America: ఈ ఫార్మాలిటీస్ మీకు తెలుసా.. అమెరికాలో భారతీయులు మరణిస్తే..

ABN , First Publish Date - 2022-08-08T21:26:54+05:30 IST

ఉన్నత చదువులు కావొచ్చు.. ఉపాధి కోసం కావొచ్చు.. లేక అక్కడున్న వారిని కలవడం, విహార యాత్రలు కావొచ్చు.. ఇలా వేరు వేరు కారణాలతో నిత్యం కొన్ని వందల మంది భారతీయులు(Indians) అమెరికా వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్లిన వాళ్లు తమ తమ పనులను ముగించుకుని సాఫీగా ఇండియాకు తిరిగొస్తే సరే. కానీ అనూహ్య కారణాలతో వాళ్లు అక్కడే ప్రాణాలు వదిలితే. అందరికీ ఇలా జరుగుతుందని చెప్పలేం. కానీ..

America: ఈ ఫార్మాలిటీస్ మీకు తెలుసా..  అమెరికాలో భారతీయులు మరణిస్తే..

ఎన్నారై డెస్క్: ఉన్నత చదువులు కావొచ్చు.. ఉపాధి కోసం కావొచ్చు.. లేక అక్కడున్న వారిని కలవడం, విహార యాత్రలు కావొచ్చు.. ఇలా వేరు వేరు కారణాలతో నిత్యం కొన్ని వందల మంది భారతీయులు(Indians) అమెరికా వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్లిన వాళ్లు తమ తమ పనులను ముగించుకుని సాఫీగా ఇండియాకు తిరిగొస్తే సరే. కానీ అనూహ్య కారణాలతో వాళ్లు అక్కడే ప్రాణాలు వదిలితే. అందరికీ ఇలా జరుగుతుందని చెప్పలేం. కానీ.. ఈ మధ్య అగ్రరాజ్యంలో అసహనం, జాత్యహంకారం జడలు విప్పి విశృంఖల నృత్యం చేస్తున్నాయి. దీనికి గన్ కల్చర్ తోడవటంతో.. నల్లజాతీయులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. దీనికి జూన్ చివరి వారంలో న్యూయార్క్‌(New York)లోని మేరీలాండ్‌లో జరిగిన ఘటనే ఉదహరణ. పార్కు పక్కన కారులో కూర్చుని ఉన్న సత్నామ్ సింగ్ అనే 31ఏళ్ల భారతీయ యువకుడి దుండగులు కాల్చి చంపేశారు. అలాగే భర్త వేదింపులు భరించలేక మన్‌దీప్‌కౌర్((Mandeep Kaur) అనే వివాహిత ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇలా పలు రకాల కారణాలతో అక్కడే ప్రాణాలు వదిలిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి రప్పించడం ఆశామాశీ వ్యవహారం కాదు. పక్క రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తి పార్థీవ దేహాన్ని(Dead Body) సొంత రాష్ట్రానికి తీసుకురావడానే రకరకాల ఫార్మలిటీలు(Formalities to bring dead body from America) పూర్తి చేయాల్సి వస్తుంది. అదే అమెరికా లాంటి అగ్రరాజ్యం నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో యూఎస్‌ఏలో సొంతవాళ్లు చనిపోతే మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి ఏఏ సమాచారాన్ని అందించాల్సి ఉంటుందనే వివరలను ఓసారి పరిశీలిస్తే..


ఒక వ్యక్తి అనారోగ్య కారణంగా ఇంటి వద్ద చనిపోయినా.. ఏదైనా ప్రమాదంలో మరణించినా.. హత్య జరిగినా.. ఆత్మహత్య చేసుకున్నా వెంటనే పోలీసు శాఖకు తెలియజేయడం తప్పనిసరి. ఆ తర్వాత పోలీసుల అనుమతితో ఆ పార్థివ దేహాన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. అవసరమైతే వైద్యులు శవ పంచనామా చేసి మరణానికి గల కారణాలను ధ్రువీకరిస్తూ ఒక శవ పంచనామ నివేదిక (అటాప్సి రిపోర్ట్‌) రూపొందిస్తారు. ఇందులో ఏ రోజు? ఏ సమయానికి? చనిపోయారన్న విషయాలను నిర్ధారిస్తూ మరణ ధ్రువీకరణ పత్రాన్ని (డెత్‌ సర్టిఫికేట్‌) జారీ చేస్తారు.

 

ఒకవేళ చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే చనిపోతే.. ఏ కారణాలతో చనిపోయారో వివరిస్తూ సంబంధిత వైద్య అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. తర్వాత ఆ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు సూచించిన విధంగా స్థానికంగా ఉన్న ఒక ‘ఫ్యునరల్‌ హోం’ (అంతిమ సంస్కారాలు జరిపే ప్రదేశం)కు తరలిస్తారు. అంతిమ సంస్కరాలు అక్కడే జరపాలా? పార్థివ దేహాన్ని విదేశాలకు పంపాలా? అనే విషయాన్ని కుటుంబసభ్యుల నుంచి రాత పూర్వకంగా తీసుకొని అక్కడున్న అధికారులు తదుప రి చర్యలు చేపడతారు. అయితే ఈ సమయంలో ఫ్యునరల్‌ హోం అధికారులకు కుటుంబ సభ్యులు ఈ వివరాలు అందజేయాల్సి ఉంటుంది.

