తప్పుడు కేసులతో హింసిస్తారా?

ABN , First Publish Date - 2022-05-12T09:28:40+05:30 IST

‘లేని రింగు రోడ్డుకు నా మీద కేసులు పెట్టారు. ఆ రోడ్డు నిర్మాణానికి నేను అనుమతి ఇచ్చానని, లాభం పొందానని అక్రమ కేసు నమోదు చేశారు. 43ఏళ్లుగా..

తప్పుడు కేసులతో  హింసిస్తారా?

లేని రింగు రోడ్డుకు నాపై కేసులు!

23 రాష్ట్రాల్లో మంచి పేరున్న

నారాయణ సంస్థలపై నిందలు: చంద్రబాబు

కుప్పంలో మూడు రోజుల పర్యటన షురూ


నారాయణ సంస్థలు సుమారు 23 రాష్ట్రాల్లో పేరు సంపాదించాయి. అలాంటి సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కానీ తప్పుడు కేసులు పెట్టి హింసించడం దారుణం. 

మద్యం దుకాణాల ఆదాయంలో సగం డబ్బులు నేరుగా జగన్‌కే వెళ్తున్నాయి. ఆయన జలగలా మారి రాష్ట్ర ప్రజల రక్తం తాగుతున్నాడు. చెత్త, మరుగుదొడ్డి.. అన్నిటిపైనా పన్ను వేస్తున్నాడు.

చంద్రబాబు


శాంతిపురం, మే 11 (ఆంధ్రజ్యోతి): ‘లేని రింగు రోడ్డుకు నా మీద కేసులు పెట్టారు. ఆ రోడ్డు నిర్మాణానికి నేను అనుమతి ఇచ్చానని, లాభం పొందానని అక్రమ కేసు నమోదు చేశారు. 43ఏళ్లుగా కష్టపడి 23 రాష్ట్రాల్లో తన విద్యా సంస్థలను విస్తరించి మంచి పేరు తెచ్చుకున్న నారాయణపై నిందలు వేస్తున్నారు’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గంలో మూడ్రోజులు పర్యటించేందుకు ఆయన బుధవారం ఇక్కడకు వచ్చారు. పర్యటన సాయంత్రం శాంతిపురం మండలం నుంచి ప్రారంభమైంది. అనికెర క్రాస్‌ వద్ద చంద్రబాబు మాట్లాడారు. ‘మామూలుగా రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతుకు పరిహారం ఇస్తాం. దానిని కూడా లాభంగా భావించి నన్ను ఏ-1గా, నారాయణను ఏ-2గా చేర్చారు. ఇలాంటి కేసులు నేను జగన్‌పై పెట్టుకుంటూ పోతే ఆయన జీవితాంతం జైల్లోనే ఉండిపోవలసి వస్తుంది. నారాయణ, చైతన్య వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలు మన రాష్ట్రంలో పుట్టి దేశమంతటా వ్యాప్తి చెందాయి. ఆ విద్యాసంస్థకు చైర్మన్‌గా లేని నారాయణను రాజకీయ దురుద్దేశంతో అరెస్టు చేశారు. ఒక్కగానొక్క కుమారుడి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పినా అనుమతివ్వలేదు. జగన్‌కు నిజంగా మానవత్వం లేదు. స్టంట్‌ వేసుకుని ఉన్న ఆయన్ను కావాలనే ఇబ్బందులకు గురిచేశారు’ అని ధ్వజమెత్తారు. సుమారు 60 మంది టీడీపీ ప్రధాన నాయకులను అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టారని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే..


అరాచకాలు వివరించేందుకే వచ్చా..

బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వ అరాచకాలను వివరించేందుకు వచ్చాను. జగన్‌ ఆ రోజుల్లో అందరికీ ముద్దులు పెట్టి, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. పక్క రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పోలిస్తే ఇక్కడ రూ.10 నుంచి 12 వరకు తేడా ఉంది. టీడీపీ ప్రభుత్వంలో ఏనాడూ విద్యుత్‌ కోతల్లేవు. ఇప్పుడేమో సరఫరా చేయని కరెంటుకూ అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు.ర్షాలకు అరటితోటలు దెబ్బతింటే నేను ఉన్నప్పుడు వెంటనే హెక్టారుకు రూ.50 వేలు చొప్పున పరిహారం ఇచ్చాను. ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడు. పుంగనూరు పుడింగి, మంత్రి పెద్దిరెడ్డి శ్రీకాకుళంలో మీటర్లు పెట్టామని, ఆరు నెలల్లో రాష్ట్రంలోని రైతుల బోర్లన్నిటికీ విద్యుత్‌ మీటర్లు అమరుస్తామని చెబుతున్నాడు. అలా చేస్తే రైతు మెడకు ఉరి వేసినట్లే! ఇప్పుడు మీటర్లు అంటారు. తర్వాత వాటికి ప్రీపెయిడ్‌ కార్డులు ఇస్తారు. సెల్‌ఫోన్లకు రీచార్జి చేసుకున్నట్లు మీటర్లకూ చేసుకోవాలని నిబంధన తీసుకొస్తారు. రెండేళ్లలో దిగిపోయే జగన్‌ మీటర్లు పెట్టేస్తే రైతులు పెద్దస్థాయిలో నష్టపోతారు. వారు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించాలి. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి జగన్‌ ఏకంగా ప్రభుత్వ దుకాణాలను తెరిచాడు. ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల అప్పు చేశాడు.


వచ్చే రెండేళ్లలో మరో రూ.3 లక్షల కోట్లు అప్పు తెస్తాడు. అతను దిగిపోయేనాటికి రూ.11 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌ చేస్తాడు. ఆ మొత్తం భారం రాష్ట్ర ప్రజలపై పడుతుంది. శ్రీలంకలోనూ ఇతడిలాగే ఓ అవినీతి ప్రధాని తన పాలనతో దేశాన్ని నాశనం చేశాడు. ప్రజలు తిరగబడ్డారు. మన రాష్ట్రంలోనూ అదే జరగనుంది. జగన్‌ ఇప్పుడేదో సంక్షేమం అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నాడు. నా హయాంలో రూ.86 వేల కోట్ల బడ్జెట్‌ ఉన్నప్పుడు 51 శాతం సంక్షేమ పథకాలకు కేటాయించి.. మిగిలిన నిధులతో అభివృద్ధి చేశాను. గత మూడేళ్లలో ఏ రోడ్డు గుంతలోనూ ఓ తట్ట మట్టి వేయలేదు. రాష్ట్రంలోని రోడ్లమీద ప్రయాణిస్తూ గుంతలో పడితే బండి నుజ్జవుతుంది. నడుము రెండవుతుంది. నేను హంద్రీ-నీవాను 88 శాతం పూర్తి చేస్తే, జగన్‌ మిగిలిన 12 శాతాన్నీ పూర్తి చేయలేకపోయాడు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను కొనసాగించి అక్కడి సీఎం స్టాలిన్‌ తన విజ్ఞతను చాటుకుంటే.. ఇక్కడ జగన్‌ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను మూసేసి పేదల పొట్ట కొట్టాడు.


ఆలస్యంగా మొదలైన పర్యటన 

చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలంలోని బెల్లకోకిల గ్రామానికి రావాల్సి ఉండగా 3గంటలు ఆలస్యంగా వచ్చారు. కర్ణాటకలోని బేతమంగళం-బెళ్లకోగిల మధ్యలో ఆయన కాన్వాయ్‌లోని జామర్‌ వాహనం టైరు పంక్చర్‌ కావడంతో 40 నిమిషాలు ఆలస్యమైంది. పుంగనూరులోని కొందరు వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో అనికెర గ్రామం వద్ద టీడీపీలో చేరారు.




Read more