పెన్షనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి.. రూ.3.40 లక్షలు కాజేసి...

ABN , First Publish Date - 2021-01-22T06:45:40+05:30 IST

చనిపోయిన సొంత తాతకు వచ్చిన సొమ్ముతోపాటు ఉద్యోగ విరమణ చేసిన పలువురు ఉద్యోగుల పెన్షన్‌ సొమ్మునూ ఫోర్జరీ సంతకాలతో కాజేసి ఉద్యోగాన్ని కోల్పోయి పరారీలో ఉన్న నిందితుడిని అమలాపురం పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

పెన్షనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి..  రూ.3.40 లక్షలు కాజేసి...

పరారైన ఎస్‌బీఐ ఉద్యోగి అరెస్టు

అమలాపురం టౌన్‌, జనవరి 21: చనిపోయిన సొంత తాతకు వచ్చిన సొమ్ముతోపాటు ఉద్యోగ విరమణ చేసిన పలువురు ఉద్యోగుల పెన్షన్‌ సొమ్మునూ ఫోర్జరీ సంతకాలతో కాజేసి ఉద్యోగాన్ని కోల్పోయి పరారీలో ఉన్న నిందితుడిని అమలాపురం పట్టణ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అమలాపురం పట్టణ సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. అనపర్తికి చెందిన సబ్బెళ్ల సతీష్‌రెడ్డి అలియాస్‌ సతీష్‌కు 2013లో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌లో కస్టమర్‌ అసోసియేట్‌గా ఉద్యోగం వచ్చింది. 2017-18 సంవత్సరాల్లో సతీష్‌రెడ్డి మండపేట, అమలాపురం ఎస్‌బీఐ బ్రాంచిల్లో పనిచేశాడు. సతీష్‌రెడ్డి అప్పటికే షేర్ల వ్యాపా రంలో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఫోర్జరీ సంతకాలతో విశ్రాంత ఉద్యోగుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు కాజేయడం ప్రారంభించా డు. 2018లో విశ్రాంత ఉద్యోగి అయిన సతీష్‌రెడ్డి తాత సత్యం చనిపోయాడు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి తాత సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.1.20 లక్షల పెన్షన్‌ సొమ్ము కాజేశాడు. అమలాపురం బ్రాంచిలో పనిచేసిన సమయంలో రెగ్యులర్‌గా బ్యాంకుకు వచ్చి పెన్షన్‌ సొమ్ములు డ్రా చేసుకునే వారిని గుర్తించాడు. వారి సంతకాలను ఫోర్జరీ చేసి అమలాపురం, అశోక్‌నగర్‌, ఇందుపల్లి గ్రామాలకు చెందిన విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌ సొమ్ములను ఫోర్జరీ సంతకాలతో సతీష్‌రెడ్డి కాజేశాడు. అప్పటికే సుమారు రూ.3.40 లక్షల మేర పెన్షనర్ల సొమ్ము లను కాజేసినట్టు అమలాపురం రూరల్‌ మండల పరిధిలోని ఈదరపల్లిలోని ఎస్‌బీఐ రీజనల్‌ కార్యాలయానికి సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. నిజాలను ఒప్పుకున్న సతీష్‌రెడ్డి చేసిన తప్పులను ఒప్పుకుని పత్రం రాసి బ్యాంకు అధికారులకు అందజేశాడు. దాంతో సతీష్‌రెడ్డిని 2018 ఆగస్టు 31న సస్పెండ్‌ చేశారు. అనంతరం మరొక బృందం వచ్చి విచారణ చేసి నిజాలను గుర్తించడంతో సతీష్‌రెడ్డిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించడంతోపాటు అతడిపై 2019 మే నెలలో అమలాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచీ పరారీలో ఉన్న సతీష్‌రెడ్డిని అమలాపురం బస్టాండు సమీపంలో గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించినట్టు సీఐ బాజీలాల్‌ చెప్పారు.

Updated Date - 2021-01-22T06:45:40+05:30 IST