 


ఇవ్వాల్సిన వివరాలు

1. చనిపోయిన వ్యక్తి పేరు; 2. స్త్రీ లేదా పురుషుడు; 3. పుట్టిన తేది; 4. వయస్సు

5. జన్మస్థలం; 6. సోషల్‌ సెక్యూరిటీ నంబర్‌ (ఒకవేళ ఉంటే); 7. జాతి;

8. వివాహితులా? లేదా?; 9. భర్త లేదా భార్య వివరాలు; 10. విద్యార్హతలు; 11. వృత్తి

12. పనిచేస్తున్న రంగం; 13. చిరునామ; 14. తండ్రి పేరు;

15. తల్లి ఇంటి పేరు (పెళ్లికాకముందు); 16. చనిపోయిన స్థలం, ప్రాంతం

17. ఆస్పత్రి పేరు; 18. చనిపోయినట్లుగా తెలిపిన వ్యక్తి పేరు, వివరాలు

19. అంతిమ సంస్కారాల ప్రాధాన్యత? (దహన సంస్కారమా/ఖననమా/ ఏదైనా ఆస్పత్రికి విరాళమా?)

 

ఈ వివరాలను సేకరించిన తర్వాత ఆస్పత్రి నుంచి శవ పంచనామా నివేదిక (ఉంటే), మరణ ధ్రువీకరణ పత్రం(డెత్‌ సర్టిఫికేట్‌), చనిపోయిన వ్యక్తి ప్రాంతపు జనన, మరణ నమోదు కార్యాలయం అధికారుల నుంచి చనిపోయినట్లుగా నమోదు చేసిన (కౌంటీ డెత్‌ సర్టిఫికేట్‌) పత్రాలను ఫ్యునరల్‌ హోం అధికారులు సేకరిస్తారు.

 

పార్థివ దేహం చెడిపోకుండా భద్రపరిచిన (ఎంబామింగ్‌’) తర్వాత కుటుంబసభ్యుల కోరిక మేరకు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆ పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించేందుకు వీలుగా తగు ఏర్పాట్లను ఆ ఫ్యునరల్‌ హోం అధికారులే చేస్తారు.

 

సాధారణంగా ప్రతి ఫ్యునరల్‌ హోం ఆవరణలోనూ పార్థివ దేహాన్ని ఖననం చేసే ఏర్పాటు ఉంటుంది. ఒకవేళ అక్కడ దహన సంస్కారాలు జరిపే వీలులేకుంటే, దగ్గర్లో ఉన్న ఫ్యునరల్‌ హోంలో అధికారులు తగు ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం సుమారు 3 నుంచి 4 వేల డాలర్లు ఖర్చవుతుంది.

 

సేకరించాల్సిన పత్రాలు

  • చనిపోయిన వ్యక్తి పాస్‌ పోర్టు
  • పార్థివ దేహం నుంచి ఎటువంటి అంటు వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు ధ్రువీకరిస్తూ స్థానిక ఆరోగ్య అధికారుల నుంచి అనుమతి పత్రం.
  • పార్థివ దేహాన్ని సీల్డ్‌ కంటైనర్‌లో భద్రపరచినట్లు ధ్రువీకరించే పత్రం.
  • కొన్ని సందర్భాల్లో అవసరమైతే పోలీసు అధికారుల నుంచి కావాల్సిన అనుమతి పత్రాలు.
  • కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అధికారుల నుంచి పార్థివ దేహాన్ని భారత్‌కు పంపడానికి అనుమతి పత్రం.
  • పార్థివ దేహాన్ని ఎవరైతే భారత్‌లో స్వీకరిస్తున్నారో వారి వివరాలు.
  • పార్థివ దేహాన్ని భారత్‌లో ఏ శ్మశాన వాటికలో దహనం లేదా ఖననం చేస్తున్నారో దాని చిరునామా వంటి వివరాలను సేకరించి విమానయాన అధికారులతో ఫ్యునరల్‌ హోం అధికిరారులు సంప్రదింపులు జరిపి పార్థివ దేహాన్ని భారత్‌కు తరలిస్తారు.
  • సాధారణ పరిస్థితుల్లో ఈ ఏర్పాట్లన్నీ పూర్తై.. పార్థివ దేహం భారత్‌కు చేరడానికి సుమారు 3 నుంచి 5 రోజులు పడుతుంది. దాదాపు 10 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది.


                                           - డా. ప్రసాద్ తోటకూర (ప్రముఖ ప్రవాస భారతీయుడు)                                                                    

Updated Date - 2022-08-08T21:26:54+05:30 IST