Advertisement

ఒకప్పటి బస్తీ ఫైటర్‌ నేటి ఫైట్‌ మాస్టర్‌!

Jan 17 2021 @ 00:30AM

తెరపై హీరో ఎంట్రీ అదిరిపోవాలంటే ఫైట్‌ సీన్‌ ఉండాలి. క్లైమాక్స్‌లో విజిల్స్‌ కొట్టించాలంటే ఫైట్‌ ఓ రేంజ్‌లో ఉండాలి. హీరో క్లాస్‌గా కొట్టినా, మాస్‌గా కొట్టినా వావ్‌ అనిపించాలి.అయితే ఆ ఫైట్‌లు అంత అద్భుతంగా రావడం వెనుక స్టంట్‌ మాస్టర్స్‌ కష్టం ఎంతో ఉంటుంది. సినిమాలే ధ్యాసగా పెరిగిన సతీశ్‌ ఇప్పుడు ఊర మాస్‌ ఫైట్‌లతో అలరిస్తున్నాడు.బస్తీ నుంచి వచ్చి తెలుగు చిత్రసీమలో తన ఫైట్‌ స్టయిల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నరియల్‌ సతీశ్‌ నవ్యతో పంచుకున్న ముచ్చట్లివి...


  హాయ్‌ సతీశ్‌... మీ పేరు ముందు రియల్‌ ఎలా వచ్చింది? 

నేను కంపోజ్‌ చేసే ఫైట్స్‌ అన్నీ రియల్‌గా అనిపిస్తాయి. మా అమ్మ ‘నీ పైట్లన్నీ రియల్‌గానే ఉంటాయి కదా! రియల్‌ సతీశ్‌ అని పెట్టుకోరా’ అని అంది. అలా రియల్‌ సతీశ్‌ను అయ్యాను.బాగున్నాను. 


  ఫైట్‌ మాస్టర్‌ అవ్వాలనే ఎందుకు అనుకున్నారు?

నేను పక్కా హైదరాబాదీ. బాల్‌నగర్‌ బస్తీలో పెరిగాను. మానాన్న శ్రీనివాసరావు ఫైటర్‌. చాలా సినిమాల్లో ఫైటర్‌గా చేశారు. నాన్నను చూస్తూ పెరిగిన నేను తెలియకుండానే ఈ రంగంపై ఆసక్తి పెంచుకున్నా. చిన్నప్పుడు టీవీలో, సినిమాలో ఫైట్‌ సీన్లు వస్తే కన్నార్పకుండా చూసేవాణ్ణి. బ్రూస్‌లీ సినిమాలు చూసి, ఆయనను అనుకరించేవాడి ని. అలా చిన్నతనం నుంచే నాలో స్టంట్స్‌ మీద  ఇష్టం పెరిగింది. మట్టి ఎక్కడ ఉంటే అక్కడక వెళ్లి పల్టీలు కొట్టేవాణ్ణి. స్కూలుకు వెళ్లింది తక్కువ. దాంతో ఏడో తరగతితోనే చదువుకు పుల్‌స్టాఫ్‌ పడింది. నిజం చెబుతున్నా నేను వేరే ఏ పనైనా చేయకపోయేవాణ్ణి. నాకు నచ్చింది, వచ్చింది ఫైట్స్‌ అంతే.. 


  సినిమాలోకి ఎంట్రీ ఎలా?

మానాన్న నాకు వారసత్వంగా ఫైటర్‌గా ఎంట్రీ కార్డు ఇచ్చారు. 2009లో ఫైటర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. వీర, వంగవీటి వంటి సినిమాలకు ఫైటర్‌గా చేశాను. పీటర్‌హెయిన్స్‌ వద్ద బాహుబలి 1 సినిమాకు ఫైటర్‌గా పనిచేస్తున్న సమయంలో పనిపట్ల ఆయన  అంకితభావం, ఆయన ఫైట్‌ కంపోజింగ్‌ స్టయిల్‌ చూసి నాకూ ఫైట్‌ మాస్టర్‌ కావాలనిపించింది.. ఇంకేం ల్యాప్‌టాప్‌లో డెమోస్‌ పట్టుకొని అవకాశాల కోసం దర్శకుల ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ణి.

ఎన్ని రోజులు తిరిగినా ఛాన్స్‌లు రాకపోవడంతో పిచ్చోడిని అయిపోతానేమోనని భయపడ్డారు ఇంట్లోవాళ్లు. అప్పటికే నాకు పెళ్లయింది. ఉద్యోగం లేకుండా ఛాన్స్‌ల కోసం తిరుగుంటే నాపై నమ్మకం ఉంచి ‘పిల్ల్లలను నేను చూసుకుంటా, కొన్ని రోజులు ప్రయత్నం చేయి. అవకాశం రాకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకో’ అని నా భార్య అనేది.   


  మొదటి ఛాన్స్‌ ఎలా వచ్చింది?

తెలుగులో ఫైటర్‌గా నా తొలి సినిమా నాగార్జున గారి కేడీ. తమిళంలో ‘గేమ్‌ ఓవర్‌’ సినిమా నాకు గుర్తింపుతో పాటు అవార్డు కూడా తెచ్చిపెట్టింది. తెలుగులో కౌసల్య (2015) నాకు మొదటిది. నా కెరీర్‌ మలుపు తిరిగింది మాత్రం డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ గారి వల్లే. ఆయన వాళ్ల అబ్బాయి ‘మెహబూబ’ సినిమాలో ఫైట్‌ మాస్టర్‌గా నాకు ఛాన్స్‌ ఇచ్చారు. ఆ సినిమాతో రియల్‌ సతీశ్‌ ఫైట్స్‌ కొత్తగా కంపోజ్‌ చేస్తాడని ఇండస్ట్రీలో అందరికీ తెలిసింది.

