పోస్టులకు సరిపడా నియామకాలు జరుగకపోవడం, ఉన్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలిక సెలవులపై వెళ్ళారు. దీంతో విధుల్లో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. జన్నారం, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అటవీ డివిజన్‌ల పరిధిలో బీట్‌ ఆఫీసర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో అనేక మంది దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడంతో వారి స్థానాలను అందుబాటులో ఉన్నవారితో తాత్కాలికంగా భర్తీ చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. అధిక సంఖ్యలో బీట్‌ ఆఫీసర్లు సెలవులపై వెళ్ళడంతో నిఘా కొరవడి అటవీ సంపద, వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త ఉద్యోగాల వేటలో...

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడంతో అనేక మంది బీట్‌ ఆఫీసర్లు ఆ ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన బీట్‌ ఆఫీసర్లలో అత్యధికులు ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండటంతో గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో  శిక్షణ పొందేందుకు దీర్ఘకాలిక సెలవులు పెట్టినట్లు సమాచారం. మూకుమ్మడిగా సెలవులకు దరఖాస్తులు రావడంతో ఉన్నతాధికారులు నిరాకరించినా అనధికారికంగా విధుల్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఒక్కో సెక్షన్‌ పరిధిలో నలుగురు బీట్‌ ఆఫీసర్లు ఉన్నచోట ఒకరిద్దరితో కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో మిగిలిన బీట్‌ ఆఫీసర్లతో కలిసి సెక్షన్‌ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు టీం వర్క్‌ చేస్తూ అడవుల రక్షణకు పడరాని పాట్లు పడుతున్నారు.

పని ఒత్తిడి కారణమే...!

బీట్‌ ఆఫీసర్లు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిపోవడానికి పని ఒత్తిడి కూడా కారణంగా తెలుస్తోంది. పని భారమంతా బీట్‌ ఆఫీసర్లపైనే అధికంగా ఉంటుంది. బీట్‌ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు కొన్ని సందర్భాల్లో  జేబుల్లో నుంచి డబ్బులు వెచ్చించాల్సి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అటవీ నర్సరీల పెంపకంలో బీట్‌ ఆఫీసర్లు సొంత డబ్బు వెచ్చించక తప్పని పరిస్థితులు ఉన్నాయి.  బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడం, పూర్తి బిల్లు రాకపోవడంతో బీట్‌ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. నర్సరీల్లో పెంచే మొక్కలపై దాదాపు 30 శాతం బీట్‌ అధికారులే భరించాల్సి వస్తున్నట్లు సమాచారం. నర్సరీల్లో పెంచే మొక్కలకు సైతం పూర్తి బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తోంది.  

మొక్క ఖరీదును ప్రభుత్వం చెల్లిస్తుండగా మొక్కను నాటి, సంరక్షించేందుకు వెచ్చించే ఖర్చులు పూర్తిస్థాయిలో రాక కిందిస్థాయి ఉద్యోగులపై భారం పడుతోంది. లేబర్‌ ఛార్జీలతోపాటు మొక్కల షిఫ్టింగ్‌ సమయంలోనూ ఖర్చులు అఽధికారులే భరించాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. నర్సరీల్లో పెరిగే గడ్డిని తొలగించేందుకు సైతం బిల్లులు సరిగ్గా రావడం లేదు. రెండు, మూడు సార్లు ప్రభుత్వపరంగా బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ, నర్సరీలో మొక్క పెరిగినంత కాలం గడ్డిని తొలగిస్తూనే ఉండాలని, లేబర్‌ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కొందరు బీట్‌ ఆఫీసర్లు ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు పని ఒత్తిడి, మరోవైపు ఖర్చులు జేబుల్లో నుంచి వెచ్చించాల్సి వస్తుండటాన్ని భరించలేని కొందరు బీట్‌ ఆఫీసర్లు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.  

జిల్లాలో ఖాళీలు ఇలా...

జిల్లా అటవీశాఖలో బీట్‌ ఆఫీసర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలోని నాలుగు అటవీ డివిజన్ల పర్యవేక్షణకు మొత్తం 242 బీట్‌ ఆఫీసర్ల పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో కేవలం 149 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 48 పోస్టులు ఖాళీ ఉన్నాయి. విధులు నిర్వహిస్తున్న వారిలో 48 మంది బీట్‌ ఆఫీసర్లు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిపోయారు. జిల్లాకు మంజూరైన 242 పోస్టుల్లో ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు 101 మంది. సగానికి పైగా బీట్‌ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా కార్యాలయానికి 6 బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం ఒక్కరు కూడా విధుల్లో లేరు. మంచిర్యాల డివిజన్‌లో 71 పోస్టులు మంజూరుకాగా 39 మంది విధులు నిర్వహిస్తున్నారు. మరో 32 ఖాళీలు ఉన్నాయి. జన్నారం డివిజన్‌లో 58 పోస్టులకు 52 మంది పని చేస్తుండగా 6 ఖాళీలు ఉన్నాయి. చెన్నూరు డివిజన్‌లో 64 పోస్టులకు 36 మంది విధులు నిర్వహిస్తుండగా 28 ఖాళీలు ఉన్నాయి. బెల్లంపల్లి డివిజన్‌లో 43 పోస్టులకు 22 మంది పని చేస్తుండగా 21 ఖాళీలు ఉన్నాయి. ఖాళీలను సర్దుబాటు చేయలేక అధికారులు తలలు పట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన వారు తిరిగి ఎప్పుడు విధుల్లో చేరుతారో తెలియని పరిస్థితుల్లో అటవీ సంపద రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.