తమిళుల్ని ఎవరూ కట్టడి చేయలేరు : రాహుల్‌ గాంధీ

ABN , First Publish Date - 2021-02-28T16:21:50+05:30 IST

రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం కట్టడి చేసినట్టు, తమిళ ప్రజలను ఎవరూ కట్టడి చేయలేరని, వారు అసెంబ్లీ ఎన్నికల్లో చక్కటి తీర్పును ప్రకటించనున్నారని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు....

తమిళుల్ని ఎవరూ కట్టడి చేయలేరు : రాహుల్‌ గాంధీ

చెన్నై(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం కట్టడి చేసినట్టు, తమిళ ప్రజలను ఎవరూ కట్టడి చేయలేరని,  వారు అసెంబ్లీ ఎన్నికల్లో చక్కటి తీర్పును ప్రకటించనున్నారని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం ఉదయం ఆయన రాష్ట్రంలో మూడో విడత ప్రచార పర్యటనను ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు తూత్తుకుడి వాసి కళాశాల ఆడిటోరియంలో జరిగిన కాంగ్రెస్‌ న్యాయవాదులతో భేటీ అయ్యారు. న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మధ్యాహ్నం ఒంటిగంటలకు తూత్తుకుడి క్రూస్‌ ఫెర్నాండ్‌ విగ్రహం కూడలి వద్ద ప్రజలతో భేటీ అయ్యారు. కోవంగాడు విలక్కువద్ద ఉప్పుకయ్యల కార్మికులు, మహిళలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆళ్వార్‌ తిరునగర్‌ కామరాజర్‌ విగ్రహం కూడలి వద్ద రోడ్‌షోలో పాల్గొన్నారు. సాత్తాన్‌కులం కామరాజర్‌ విగ్రమం కూడలి వద్ద ఓట్ల వేట సాగించారు. తూత్తుకడి రోడ్‌షోలో రాహుల్‌ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రజలు తమకు మేలుచేసే పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రజలకోసం పాటుపడే ప్రభుత్వాన్నే కోరుకుంటుందని, ఓ సిద్ధాంతం అమలు కోసం దేశాన్ని పాలించాలనుకునే దుష్టపాలనను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

ఆ తరువాత కోవంగాడు విలక్కువద్ద ఉప్పుకయ్యల కార్మికులను కలుసుకుని రాహుల్‌ వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశం పతన స్థితికి చేరుకుందని, పాలకులు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని, ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వా లను అక్రమ పద్ధతుల ద్వారా కూల్చివేసేందుకే ఆరాటపడుతున్నారని ధ్వజమె త్తారు. ఉప్పు కయ్యలలో పనిచేసే కార్మికులు ప్రతియేటా ఐదుమాసాలపాటు పనిలేకుండా కష్టాలు పడుతుంటారని, ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు తాను తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉప్పునీటి కయ్యలలో పనిచేసే కార్మికులకే కాకుండా దారిద్య్రరేఖకు దిగువగా ఉన్న పేదలందరికి ప్రతియేటా వారి బ్యాంకు ఖాతాలలో రూ.72 వేలు జమచేసే ‘న్యాయ్‌’ అనే పథకాన్ని కాంగ్రెస్‌ పాలనలో అమలు చేస్తామని రాహుల్‌ చెప్పారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు రాహుల్‌తో మాట్లాడుతూ తమ భర్తలు రోజువారి సంపాదనను తాగుడుకే తగలబెటుతున్నారని వాపోయారు. రాష్ట్రంలో మద్యనిషేధం అమలులోకి వస్తే ఈ సమస్య తొలగుతుందన్నారు. రాహుల్‌ వెంట టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి తదితర నాయకులు పర్యటించారు.

Updated Date - 2021-02-28T16:21:50+05:30 IST