అయితే నన్ను నిలబెట్టిన సినిమా మాత్రం అజయ్‌ భూపతి ఆర్‌ఎక్స్‌ 100. ఆ సినిమాలో మార్కెట్‌ ఫైట్‌లో హీరో మేక తలతో విలన్లను కొడతాడు. ఆ ఫైట్‌ చూసి, చాలామంది ఫోన్‌ చేసి అభినందించారు. గీత గోవిందంలో చేసిన చిన్న ఎపిసోడ్‌ కూడా మంచి పేరు తెచ్చింది. 


  మిమ్మల్ని స్టంట్‌ మాస్టర్‌గా నిలబెట్టిన సినిమా ఏది?

ఇస్మార్ట్‌ శంకర్‌. పూరీ గారు రెండో సారి అవకాశమిచ్చి హైదరాబాద్‌ మాస్‌ ఫైట్‌ సీన్లు కావాలన్నారు. బస్తీలో పెరిగిన నాకు గల్లీలో జరిగే పైట్స్‌ ఎలా ఉంటాయో తెలుసు. దాంతో ఇస్మార్ట్‌ శంకర్‌కు ఫైట్స్‌ను రియలిస్టిక్‌గా కంపోజ్‌ చేశాను. ఆ సినిమాలో అన్ని పైట్స్‌ నాకు మంచి పేరు తెచ్చాయి.  


  క్లాస్‌, మాస్‌.. వీటిలో ఏ ఫైట్స్‌  ఈజీ?

నాకు రెండూ ఈజీనే. ఎందుకుంటే నేను నా పనిని ఎంతో ప్రేమిస్తా. డైరెక్టర్‌ నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చినప్పుడు వంద శాతం పర్‌ఫెక్ట్‌గా వచ్చేలా చూసుకుంటా. హీరో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అనుకోండి చేతిలో ఉన్న బ్యాగు లేదా ల్యాప్‌టాప్‌తో కొడతాడు. అదే మాస్‌ హీరో అనుకోండి చేతికి ఏది దొరికితే దాంతో కొడతాడు. మార్కెట్‌లో ఉన్నాడనుకోండి కూరగాయలతో కొడతాడు. హీరోలు కూడా రియలిస్టిక్‌గా ఫైట్స్‌ చేసేందుకే ఇష్టపడుతున్నారు.   


  ఒకప్పడు, ఇప్పుడు ఫైట్లకు తేడా ఏంటి?

ఒకప్పుడు ఫైట్‌ సీన్లు అన్నీ ఒకే రకంగా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కొత్త కొత్త స్టయిల్స్‌ వచ్చాయి. రియలిస్టిక్‌గా ఉంటున్నాయి. హీరోలు కూడా కష్టపడుతున్నారు.  ‘ఫైట్‌ సూపర్‌గా కంపోజ్‌ చేశాడురా!’ అని ప్రేక్షకులు అనుకున్నారంటే మా కష్టం ఫలించినట్టే.


  మీ నాన్న గారు మీ సక్సెస్‌ చూసి ఎలా ఫీలయ్యారు?

స్టంట్‌ మాస్టర్‌గా నేను పేరు తెచ్చుకుంటానని మా నాన్న గట్టిగా నమ్మేవారు. నాలో పట్టుదల ఎక్కువని, ఏది అనుకుంటానో అది కచ్చితంగా చేస్తానని ఆయననకు తెలుసు. నాన్న కొన్నాళ్లు నావద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు కూడా. ఇస్మార్క్‌ శంకర్‌ సినిమాను నాన్నతో కలిసి చూశాను. అందులోని ఫైట్‌ సీన్లు చూసి నాన్న ఆనందంతో ఏడ్చేశారు. ఆక్షణం కొడుకుగా నేను గెలిచానని అనిపించింది. నాన్న ఈమధ్యే అనారోగ్యంతో చనిపోయారు. 


  ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు?

సీటీమార్‌, నో పార్కింగ్‌, పుష్ప. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, శ్రీకారం సినిమాలకు చేస్తున్నా. క్రాక్‌లో కొన్ని ఎపిసోడ్స్‌ చేశాను. బాలీవుడ్‌లోనూ డైరెక్టర్‌ గణేశ్‌ ఆచార్యతో ఒక సినిమా చేస్తున్నా. యూరప్‌ లొకేషన్‌కు కూడా వెళ్లొచ్చాం.
 

లాక్‌డౌన్‌ సమయంలో బోర్‌ కొట్టకుండా హాలీవుడ్‌ సినిమాలో ఫైట్‌ సీన్లు ఆసక్తిగా చూసేవాణ్ణి. అలా నన్ను నేను అప్‌డేట్‌ చేసుకున్నాను. 


ఆర్‌ఎక్స్‌ 100 సినిమాకు ఫైట్‌ మాస్టర్‌గా వెండితెర అవార్డ్‌ అందుకున్నా.


ఇష్టమైన ఫైట్‌-  రామ్‌గోపాల్‌ వర్మ శివ సినిమాలో ఛెరున్‌ లాగే సీన్‌.  


ఇస్మార్ట్‌ శంకర్‌ చూసి ప్రభాస్‌, బన్నీ బాగా చేశావని మెచ్చుకున్నారు. 


నమ్మే ఫిలాసఫీ- అందరిది హీరో లైఫే. అయితే జీవితంలో ఏది కష్టపడకుండా రాదు. ప్రతి ఒక్కరూ సక్సెక్‌ అవుతారు. పక్కవాళ్ల గురించి ఆలోచించవద్దు. నీకు ఏం కావాలో, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో మరచిపోవద్దు. సంతోష్‌ బొందుగుల

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.