ఆత్మహత్య చేసుకున్న బొమ్మనబోయిన ఆవులయ్య
కలనూతలలో యువ రైతు ఆత్మహత్య
పెద్దారవీడు (మార్కాపురం), మార్చి 5 : అప్పులు జిల్లాలో మరో యువరైతు ఉసురుతీశాయి. పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిను బొమ్మనబోయిన ఆవులయ్య (36) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆవులయ్య తనకున్న 1.5 ఎకరాల పొలంలో మిరప, జొన్న సాగు చేస్తున్నాడు. వాటి సాగుకు అవసరమైన నీటి కోసం గత మూడేళ్లుగా పొలంలో ఆరు బోర్లు వేయించాడు. బోర్లకు, పంట పెట్టుబడుల కోసం రూ.15లక్షల వరకూ అప్పు చేశాడు. గురువారం రాత్రి పొలంలో కోసిన మిరపకాయలకు కాపలా కోసం వెళ్లాడు. రాత్రి 10గంటల సమయంలో భోజనం ఇవ్వడం కోసం భార్య కొండమ్మ, తన తల్లితో కలిసి పొలానికి వెళ్లింది. అయితే అక్కడ ఆవులయ్య పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్థులకు తెలియజేసి వారి సహకారంతో ఇంటికి తరలించేలోపు ఆవులయ్య మృతిచెందాడు. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కలనూతల వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామం. ఆవులయ్య ఇంటికి నష్టపరిహారం చెల్లించారు. కానీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అర్హుల జాబితాలో ఆయన పేరు లేదు. పెద్దారవీడు హెడ్ కానిస్టేబుల్ ఎస్.చెన్నారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.