టీడీపీ కుటుంబం జోలికి వస్తే వదలం

ABN , First Publish Date - 2022-01-14T08:44:03+05:30 IST

‘‘జగన్‌రెడ్డీ... నీ చెంచాలతో మాట్లాడించడం కాదు. ఽధైర్యం ఉంటే రా. బాబాయిని గొడ్డలితో చంపి గుండెపోటు అని చెప్పడం కాదు. మీరు చేసే పనులే మీ కార్యకర్తలు చేస్తున్నారు’’ అంటూ..

టీడీపీ కుటుంబం జోలికి వస్తే వదలం

  • హత్య చేసి...  నిందలు వేరే వారిపై వేస్తారా?
  • ర్యాలీ విజయవంతం కావడంతో ‘పీఆర్కే’నే చంపించారు
  • కుటుంబానికి పార్టీ నుంచి 25 లక్షలు ఇస్తున్నాం
  • పిన్నెల్లీ... హత్యా రాజకీయాలు మానుకో..బాబు హెచ్చరిక
  • చంద్రయ్య పాడె మోసిన అధినేత


మాచర్ల, జనవరి 13: ‘‘జగన్‌రెడ్డీ... నీ చెంచాలతో మాట్లాడించడం కాదు. ఽధైర్యం ఉంటే రా. బాబాయిని గొడ్డలితో చంపి గుండెపోటు అని చెప్పడం కాదు. మీరు చేసే పనులే మీ కార్యకర్తలు చేస్తున్నారు’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం జగన్మోహన్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. గురువారం రాత్రి గుండ్లపాడుకు వెళ్లిన ఆయన చంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబును చూడగానే వారంతా బోరున విలపించారు. చంద్రయ్య మృతదేహాన్ని చూసి ఆయన చలించిపోయారు. స్వయంగా పాడెమోసి చంద్రయ్య అంతిమ యాత్రలో పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన సభలో ప్రసంగించారు. ‘‘22 యేళ్లపాటు టీడీపీ పాలన చేసింది. మీలా హత్యా రాజకీయాలకు మేము పాల్పడితే ఒక్కరైనా మిగిలేవాళ్లా? వైసీపీ అధికారంలోకి వచ్చాక 33 మంది టీడీపీ నేతలను చంపారు. మీరు చేసిన హత్యలకు సమాధానం చెప్పి తీరాల్సిందే. హత్యా రాజకీయాలు చేసేది మీరు... నిందలు వేసేది వేరే వారిపై. ఒళ్లు దగ్గర పెట్టుకొండి. మీ గుండెల్లో నిద్రపోతా. టీడీపీ కుటుంబం జోలికి వస్తే వదిలేది లేదు’’ అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి చంద్రయ్య అని అన్నారు. 


చంద్రయ్య ఆత్మకు శాంతి కలగాలంటే ఆయన్ను చంపిన వాళ్లకు శిక్ష పడాలన్నారు.  చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, పార్టీ తరుఫున రూ.25 లక్షలు అందిస్తున్నామని ప్రకటించారు.  బ్రహ్మారెడ్డి ఇన్‌చార్జిగా నియమితులయ్యాక నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడంతో ఎమ్మెల్యే పీఆర్కే... ఓ మెసేజ్‌ ఇవ్వాలనే నేపంతో చంద్రయ్యను చంపించారని ఆరోపించారు. ‘‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డీ ఖబడ్దార్‌... నీలాంటి వాళ్లను చాలా మందిని చూశా. నీ గురించి తెలుసు... నీ చిన్నాన్న గురించీ తెలుసు...  మాచర్ల నీ జాగీరు కాదు. పల్నాడు నీ సొత్తు కాదు’’ అంటూ చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. ‘‘పిన్నెల్లీ ఏం అనుకుంటున్నావు..? మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మా నేత బొండా ఉమ , బుద్దా వెంకన్న ఇక్కడకు వస్తే దాడి చేయిస్తావా? ఏ రౌడీ చేత దాడి చేయించావో అతనికి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఇస్తావా? నువ్వు రౌడీయిజం చేయాలనుకుంటే అది అణిచివేయడం క్షణం కూడా పట్టదు. హత్యా రాజకీయాలు మానుకో’’ అంటూ చంద్రబాబు హితవు చెప్పారు. 


  • చంద్రయ్య పాడె మోసిన అధినేత

Updated Date - 2022-01-14T08:44:03+05:30 IST