ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌సెక్షన్‌ ఆఫీసర్‌

ABN , First Publish Date - 2021-07-27T04:32:20+05:30 IST

రహదారి పక్కన ఓ చిరువ్యాపారి దుకాణం నడుపుకొనేందుకు షెడ్డు ఏర్పాటు చేసుకోగా.. ఆ ప్రాంతం అటవీ శాఖ పరిధిలో ఉందని, తనకు రూ.20వేలు లంచం ఇస్తేనే ఇక్కడ షెడ్డు ఉంటుందని, లేకపోతే లేదని బెదిరించి

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌సెక్షన్‌ ఆఫీసర్‌
ఏసీబీకి చిక్కిన ఇరవెండి ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి నాగరాజు

దుకాణం నిర్వహణ విషయమై చిరువ్యాపారి నుంచి లంచం డిమాండ్‌ 

రూ.15వేలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం

అశ్వాపురం, జూలై 26 :  రహదారి పక్కన ఓ చిరువ్యాపారి దుకాణం నడుపుకొనేందుకు షెడ్డు ఏర్పాటు చేసుకోగా.. ఆ ప్రాంతం అటవీ శాఖ పరిధిలో ఉందని, తనకు రూ.20వేలు లంచం ఇస్తేనే ఇక్కడ షెడ్డు ఉంటుందని, లేకపోతే లేదని బెదిరించి.. ఆ వ్యాపారి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటూ ఓ అటవీశాఖ అధికారి ఏసీబీకి చిక్కిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని మొండికుంట ఫారెస్ట్‌ నర్సరీలో సోమవారం జరిగింది. మొండికుంట గ్రామానికి చెందిన బాణోత్‌ వీరన్న అనే చిరువ్యాపారి మొండికుంట నర్సరీ సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన దుకాణం నిర్వహించుకునేందుకు ఇటీవల ఓ షెడ్‌ నిర్మించుకున్నాడు. అయితే ఈషెడ్‌ అటవీశాఖ పరిఽధిలో ఉన్న భూమిలో ఉందని, ఇక్కడ సజావుగా వ్యాపారం చేసుకోవాలంటే తనకు రూ.20వేలు లంచం ఇవ్వాలని, లేదంటే ఇక్కడి నుంచి షెడ్‌ను తొలగిస్తామని ఇరవెండి ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి నాగరాజు.. వీరన్నను ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో తాను రూ.15వేలు చెల్లిస్తానని వీరన్న అతడికి తెలిపాడు. అయితే లంచం ఇవ్వటం ఇష్టంలేని వీరన్న పది రోజుల క్రితం ఖమ్మం ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. ఫిర్యాదు తీసుకున్న అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. పథకం ప్రకారం వీరన్న.. తాను లంచం డబ్బు చెల్లిస్తానని, మొండికుంట ఫారెస్ట్‌ నర్సరీకి రావాలని సెక్షన్‌ అధికారి నాగరాజుకు చెప్పగా.. తాను భద్రాచలం బస్టాండ్‌ వద్ద ఉన్నానని అక్కడకు రావాలని నాగరాజు తెలపడంతో.. అక్కడకు వెళ్లిన వీరన్న నాగరాజుకు రూ.15వేలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని మొండికుంట నర్సరీకి తరలించి విచారించారు. అయితే తానులంచం అడిగిన విషయాన్ని నాగరాజు అంగీకరించడంతో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి వెల్లడించారు. ఆయన సోమవారం సాయంత్రం మొండికుంట ఫారెస్ట్‌ నర్సరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించగా.. ఈ సమావేశంలో ఏసీబీ సీఐలు శ్రీనివాస్‌, రవి, రఘబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:32:20+05:30 IST