Andrew Symonds: రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-15T13:19:14+05:30 IST

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

Andrew Symonds: రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ దుర్మరణం

క్విన్స్‌లాండ్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో గతరాత్రి జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ మృతి చెందినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఇటీవలే ఆ దేశానికి చెందిన స్టార్ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు Andrew Symonds మృతి ఆస్ట్రేలియా క్రీడాభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. నెలల వ్యవధిలోనే ఇలా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు నిష్క్రమించడం ఆసీస్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక సైమండ్స్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కంగారు జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 1998లో ఆసీస్ జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన సైమండ్స్ అతి తక్కువ కాలంలోనే జట్టులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.


అనంతరం ఆసీస్ జట్టు గెలిచిన మూడు వరల్డ్ కప్‌లలో భాగస్వామి అయ్యాడు. 2012లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి Andrew Symonds ముగింపు పలికాడు. ఆస్ట్రేలియా తరఫున తన కెరీర్‌లో మొత్తం 198 వన్డేలు ఆడిన సైమండ్స్ 5,088 పరుగులు, 133 వికెట్లు పడగొట్టాడు. అలాగే టెస్టుల్లో 26 మ్యాచులు ఆడి 1,462 రన్స్‌తో పాటు 26 వికెట్లు తీశాడు. అటు టీ20ల్లో 14 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించిన సైమండ్స్ 337 పరుగులు, 8 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ఆడాడు. 2008లో జరిగిన తొలి సీజన్‌లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ ఏకంగా రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. సైమండ్స్ మృతి పట్ల ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు, ఆసీస్‌ మాజీ ఆటగాడు అడమ్‌ గ్రిల్‌కిస్ట్‌, భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, పాక్‌ బౌలర్‌ షాయబ్‌ అక్తర్‌ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. 


సైమండ్స్- హర్భజన్ మంకీగేట్ వివాదం

ఆండ్రూ సైమండ్స్, భారత మాజీ క్రికెటర్, టర్పొనేటర్ హర్భజన్ సింగ్ క్రికెట్ కెరీర్లలో ఎప్పటికి గుర్తిండిపోయేది మంకీగేట్ వివాదం. 2008లో సిడ్నీ వేదికగా ఇండియా, ఆసీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల మధ్య మంకీగేట్ వివాదం తలెత్తింది. భజ్జీ తనను కోతి (Monkey) అన్నాడని సైమండ్స్ ఆరోపించాడు. అయితే, తాను 'మా.. కీ' అన్నానంటూ హర్భజన్ వివరణ ఇచ్చాడు. దీంతో హర్భజన్‌దే తప్పంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనిపై మూడు మ్యాచుల నిషేధం విధించింది. కానీ, ఈ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అనిల్ కుంబ్లే.. భజ్జీపై విధించిన నిషేధం ఎత్తివేయకపోతే సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వస్తుందని చెప్పడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి తగ్గింది. భజ్జీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇలా ఈ వివాదం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. 









Updated Date - 2022-05-15T13:19:14+05:30 IST