క్షమలోనే దైవత్వం

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

లోకంలో తప్పులు చెయ్యనివారు ఉండరు. అది మానవ లక్షణం. దానికి అతీతమైనది దైవ స్వభావం.

క్షమలోనే దైవత్వం

లోకంలో తప్పులు చెయ్యనివారు ఉండరు. అది మానవ లక్షణం. దానికి అతీతమైనది దైవ స్వభావం. తెలిసో తెలియకో మన జీవనరథం తప్పుల దారిలో సాగిపోతూ ఉంటుంది. చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి. తప్పు చేసిన వారిని మన్నించాలి. అలా మన్నించిన వ్యక్తి ఔన్న త్యం ప్రకాశిస్తుంది. కానీ... తప్పు చేసినవారిని మన్నించలేని దుస్థితిలో మనం కొన్నిసార్లు ఉంటాం. మన్నింపు అనేది తప్పుచేసి, క్షమాభిక్ష అడిగిన వ్యక్తికి పునర్జన్మ లాంటిది. ఆ వ్యక్తి మారిపోయి, సంఘంలో జీవించడానికి అదొక అవకాశం. అది చాలా ఉదాత్తమైన గుణం. దాన్ని ఎప్పుడు ప్రయోగించాలో, ఎలా ప్రదర్శించాలో ఏసు ప్రభువు తన జీవితంలోని సంఘటనల ద్వారా తెలిపాడు. 


ఒకసారి ఒక వేశ్యను కొట్టి చంపడానికి సంఘంలోని పెద్దలు, పౌరులు... ఆమెను తరుముకుంటూ వచ్చారు. వ్యభిచరించినవాళ్ళను రాళ్ళతో కొట్టి చంపడం ఆ దేశ ఆచారం. గుమిగూడిన జనం మధ్య నిలబడి ప్రసంగిస్తున్న ఏసు ప్రభువును ఆమె చూసింది. ఆయన కాళ్ళ మీద పడింది. పశ్చాత్తాపంతో కన్నీరుమున్నీరుగా దుఃఖించింది. ఇది చూసిన జనం ‘‘నీవైనా చెప్పవయ్యా పెద్దమనిషీ!’’ అంటూ ఆవేశకావేశాలు వ్యక్తపరిచారు. ప్రభువు మౌనం వహించాడు. ఇసుక మీద ఏదో రాసుకుంటున్నాడు. ఆ అక్షరాలు ఒక్కొక్కటీ... ఆమెను తరుముకుంటూ వచ్చిన వారికి బాకుల్లా గుచ్చుకున్నాయి. వారి స్వయంకృత దోషాలను ఎత్తి చూపాయి. జ్ఞానోదయం కలిగించాయి. వాళ్ళ చేతుల్లోని రాళ్ళు మెల్లగా నేలకు జారిపోయాయి. అడగడానికి వచ్చినవారి అడుగులు... వచ్చిన దారిలోనే తిరిగి సాగిపోయాయి.


తన ముందు కుప్పకూలిన ఆ మహిళను చూసి ‘‘అమ్మా! నేను నిన్ను శిక్షించను. వెళ్ళు... మంచిగా బతుకు’’ అని చెప్పాడు ఏసు ప్రభువు. చెప్పుకోవడానికి ఇది చిన్న సంఘటనే. కానీ క్రైస్తవ సిద్ధాంతం సంపూర్ణంగా దీనిలో కనిపిస్తుంది. 

ఇక, కొన ఊపిరితో ఉన్న సమయంలో కూడా... తనను శిక్షించిన వారిని మన్నిస్తూ ‘‘వీరిని క్షమించు తండ్రీ’’ అని ప్రభువు అన్నాడంటే ఆయనలో ఎంతటి ప్రేమ దాగి ఉంది! ఎంతటి క్షమ నిండి ఉంది! 

‘‘మా తప్పులను మీరు మన్నించే విధంగానే... మేము కూడా మా పట్ల తప్పులు చేసేవారిని క్షమించేలా చేయవయ్యా...’’ అనే పంక్తులు ఏసు ప్రభువు నేర్పిన, ప్రసిద్ధమైన ‘పరలోక ప్రార్థన’లో చోటు చేసుకున్నాయంటే... మన్నింపునకు ఆయన ఎంత ప్రాధాన్యాన్ని ఇచ్చాడో తెలుస్తుంది. తప్పు చేసిన వ్యక్తిని ఎన్ని సార్లు మన్నించాలని శిష్యులు అడిగినప్పుడు, ‘‘లెక్కలేనన్ని సార్లు’’ అని ఆయన సమాధానం ఇచ్చాడు.

డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు, 9866755024  

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST